ఏపీ మంత్రికి కరోనా.. బెంబేలెత్తుతున్న ఎమ్మెల్యేలు, అధికారులు

ABN , First Publish Date - 2020-09-28T22:01:42+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఏపీలో రోజురోజుకు విస్తరిస్తోంది.

ఏపీ మంత్రికి కరోనా.. బెంబేలెత్తుతున్న ఎమ్మెల్యేలు, అధికారులు

కాకినాడ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఏపీలో రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఈ వైరస్ సోకింది. వారంతా దాదాపు కరోనాను జయించి యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా మంత్రి వేణుగోపాలకృష్ణ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయనతో గత పది, పదిహేను రోజులుగా కాంటాక్ట్‌లో ఉన్న, కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు కరోనా టెస్టులు చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం.


జగన్‌తో కలిసి బ్రహ్మోత్సవాల్లో..

ఇదిలా ఉంటే.. మంత్రి వేణుగోపాల్‌కు గత వారం రోజులుగా పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో మంత్రి.. జగన్ వెంటే ఉన్నారు. ఈయనతో పాటు ఒకరిద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు, అధికారులు విషయం తెలుసుకుని అప్రమత్తమయ్యారు. కాగా.. ఈ బ్రహ్మోత్సవాల్లో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా పాల్గొన్నారు.


అంతర్వేది నూతన రథం కార్యక్రమంలో..

అంతేకాదు.. ఆదివారం నాడు జరిగిన అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి నూతన రథం నిర్మాణం కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి మంత్రి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి ధర్మాన మీడియా మీట్ కూడా నిర్వహించారు. ఈ మీట్‌లో వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. మంత్రికి పాజిటివ్ వచ్చిందని తెలుసుకున్న పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు బెంబేలెత్తుతున్నారు. 


బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న వెల్లంపల్లికి కూడా..

మరోవైపు.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి వెల్లంపల్లి వారం రోజుల పాటు తిరుమలలోనే ఉన్నారు. ఈనెల 25వ తేదీన విజయవాడకు చేరుకున్నారు. అప్పటి నుంచి ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో మంత్రికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి వెల్లంపల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-09-28T22:01:42+05:30 IST