హద్దులు మీరుతున్న ఆంధ్రా పోలీసులు

ABN , First Publish Date - 2021-10-27T08:27:16+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల తీరుతెన్నులు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయా? డిజిపిగా గౌతమ్ సవాంగ్ వచ్చాక చట్టాల్ని పోలీసులు యధేఛ్చగా ఉల్లంఘిస్తున్నారా? ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్న వైసిపి ప్రభుత్వానికి...

హద్దులు మీరుతున్న ఆంధ్రా పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల తీరుతెన్నులు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయా? డిజిపిగా గౌతమ్ సవాంగ్ వచ్చాక చట్టాల్ని పోలీసులు యధేఛ్చగా ఉల్లంఘిస్తున్నారా? ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్న వైసిపి ప్రభుత్వానికి రాష్ట్ర పోలీసు వ్యవస్థ తొత్తుగా మారిందా? 


కొద్దికాలంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాల్ని, పోలీసుల వ్యవహార శైలిని పరిశీలిస్తున్న వారికి ఈ ప్రశ్నలు ఉదయించకమానవు. అధికారంలో ఉన్న పార్టీకి పోలీసులు అనుకూలంగా ప్రవర్తించడం మునుపెన్నడూ జరగలేదని కాదు. యూనిఫారం వేసుకున్న గూండాలు అని కోర్టులు గతంలో చాలాసార్లు పోలీసుల శైలి మీద వ్యాఖ్యానించాయి. కాని ఇప్పుడు ఏపిలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు హద్దులు మీరుతోంది. అధికార పార్టీ ప్రయోజనాలను రక్షించడమే తమ కర్తవ్యమన్నట్టు పోలీసుల విధి నిర్వహణ ఉంటోంది. 


తాజా పరిణామాలే చూడండి. దేశంలో మాదకద్రవ్యాల రవాణాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఉటంకిస్తూ, అధికార పార్టీ నేతలకు ఈ రవాణాతో సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ ఆరోపణల్ని ఖండించే హక్కు అధికార పార్టీకి ఉంది. అలాగే దీనిపై విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన పోలీసులు తమ వాణి వినిపిస్తే తప్పు పట్టాల్సిన పనిలేదు. కాని ఏపి పోలీసులు అక్కడితో ఆగడం లేదు. రాజకీయాల్లోకి చొరబడి రాజ్యాంగ పరిధులు దాటి సరికొత్త పాత్రని పోషిస్తున్నారు. ప్రతిపక్ష నేతలను తమ విరోధులుగా పరిగణించి, వారి మీద నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసుసంఘాల నేతల పేరుతో కూడా ప్రతిపక్ష నాయకులను దుయ్యబడుతున్నారు. ప్రతిపక్ష నేతల ఆరోపణలను ప్రచురించారని మీడియావారిని నోటీసులతో బెదరగొడుతున్నారు.


రాష్ట్రంలో అధికారపక్షానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవారిని బెదిరించడానికి, భయపెట్టడానికి పోలీసులు స్వయంగా పూనుకోవడం ఇటీవలి కొత్త పరిణామం. ఒకప్పుడు అరుదుగా జరిగే ఈ ఘటనలు ఇప్పుడు నిత్యకృత్యమయ్యాయి. ఇంకొక అడుగు ముందుకేసి, రాజకీయ వ్యాఖ్యలను, ప్రభుత్వం మీద విమర్శలను భారతీయ శిక్షాస్మృతి పరిధిలోకి ఆంధ్ర పోలీసులు తీసుకొచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే నేరం (క్రిమినలైజ్) కింద చేశారు. అందులో భాగంగా రాజకీయ విమర్శలు చేసిన ప్రతిపక్ష నేతలకు నోటీసులు ఇస్తున్నారు. అవి ఇచ్చే ప్రక్రియను కూడా వేధించడానికి ఒక మార్గంగా వాడుకుంటున్నారు. ఘాటు విమర్శలు చేస్తే చాంతాడు పొడుగు ఐపిసి సెక్షన్లు పెట్టి, సంబంధంలేని నేరాలను ఆపాదిస్తున్నారు. న్యాయవ్యవస్థలో ఉండే జాప్యాన్ని, పరిమితులను ఉపయోగించుకుని నేర నిరూపణతో సంబంధం లేకుండా బెయిలు వచ్చేవరకు జైళ్లలో ఉంచగలుగుతున్నారు. ఎంపీ రఘురామకృష్ణ రాజు దగ్గర నుంచి మాజీ మంత్రి నక్కా అనందబాబు వరకు ప్రభుత్వానికి నచ్చనివారి మీద పోలీసులు జులుం చేస్తూనే ఉన్నారు.


చిన్నదానికి పెద్దదానికి ప్రతిపక్ష నాయకుల మీద హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇటీవలి కాలంలో పోలీసులకు పరిపాటైంది. ఈ చట్టాల కింద పెట్టే కేసులు నాన్ బెయిలబుల్ అని తెలిసే దుర్వినియోగం చేస్తున్నారు. ఎంతో బాధ్యతతో అమలు చేయాల్సిన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధ చట్టాన్ని పాలకపక్ష ప్రత్యర్థులను వేధించడానికి ఆయుధంగా పోలీసులు ప్రయోగిస్తున్నారు. మాజీ మంత్రులతో పాటు ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న దళితరైతుల మీదనే ఎస్సీ, ఎస్టీ కేసులను పెట్టే వరకు వెళ్లారు. రాజకీయ కారణాలతో ఏపిలో ఇటీవల డజన్ల కొద్దీ నమోదు చేస్తున్న ఈ కేసుల వల్ల అత్యాచారాల చట్టం పలచనయ్యే ప్రమాదం ఏర్పడింది. 


సామాజిక అవసరాల కోసం రూపొందించుకున్న చట్టాల్ని కూడా వక్రీకరించి అణిచివేతకు ఉపయోగించుకునే ఫాసిస్టు ప్రజాస్వామ్యం ఇప్పడు దేశమంతటా వర్థిల్లుతోంది. ఈ కోవలోనే కొవిడ్ నిబంధనల పేరుతో కూడా చాలాకాలం పాటు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే హక్కును ఏపి పోలీసులు హరించారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల మీద నిబంధనల ఉల్లంఘన పేరుతో లెక్కకు మిక్కిలి కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రతిపక్షాల మీద దాడులకు తెగబడ్డ వారిని నిలువరించకపోవడమే కాకుండా, బాధితుల మీదనే కేసులు పెట్టడమనే మరొక దుశ్చర్యకు ఏపి పోలీసులు పాల్పడుతున్నారు.


తాజాగా రెండు ఘటనలు - టిడిపి ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటి మీద, ఆ తర్వాత టిడిపి కేంద్ర కార్యాయలం మీద వరుసగా జరిగిన దాడులు, ఆ తర్వాతి పరిణామాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. పట్టాభిరామ్ కొంతకాలంగా ప్రభుత్వం మీద ఆధారాలతో సహా చేస్తున్న విమర్శలు పదునుగా ఉంటున్నాయి. అందుచేత ఆయన మీద అధికార పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంతకుముందు రెండుసార్లు ఆయన మీద గుర్తుతెలియని దుండగులు విజయవాడలో పట్టపగలే దాడి చేశారు. తాజాగా మాదకద్రవ్యాల అంశం మీద పరుషవ్యాఖ్యల నేపథ్యంలో పట్టాభి మీద దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులకు స్పష్టంగా తెలుసు. అయినా ఆయనకు ఎటువంటి రక్షణ కల్పించలేదు. అనుకున్నట్టుగానే ఆయన ఇంటి మీద పట్టపగలే దాడిచేశారు. ఇంత దారుణం జరిగితే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బాధ్యులైన ఆగంతకుల్ని పట్టుకుంటారని అనుకుంటాం. కాని పట్టాభి ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసుల్ని మోహరించి, తలుపులు పగలగొట్టి ఆయన్నే అరెస్టు చేశారు. 


అదే రోజు డిజిపి ఆఫీసుకి కూతవేటు దూరంలో ఉన్న తెలుగుదేశం కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. దుడ్డుకర్రలు, పెద్ద సుత్తులతో లోపలి ఉద్యోగుల్ని భయభ్రాంతులు చేశారు. కొంతమందిని రక్తం కారేలా దెబ్బలు కొట్టారు. బయట పార్కు చేసి ఉన్న కార్లను ధ్వంసం చేశారు. లోపల ఆస్తి నష్టం చేశారు. ఇవన్నీ రహస్యంగా, దొంగతనంగా చేయలేదు. పట్టపగలే నిరాఘాటంగా, నిర్భయంగా ఈ దురాగతానికి పాల్పడ్డారు. ఇవన్నీ సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. టీవీల్లో ప్రసారమయ్యాయి. 


అయితే ఆంధ్ర పోలీసులు ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ నాయకుల మీదే ఎదురు కేసులు పెట్టారు. అదీ హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ కేసులు. సిఎం మీద దూషణ జరిగిందా లేదా అనేది పక్కనబెడితే, దాడులకి తెగబడటం కంటే అదే పెద్ద ఘోరమన్నట్టు పోలీసుల వైఖరి ఉంది. పట్టపగలే పట్టాభి ఇంటి మీద దాడి చేయడం, టిడిపి కేంద్ర కార్యాలయంలోకి చొరబడి, హింసకు, ధ్వంసానికి పాల్పడటం దీనికి సరైన, చట్టబద్ధమైన జవాబు అన్నట్టు పోలీసులు వ్యవహరించడం మరో ఎత్తు.


ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టాభి దుర్భాషలాడారని స్వయంగా జగన్మోహన్ రెడ్డే ఆరోపించారు. నిజానికి సిఎంను ఉద్దేశించి పట్టాభి వ్యాఖ్యలు చేయలేదని ప్రెస్‌మీట్ వీడియోని చూసినవారందరకీ తెలుసు. అయినా సభ్యత, సంస్కారాన్ని మరిచి తిట్ల పురాణాన్ని ఎత్తుకోవడంలో అధికారపార్టీ నేతల ముందు మిగతా వారందరూ బలాదూరే. మంత్రులతో సహా వైసిపి నేతలు ఇంతకు పదిరెట్లు ఎక్కువగానే బూతులు మాట్లాడిన విషయం అందరికీ తెలుసు. తాజా ఘటన తర్వాత టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి మీద అధికార పార్టీ నాయకులు వాడిన బజారు భాష పోలీసులకు వినిపించలేదు కాబోలు. వాటి జోలికి వెళ్లని పోలీసులు, ముఖ్యమంత్రిని, అధికార పార్టీని మాత్రం పల్లెత్తు మాట అన్నా పెద్ద నేరమన్నట్టు ప్రవర్తిస్తున్నారు. 


అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే ఈ ధోరణిని పోలీసుల్లో అరికట్టేందుకు, రాజకీయ నాయకుల కబ్జా నుంచి శాంతిభద్రతల వ్యవస్థను కాపాడేందుకు జాతీయస్థాయిలో అనేక ప్రయత్నాలు జరిగాయి. జాతీయ, రాష్ట్ర మానవహక్కుల కమిషన్లు (NHRC, SHRC) ఈ పరిణామాలను నియంత్రించేందుకే ఏర్పడ్డాయి. తాజాగా పోలీసు కంప్లయింట్స్ అథారిటీ చట్టాన్ని కూడా కేంద్రం తీసుకొచ్చింది. 


రాష్ట్ర మానవహక్కుల సంఘాలను అన్ని రాష్ట్రప్రభుత్వాలు ఇప్పటికే నిర్వీర్యం చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఈ సంఘానికి జస్టిస్ ఎం సీతారామమూర్తి చైర్మన్‌గా ఉన్నారు. కర్నూలులో దాని కార్యాలయం పెట్టారు. హక్కులకు భంగం కలిగితే, ఈ సంఘానికి సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఉంది గానీ, అధికారులను శిక్షించే అధికారం లేదు. అందువల్ల ఈ పదవి అలంకారప్రాయమే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడ్డ పోలీసు కంప్లయింట్స్ అధారిటికి కూడా ఇదే గతి పట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరవాడని పేరున్న జస్టిస్ వి కనగరాజ్ దానికి చైర్మన్‌గా నియమితులయ్యారు. పోలీసుల అత్యాచారాల మీద సూమోటోగా విచారించే అధికారం చైర్మన్‌కి ఉంది. ఈ పదవి పునరావాసం మాత్రమే అనుకుంటున్న దశలో, ఆయన నియమాకం మీద పోయిన నెలలో ఏపి హైకోర్టు స్టే ఇచ్చింది. పోలీసుల విధి నిర్వహణలో రాజకీయ జోక్యం లేకుండా, చట్ట ఉల్లంఘనలు లేకుండా చూడాలన్న ప్రయత్నాలు ఈ రకంగా ఫలించడం లేదు.


ఏ పార్టీ అధికారంలో ఉన్నది అనేది ప్రధానం కాదు. ఇంత నిర్జజ్జగా, నిర్భీతిగా, భవిష్యత్ పరిణామాల్ని లెక్కచేయకుండా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఏకపార్టీ స్వామ్యానికి దారితీస్తుంది. ఈ దాష్టీకానికి కోర్టులు కొంతమేర అడ్డుకట్టవేస్తున్నా, దీన్ని మొత్తంగా సరిదిద్దగల రాజ్యాంగ వ్యవస్థలు దేశంలో కనిపించడం లేదు. ఏ చీకట్లకీ ప్రస్థానం?

కందుల రమేష్

సీనియర్‌ జర్నలిస్‌్ట

Updated Date - 2021-10-27T08:27:16+05:30 IST