ఏపీలో కాక పుట్టిస్తున్న కమలనాథుల రాజకీయాలు..!

ABN , First Publish Date - 2020-10-24T15:58:02+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కమలనాథుల రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. హైకమాండ్‌కు ఫిర్యాదులు చేస్తూ పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు. రాష్ట్ర కొత్త అధ్యక్షులు తమ వర్గానికి పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

ఏపీలో కాక పుట్టిస్తున్న కమలనాథుల రాజకీయాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో కమలనాథుల రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. హైకమాండ్‌కు ఫిర్యాదులు చేస్తూ పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు. రాష్ట్ర కొత్త అధ్యక్షులు తమ వర్గానికి పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రాష్ట్రంలో పార్టీ బలపడేందుకు పెద్దగా ప్రయత్నాలు జరగడం లేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయట. వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకోలేకపోతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలపై ప్రత్యేక కథనం మీకోసం...


కన్నా తరహాలో లేని పోరాట పటిమ..

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీలో విభేదాలు రేగుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తరహాలో సోము వీర్రాజు... జగన్‌ ప్రభుత్వంపై పోరాటం చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయట. కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధానంగా ఇసుక సమస్యపై పోరాటాలకు దిగారు. రాజధాని రైతులకు మద్ధతుగా నిలిచారు. అంతేకాదు అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర పార్టీకి పంపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ జగన్‌ సర్కార్ తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. హైకోర్టులో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేయడానికి.. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పిటిషన్ వేసేందుకు అనుమతి ఇచ్చారు. తన టర్మ్‌లో ఇలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు కన్నా లక్ష్మీనారాయణ. ఆ తర్వాత ఢిల్లీలో ఏమి జరిగిందో ఏమో తెలియదుగానీ... రాత్రికిరాత్రే ఆయనను తప్పించి.. ఆ స్థానంలో సోము వీర్రాజును నియమించారు.


కన్నా వర్గీయులే టార్గెట్...

ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ పదవీకాలం పూర్తయిందని బీజేపీ నేతలు వివరణ ఇచ్చారు. అయితే ఇక్కడే ఓ మతలబు ఉంది. కన్నా లక్ష్మీనారాయణను తొలగించే సమయంలో కనీసం ఆయనకు ఎవరు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పలేదట. వారం రోజుల తర్వాత ఢిల్లీ నుంచి కీలకనేత ఒకరు ఫోన్ చేసి వివరణ ఇచ్చారట. ఆ తర్వాత సోము వీర్రాజు పదవీ బాధ్యతల స్వీకరణ, పార్టీ రాష్ట్ర కార్యాలయం గుంటూరు నుంచి విజయవాడకు మార్చేశారు. ఈలోపే రాజధాని అంశంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీలో మూడు రాజధానుల అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దాంతో రాష్ట్ర పార్టీ అభిప్రాయం, కేంద్ర ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీతో ఒకవర్గం మూడు రాజధానులకు అనుకూలంగా తెరవెనుక పనిచేస్తుందని ఆరోపణలొచ్చాయి. కన్నాకు అనుకూలంగా ఉన్నవారిని దూరం పెట్టడం, ఆయనకు సన్నిహితంగా ఉన్న వారికి షోకాజ్ నోటీసులు లేదా సస్పెన్షన్లు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర కమిటీలో కూడా కన్నా వర్గీయులెవరికీ స్థానం దక్కలేదు. మాజీ అధికార ప్రతినిధి లంకా దినకర్ సస్పెండ్‌తో మొత్తం నలుగురి సస్పెన్షన్లు, ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.


కూర్చోని చర్చిద్దామని చెప్పినా...

నిజానికి లంకా దినకర్ జులై 26వ తేదీన జరిగిన డిబేట్‌లో మాట్లాడిన అంశాలకు సంబంధించి ఇచ్చిన వివరణతో అప్పటి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సంతృప్తి చెందారు. లంకా దినకర్‌కు కరోనా సోకడంతో 40 రోజులు చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే దినకర్‌ను సస్పెండ్ చేసిన తర్వాత సోము వీర్రాజు.. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారట. తాను విశ్రాంతిలో ఉన్నాననీ.. 10 రోజుల తర్వాత కూర్చోని అన్ని విషయాలు చర్చిద్దామనీ చెప్పినట్లు సమాచారం. ఏ తప్పు చేయకపోయినా తనపై చర్యలు తీసుకోవడం అన్యాయమనీ.. వెంటనే తనపై విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేయాలని దినకర్‌ కోరారట. మరోవైపు రాష్ట్రంలో కొంతమంది బీజేపీ నేతల వ్యవహారశైలిపై ఇప్పటికే కొందరు పార్టీ సీనియర్లు జాతీయ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది.


పరామర్శించిన పాపానపోలేదు...

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఇంత జరిగినా రైతులు, ప్రజలను బీజేపీ నేతలు ఎవరు పరామర్శించిన పాపానపోలేదని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు ఆఫ్ ద రికార్డ్‌గా చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు అస్వస్థతకు గురైతే మిగిలిన నేతలు ఏం చేస్తున్నారనే సదరు నాయకుడు ప్రశ్నించారట. జనం కష్టాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం మానేసి..పార్టీలో ప్రాబల్యాలు పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించినట్లు తెలుస్తోంది. కొందరు నేతలు అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడటాన్ని ఆయన గుర్తుచేసినట్లు సమాచారం. ఓవైపు జనసేన నేతలు వరద బాధితులను పరామర్శించి వారికి మద్దతుగా నిలిస్తే...మరోవైపు కమలనాథులు మాత్రం తీరిక లేకుండా అంతర్గత కుమ్ములాటలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ బలపడేందుకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని మరో నాయకుడు ఆరోపించారట. మరి తమపై వ్యక్తమవుతున్న విమర్శలకు సోమ్‌ వీర్రాజు ఆయన టీమ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Updated Date - 2020-10-24T15:58:02+05:30 IST