చికిత్స కోసం చలో చెన్నై!

ABN , First Publish Date - 2021-05-07T07:48:03+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరోనా బాధితులు చికిత్స కోసం చెన్నైకి పరుగులు పెడుతున్నారు. ఏపీలోని ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ లేకపోవడం వల్లనో.. అక్కడ చికిత్స అందుతుందన్న నమ్మకం లేకనో.. అక్కడి నుంచి చెన్నై ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు...

చికిత్స కోసం చలో చెన్నై!

  • పోటెత్తిన ఏపీ కరోనా బాధితులు
  • ఆస్పత్రుల్లో సగం మందికిపైగా ఏపీ వారే
  • ఇదే అదనుగా అంబులెన్స్‌కు లక్ష వసూలు
  • ఆక్సిజన్‌ సిలిండర్‌కు రూ.25-40 వేలు

చెన్నై, మే 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరోనా బాధితులు చికిత్స కోసం చెన్నైకి పరుగులు పెడుతున్నారు. ఏపీలోని ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ లేకపోవడం వల్లనో.. అక్కడ చికిత్స అందుతుందన్న నమ్మకం లేకనో.. అక్కడి నుంచి చెన్నై ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. ఆక్సిజన్‌ అందని స్థితిలో అంబులెన్సుల్లో అక్కడి నుంచి తమిళనాడు రాజధానికి చేరుకుంటున్నారు. దీంతో నగరంలోని ఏ ఆస్పత్రిలో చూసినా సగం మందికిపైగా ఏపీ వారే కనిపిస్తున్నారు. అపోలో వంటి ప్రముఖ ఆస్పత్రి నుంచి చిన్నాచితకా ఆస్పత్రులు సైతం ఏపీ కరోనా బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఇదే అదనుగా కొందరు వివిధ మార్గాల్లో అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. బాధితుణ్ని ఒంగోలు నుంచి చెన్నైకి తీసుకొచ్చేందుకు అంబులెన్స్‌ వారు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఈ రేటు మరింత పెరిగిపోతోంది. నిజానికి సాధారణ రోజుల్లో అక్కడి నుంచి చెన్నైకి వచ్చేందుకు రూ.20 వేల వరకు వసూలు చేస్తారు. ఇక అంబులెన్సుతో పాటు రోగికి సరఫరా చేసే ఆక్సిజన్‌ సిలిండర్‌ కోసం రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు ప్రాణాలు కాపాడుకునేందుకు వారు అడిగినంత మొత్తం ఇస్తుండగా, పేదలు మాత్రం అక్కడే ‘ఆశ’లు వదులుకుంటున్నారని కొందరు వాపోతున్నారు.


Updated Date - 2021-05-07T07:48:03+05:30 IST