ఆ పార్టీపై ఉన్న కోపాగ్ని సెగ జనసేనానికి తాకిందా?

ABN , First Publish Date - 2020-11-22T18:20:45+05:30 IST

బీజేపీతో స్నేహబంధం సాగిస్తున్న జనసేనాని పవన్‌కల్యాణ్‌కు.. ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న కోపాగ్ని సెగ తాకిందా? రాజధాని, మరికొన్ని అంశాలపై కాషాయ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.. మిత్రపక్షం జనసేన పార్టీ శ్రేణులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందిగా మారాయా? జనసైనికులతో

ఆ పార్టీపై ఉన్న కోపాగ్ని సెగ జనసేనానికి తాకిందా?

బీజేపీతో స్నేహబంధం సాగిస్తున్న జనసేనాని పవన్‌కల్యాణ్‌కు.. ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న కోపాగ్ని సెగ తాకిందా? రాజధాని, మరికొన్ని అంశాలపై కాషాయ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.. మిత్రపక్షం జనసేన పార్టీ శ్రేణులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందిగా  మారాయా? జనసైనికులతో సమావేశమైన జనసేనానికి తెలిసొచ్చిన వాస్తవ పరిస్థితులు ఏవి? వాటిపై పవన్‌కల్యాణ్‌ మనోగతం ఎలా ఉంది? ఈ కథనంలో తెలుసుకుందాం..


ఎనిమిది నెలల తరువాత...

సుమారు ఎనిమిది మాసాల తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ అమరావతికి వచ్చారు. పార్టీ క్రియాశీల కార్యకర్తలు, గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు ఆయా నియోజకవర్గాల నేతలు, రాజధాని ప్రాంత రైతులు, రాజధాని కార్యాచరణ సమితి నాయకులు, రాజధాని అసైన్డ్ రైతులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. రాజధాని ప్రాంత రైతులతోపాటు మహిళలు ఐదొందల మంది ఆయనతో భేటీ అయ్యారు. అంతకుముందు పార్టీ క్రియాశీలక కార్యకర్తలు, నాయకులతో పవన్ కల్యాణ్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తొలుత వారి అభిప్రాయాలు, ఏపీలోని ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులను పార్టీ అధినేత తెలుసుకున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు, మహిళల ఆందోళన.. క్రమేణా అన్ని జిల్లాల్లో సానుభూతి తెచ్చిపెడుతుందనీ, ముఖ్యంగా రాజధాని మహిళలు పెట్టుకున్న కన్నీళ్లు, వారి ఆవేదన అందర్నీ కదిలిస్తున్నాయనీ జనసేనానికి జనసైనికులు వివరించారు.


ఆ ప్రభావం జనసేనపై కూడా...

ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా.. ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకతను తెచ్చిపెడుతున్నాయని జనసైనికులు పవన్‌తో చెప్పారు. ఈ ప్రభావం జనసేనపై కూడా పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బీజేపీ.. రాష్ట్ర రాజధాని అమరావతే అని ఏకగ్రీవ తీర్మానం చేసింది కదా? అని పవన్ ప్రశ్నించినట్టు తెలిసింది. కానీ పార్టీ వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు అనే వాదనను ఎవరూ నమ్మడం లేదని జనసైనికులు వివరించారు. రాజధాని అంశం తమకు సంబంధంలేదని కేంద్రం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఈ సందర్భంగా వారు ప్రస్తావించడం గమనార్హం.


ఎందుకిలా జరుగుతోంది...

మరోవైపు రాజధాని రైతులు, రాజధాని ఐక్యకార్యాచరణ సమితి నాయకులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై పవన్ కల్యాణ్ ఎందుకిలా జరుగుతుందని ఆరా తీశారు. చివరకు ఆయన.. రాజధాని ఐక్యకార్యాచరణ సమితి నాయకులు, తమ పార్టీ క్రియాశీల కార్యకర్తలు చేసిన వ్యాఖ్యలపై కుండబద్దలు కొట్టారు. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకొనే సమయంలో.. అమరావతే రాజధాని అని తనతో చెప్పారనీ, బీజేపీ హైకమాండ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందనీ, ఈ అంశంపై ఇరువర్గాల మధ్య స్పష్టత వచ్చిందనీ వివరించారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో నెలకొన్న సందిగ్ధతను తొలగించాల్సిన అవసరముందని కూడా ఆయన అంతర్గత చర్చల్లో అభిప్రాయపడినట్టు తెలిసింది. 


బీజేపీపై కోపాగ్ని సెగ జనసేనానికి తాకిందని..

ఇక ఇటీవల కొందరు బీజేపీ నేతలు.. రాజధాని, మరికొన్ని అంశాలపై చేసిన వ్యాఖ్యలు మిత్రపక్షం జనసేనపైనా ప్రభావం చూపేలా ఉన్నాయని పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజధాని మహిళలు ధరించే శారీలు, బంగారం గురించి మాట్లాడిన అంశాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. మహిళలను అగౌరవపర్చడం మంచిదికాదనీ, పైగా బహిరంగ సమావేశంలోనే రైతులు, మహిళలు కన్నీరు పెట్టడం రాష్ట్రానికి అరిష్టమనీ సూచించారు. మొత్తానికి కొంతమంది బీజేపీ నేతల ప్రకటనలపై రాష్ట్ర ప్రజల్లో రేగిన కోపాగ్ని సెగ జనసేనానికి పవన్‌ కల్యాణ్‌ను తాకిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాజధాని అంశంపై నేరుగా కేంద్రంలోని బీజేపీ హైకమాండ్‌తో మాట్లాడితే బాగుంటుందని జనసైనికులు పవన్‌కు స్పష్టం చేశారు. మరి జనసేనాని.. రాజధాని అంశంపై కాషాయ పార్టీ కేంద్ర పెద్దలతో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

Updated Date - 2020-11-22T18:20:45+05:30 IST