ఆంధ్రప్రదేశ్‌ సహకరించట్లే

ABN , First Publish Date - 2021-07-23T07:31:06+05:30 IST

ప్రతిపాదిత రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించడానికి

ఆంధ్రప్రదేశ్‌ సహకరించట్లే

  • రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శనకు అంగీకరించడం లేదు
  • ఇప్పటి వరకు నోడల్‌ అధికారిని కూడా నియమించలేదు
  • జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కృష్ణా బోర్డు అఫిడవిట్‌


  న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ప్రతిపాదిత రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహకరించడం లేదని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తెలిపింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)లో నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై కృష్ణా బోర్డు గురువారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఉల్లంఘనలు జరుగుతున్నాయో? లేదో? తెలుసుకోడానికి తాము చాలా సార్లు ప్రయత్నించామని పేర్కొంది.


గత మార్చిలో ప్రాజెక్టును సందర్శించడానికి కేంద్ర జల శక్తి అధికారులతోపాటు తాము వస్తున్నామని, నోడల్‌ అధికారిని నియమించాలని లేఖ రాయగా.. విభజన చట్టాన్ని ఉల్లంఘించి తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులను తొలుత సందర్శించాలని ఏపీ ప్రభుత్వం తమకు లేఖ రాసిందని వెల్లడించింది. ఆ తర్వాత కూడా తాము అనేక ప్రయత్నాలు చేశామని అఫిడవిట్‌లో పేర్కొంది. ఆ వివరాలు..


 ఏప్రిల్‌ 7 -8 తేదీల్లో ప్రాజెక్టును సందర్శిస్తామని మార్చి 31న ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశాం. దానికి ఏపీ స్పందిస్తూ... పూర్తి స్థాయి బోర్డు సమావేశం నిర్వహించాలని కోరింది. అప్పటిదాకా ప్రాజెక్టు సందర్శన రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకోవాలని, తక్షణమే నిజనిర్ధారణ కమిటీని పంపించాలని జూన్‌ 21న తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాకు లేఖ రాశారు.


ప్రాజెక్టును సందర్శనకు ఏపీ సహకరించనందున అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతిచ్చే వరకూ ప్రాజెక్టుపై ముందుకువెళ్లొదని జూన్‌ 22న ఆదేశించాం. జూలై 6-7 తేదీల్లో ప్రాజెక్టును సందర్శిస్తామని అదే నెల 3న ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశాం. దానికి స్పందించిన ఏపీ... తెలంగాణలోని అనధికార ప్రాజెక్టులతోసహా తాము లేవనెత్తిన అంశాలపై నిర్ణయం తీసుకునే వరకూ సందర్శనను వాయిదా వేయాలని కోరింది.


Updated Date - 2021-07-23T07:31:06+05:30 IST