Advertisement
Advertisement
Abn logo
Advertisement

పౌరులకు గౌరవ, మర్యాదలుండవా?

అసెంబ్లీ, పార్లమెంటులలో ఆయా సభల సభ్యులకేగానీ సాధారణ పౌరులకు గౌరవ, మర్యాదలు ఉండవా? సాధారణ పౌరుల గురించి సభలో సభ్యులు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా మౌనంగా భరించాల్సిందేనా? తమ ఓట్ల ద్వారా వారిని చట్టసభలకు పంపిన ప్రజలకు ఆ సభ్యులు గౌరవం ఇవ్వరా? ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో సభలో లేని ఒక సాధారణ గృహిణి గురించి చేయకూడని వ్యాఖ్యలు చేసినవారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇటువంటి ప్రశ్నలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 19(2) ప్రతి పౌరునికి భావక్యక్తీకరణ స్వేచ్ఛను కల్పించింది. అదే సమయంలో ఇతరుల గౌరవానికి, స్వేచ్ఛకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేసినవారిపై చర్యలు తీసుకునే అంశాన్ని కూడా ప్రస్తావించింది.


ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ఆర్టికల్‌ 105(1) ద్వారా ప్రత్యేక స్వేచ్ఛను కల్పించింది. ఆర్టికల్‌ 361 ప్రకారం, సభ వాయిదా వేయడానికి 40 రోజుల ముందు లేదా తర్వాత, సభ జరుగుతున్నప్పుడు సభ్యులను ఏదైనా సివిల్‌ కేసు విషయంలో అరెస్టు చేయకూడదు. ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే క్రిమినల్‌ కేసుల విషయంలో ముందస్తు అనుమతి లేకపోయినా అరెస్టు చేయవచ్చు. కానీ చాలా సందర్భాలలో క్రిమినల్‌ అంశాల విషయంలో కొంతమంది సభ్యులు ఆర్టికల్‌ 361ని అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.సభలో సభ్యులు చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలు సభకు సంబంధినవి కావని స్పీకర్‌ వాటిని రికార్డుల నుంచి తొలగించినప్పుడు, ఆ తరహా వ్యాఖ్యలు, ప్రకటనలు చేసిన వ్యక్తి తప్పుచేసినట్లే అవుతుంది కదా. అటువంటి తప్పులు చేసిన వ్యక్తి ప్రజాప్రతినిధి కావడం వల్ల అతడికి ఎటువంటి శిక్ష ఉండదా? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అన్నప్పటికీ సాధారణ ప్రజలు భరించాల్సిందేనా? తమ సర్వసత్తాక హక్కు అయిన ఓటు ద్వారా చట్టసభలకు పంపిన ప్రజలకు లేని హక్కులు సభ్యులకు ఎలా సంక్రమిస్తాయి? ఆర్టికల్‌ 105(1) ద్వారా ప్రత్యేకంగా లభించిన స్వేచ్ఛ ప్రజలకు చట్టసభ వేదికగా ప్రజలను అగౌరవపర్చడానికి కాదు.


సభ్యుడు స్పీకర్‌ అనుమతితో మాట్లాడలేదు కాబట్టి అటువంటివి రికార్డు కావని, ఒకవేళ రికార్డు అయినా ఆ మాటలను స్పీకర్‌ రికార్డులను తొలగిస్తే సరిపోతుంది అనే భావన ఎంత వరకు సబబు?సభలోని సభ్యులను కించపరుస్తూ, సభా గౌరవానికి భంగం కలిగిస్తూ వ్వాఖ్యానాలు చేసినవారిపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ఆయా వ్యక్తులకు, సంస్థలకు సమన్లు జారీ చేసి విచారణ చేసే హక్కు శిక్ష విధించే హక్కు స్పీకర్‌కు ఉంది. ఇందుకు సంబంధించి పలు ఉదాహరణలు కూడా ఉన్నాయి. సభలో లేకపోయినా, సాధారణ పౌర జీవనంలో ఉన్న వ్యక్తి లేదా సంస్థకు సమన్లు జారీ చేయగల అధికారం స్పీకర్‌కు వున్నప్పుడు సాధారణ పౌరుడు లేదా సంస్థలు కూడా చట్టసభల సభ్యుల ద్వారా తమ వ్యక్తిత్వానికి, ఆత్మగౌరవానికి అవమానం గురించి స్పీకర్‌కు ఫిర్యాదు చేసుకొనే అవకాశం కల్పించాలి. న్యాయస్థానం తరహాలోనే స్పీకర్‌ కూడా ప్రజల ఫిర్యాదులపై విచారించి చట్టసభల సభ్యులపై చర్యలు తీసుకునే విధంగా చట్టాలను సవరించాల్సి వుంటుంది. లేదంటే చట్టసభలను వేదికగా చేసుకుని ఏదైనా మట్లాడవచ్చుననే భావన సభ్యులలో ఏర్పడుతుంది.సభలో సభ్యులను కట్టడి చేయాల్సిన బాధ్యత స్పీకర్‌దే.


స్పీకర్‌ మాటలను ఖాతరు చేయని సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం కూడా ఉంటుంది. అందువల్ల సభలో లేని పౌరుల గౌరవ, మర్యాదలకు భంగం కలిగించే విధంగా మాట్లాడే సభ్యులను కేవలం నోటితో వారించడం లేదా రికార్డులను తొలగించడం వల్ల సభలో అవమానానికి గురైన పౌరుని మనసుకు కలిగిన గాయం మాసిపోదు. అందువల్ల సభలో లేని వ్యక్తుల, పౌరుల గౌరవ, మర్యాదలకు భంగం కలిగించే విధంగా మాట్లాడే సభ్యులపై స్పీకర్‌ నిర్దుష్టంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే గౌరవ, మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిన సభ్యునిపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేసుకొనే అవకాశం సాధారణ పౌరులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.-


అన్నవరపు బ్రహ్మయ్య

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...