Abn logo
Sep 27 2021 @ 02:15AM

మా కులపోడివని చెప్పుకోడానికి సిగ్గేస్తోంది.. ఒళ్లు దగ్గరపెట్టుకో.. Pawan Kalyan కు ఏపీ మంత్రుల వార్నింగ్

తోలుతీస్తాం! పవన్‌కు రాష్ట్ర మంత్రుల హెచ్చరిక

ఒళ్లు దగ్గరపెట్టుకో..

నేను సన్నాసినైతే నువ్వు సన్నాసిన్నర 

అవాకులూ చవాకులూ పేలితే సహించం

మా కులపోడివని చెప్పుకోడానికి సిగ్గేస్తోంది

ఇడుపులపాయ నేలమాళిగలపై.. ప్రధానికి ఫిర్యాదు చేసి, తవ్వించు 

కోడికత్తి కేసుపై షాను నిలదీయి: జనసేనానిపై మంత్రి పేర్ని ఫైర్‌

ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోం

‘వకీల్‌ సాబ్‌’ టికెట్ల ధర పెంచేందుకు

అనుమతివ్వలేదనే ఆయనకు కడుపుమంట

మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజం

పవన్‌కైనా, సంపూర్ణేశ్‌కైనా ఒకే కష్టం: అనిల్‌

పవన్‌ క్షమాపణ చెప్పాలి: అవంతి


అమరావతి/హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు కాకరేపాయి. ఇష్టానుసారం అవాకులు, చవాకులు పేలితే తోలు తీస్తామని పలువురు రాష్ట్ర మంత్రులు ఆయన్ను హెచ్చరించారు. తనపై కోపంతో జగన్‌ ప్రభుత్వం సినీ పరిశ్రమను చంపేస్తోందని.. కొత్త అప్పుల కోసమే సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలనుకుంటోందని ఆయన చేసిన విమర్శలపై మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్‌, అవంతి శ్రీనివాస్‌ ఆదివారం ఒక్కుమ్మడిగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రవాణా-సమాచార మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను సన్నాసిని అయితే.. పవన్‌ సన్నాసిన్నర అని ధ్వజమెత్తారు. ఆయన కాపు కులానికి చెందినవాడని చెప్పుకోవడానికి తనకు సిగ్గేస్తోందన్నారు. పవన్‌ వ్యాఖ్యలపై అటు సినీ పరిశ్రమ నుంచి కూడా భిన్న స్పందనలు వచ్చాయి. పరిశ్రమ మనుగడకు ప్రభుత్వాల మద్దతు అవసరమని తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పేర్కొంది. వేరే వేదికలపై వ్యక్తులు వ్యక్తంచేసే అభిప్రాయాలు, ఆక్రోశాలు పరిశ్రమ మొత్తం చెబుతున్నవి కాదని.. వాటితో తమకు సంబంధం లేదని ఆదివారం ఓ లేఖలో స్పష్టం చేసింది. పరిశ్రమను ఇబ్బందిపెట్టే నిబంధనలను తెచ్చిన జగన్‌ సర్కారు.. భవిష్యత్‌లో హీరో మోహన్‌బాబు విద్యాసంస్థలకూ వర్తింపజేస్తుందని పవన్‌ చేసిన వ్యాఖ్యలపై మోహన్‌బాబు కూడా స్పందించారు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు జరుగుతున్నాయని.. అవి పూర్తయ్యాక అన్నిటికీ సమాధానమిస్తానని ట్విటర్‌లో ప్రకటించారు. కాగా.. హీరోలు నాని, సంపూర్ణేశ్‌బాబు, కార్తికేయ గుమ్మకొండ, నటుడు బ్రహ్మాజీ తదితరులు పవన్‌కు మద్దతుగా ట్వీట్లు చేశారు. ఎవరేమన్నారంటే..


నేను సన్నాసినైతే నువ్వు సన్నాసిన్నర: పేర్ని 

‘ఒరేయ్‌ పవన్‌ కల్యాణ్‌గా... నన్ను సన్నాసి అన్నావు. సన్నాసి అంటే చేతగానోడు, పనికిమాలినోడని అర్థం. నేను మచిలీపట్నంలో పోటీ చేశా. ఎమ్మెల్యేగా గెలిచా. నువ్వు గాజువాక, భీమవరం రెండుచోట్లా పోటీ చేశావ్‌. ఓడిపోయావ్‌. అంటే ఎవరు సన్నాసో తేలిపోయింది. నేను సన్నాసినైతే నువ్వు సన్నాసిన్నర. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నోర్మూసుకుని సినిమాలు చేసుకో. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తోలు తీస్తాం’ అని పేర్ని నాని హెచ్చరించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ‘సినీ హీరో సాయిధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ విషయంలో పోలీసులు చెప్పిందే మీడియాలో వచ్చింది. దీనిపై అంత కోపం ఎందుకొచ్చింది? నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులను తిట్టు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టు. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని జగన్‌రెడ్డి అంటూ తిడతావా? కేసీఆర్‌ను తిట్టాలంటే నీకు వణుకు మొదలైందా? నీ ధైర్యం ఏమైంది? నువ్వు మా కాపు కులపోడివని చెప్పేందుకు సిగ్గేస్తోంది. నేను వైఎస్‌ రాజశేఖరరెడ్డిని గుడ్డిగా అభిమానిస్తాను. ఆయన కుమారుడు జగన్‌నూ అభిమానిస్తాను. సాటి కాపు కులపోడు చినరాజప్ప బాహాటంగా చంద్రబాబును అభిమానిస్తాడు. నువ్వు కూడా చంద్రబాబును అభిమానిస్తానని, ఆయన చెప్పినట్లుగానే నడచుకుంటానని బహిరంగంగా చెప్పు’ అని పవన్‌కు సవాల్‌ విసిరారు. ‘ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌తో పవన్‌ సన్నాసికి సంబంధం ఏంటి? పవన్‌ బయటకు చెప్పేదొకటి. చేసేదొకటి. రాజకీయాల్లోకి వచ్చే సమయంలో రూ.100 కోట్ల ఆదాయాన్ని వదులుకుని వచ్చానన్నాడు. 2015 నుంచి 2021 వరకూ 8 సినిమాలు మాత్రమే వచ్చాయి. సినిమాకు రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నానని చెప్పాడు. పన్నులు పోను రూ.6.5 కోట్లు మాత్రమే మిగులుతున్నాయన్నాడు. దీంతో పవన్‌ చెప్పేదంతా అబద్ధమేనని అభిమానులకు తెలిసింది. ఆరేళ్లలో 8 సినిమాలే అంటే.. పవన్‌ చెప్పిన రూ.వంద కోట్ల ఆదాయం ఉత్తిదేనని తేలిపోయింది. ఏరా పవన్‌ నాయుడూ.. నువ్వు చెప్పిందంతా అబద్ధమేగా! నీకు సినీ ఆన్‌లైన్‌ బుకింగ్‌తో ఏంట్రా సంబంధం? ఆన్‌లైన్‌ బుకింగ్‌ కోరుతూ పరిశ్రమ పెద్దలే 2016 నుంచి ప్రభుత్వానికి లేఖలు రాశారు. కోడికత్తి విషయంలో అవాకులూ చవాకులూ పేలుతున్నావ్‌. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ విచారణ చేస్తోంది. నీకు దమ్మూ ధైర్యం ఉంటే కేంద్ర మంత్రి అమిత్‌ షాను నిలదీయి. ఇడుపులపాయలో నేలమాళిగలు ఉన్నాయని అంటున్నావు.


ప్రధాని మోదీ, అమిత్‌ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నీ చెప్పుచేతల్లో ఉన్నారు. ఒక్కమాట మోదీకి చెప్పు. నేలమాళిగలు తవ్వించు. కాపు రిజర్వేషన్లపై జగన్మోహన్‌రెడ్డిని నిలదీయాలని మీడియాను రెచ్చగొట్టావు. కానీ 2014 నుంచి 2019 వరకూ ఒక్కసారి ఎందుకు మాట్లాడలేకపోయావు? కాపు సమాజం అత్యధికంగా ఉండే జగ్గయ్యపేట నియోజకవర్గంలోనే ఎన్నికల ప్రచార సమయంలో కాపు రిజర్వేషన్లు చేయలేమని జగన్‌ నిష్కల్మషంగా చెప్పారు. కాపు సామాజికవర్గానికి ఏటా రూ.2,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10,000 కోట్లు వ్యయం చేస్తామని హమీ ఇచ్చారు. అంబేడ్కర్‌ బతికి ఉన్న రోజుల్లోనే నేనుంటే.. రిజర్వేషన్లు లేని సమసమాజం కావాలని చాగంటి కోటేశ్వరరావులా ప్రవచనాలు చెప్పావు. కానీ ఇప్పుడు కాపు రిజర్వేషన్లపై నిలదీయమంటావేం? నీకు సిగ్గూ లజ్జా ఉందా? సినిమా హాళ్లను దళితులు, బీసీలకు జగన్‌ కట్టిస్తారా అంటూ వెటకారంగా ఈ వర్గాలను కించపరచేలా మాట్లాడతావా పవన్‌ సన్నాసి? నీ కోరిక ఎందుకు కాదనాలి? ఈసారి కాకున్నా మళ్లీ అధికారంలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాలకు సినిమా హాళ్లను కట్టించి ఇస్తారులే’ అని వ్యాఖ్యానించారు.


పవన్‌ కోసం ఇండస్ట్రీని ఇబ్బందిపెడతామా: అనిల్‌

పవన్‌ కల్యాణ్‌ కోసం సినిమా ఇండస్ట్రీని ఇబ్బందిపెట్టాల్సిన అవసరం తమకు లేదని జలవనరుల మంత్రి అనిల్‌కుమార్‌ నెల్లూరులో అన్నారు. ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా టికెట్ల విధానాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంటే.. తనను ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పవన్‌ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ‘ఇండస్ట్రీలో పెద్ద హీరోల సినిమాలకు రూ.70-80 కోట్లు ఖర్చు చేస్తే అందులో 40-50 కోట్లకుపైగా హీరోలకే ఇవ్వాల్సి ఉంటుంది. 10-20 కోట్లు మాత్రమే సినిమాకు ఖర్చవుతుందని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. అలాంటప్పుడు మొత్తం ఖర్చును జనాల నుంచి ఎలా వసూలు చేస్తారు? సినిమా తీసేందుకు పెద్ద హీరోకైనా, చిన్న హీరోకైనా ఒకే కష్టం ఉంటుంది. పవన్‌ కల్యాణ్‌ అయినా సంపూర్ణేశ్‌బాబు అయినా కష్టం అదే కదా. సిక్స్‌ ప్యాక్‌ కోసం సుధీర్‌బాబు లాంటివాళ్లు కూడా ఎంతో కష్టపడ్డారు. అయితే పెద్ద హీరో తీసిన సినిమాకు 2 వారాలపాటు రూ.200-400 పెంచి టికెట్లు అమ్ముకోవడం, చిన్న హీరోల సినిమాలకు మామూలుగా అమ్మడం ఎంత వరకు సబబు? పెంచిన ధరలకు ప్రభుత్వం ట్యాక్స్‌ ఏమైనా వస్తోందా? రాజకీయ ఉనికి కోసం జగన్‌పై పవన్‌ విమర్శలు చేస్తుంటారు. అయినా ఆయన ఎదగలేరు. కేవలం రెండు జడ్పీటీసీలు, ఒక మండలం వస్తేనే ముందడుగులు పడ్డాయని సంబరపడుతున్నారు. అక్కడ నుంచి ఎదిగేలోపు పవన్‌ పార్టీ చాప చుట్టేయడం తఽథ్యం’ అని జోస్యం చెప్పారు. 


పవన్‌ రుషిపుంగవుడా: బొత్స

వైసీపీ నాయకులు సన్నాసులైతే.. పవన్‌ కల్యాణ్‌ ఏమైనా రుషి పుంగవుడా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సినిమా ఫంక్షన్‌లో ఆయన వాడిన భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. మైక్‌ దొరికందనో, చుట్టూ ఉన్నవారు కేరింతలు కొడుతున్నారనో ఇష్టానుసారంగా మాట్లాడవద్దని, ఇప్పటికైనా హుందాగా మాట్లాడాలని విజయనగరంలో సూచించారు. ‘సినిమా ఒక వినోదం. ప్రజలపై భారం మోపితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఇష్టానుసారంగా టికెట్‌ ధరలు పెంచి వ్యాపారాలు చేస్తామంటే కుదరదు. వకీల్‌షాబ్‌ సినిమా బెనిఫిట్‌ షోల టికెట్‌ ధర పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతివ్వనందుకు పవన్‌ కడుపుమంటతో ఉన్నారు. సినిమా టికెట్ల విక్రయం ఆన్‌లైన్‌ చేయాలని కొంతమంది సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సంబంధిత మంత్రిని కలిశారు. సినిమా ఇండస్ట్రీ అంటే నువ్వొక్కడివే కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలి. సినిమా పెద్దలుగా మీ సోదరుడు చిరంజీవి, మోహన్‌బాబు వంటి వారు ఉన్నారు. కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుంది’ అని వ్యాఖ్యానించారు. 


పవన్‌ క్షమాపణ చెప్పాలి: ముత్తంశెట్టి 

ముఖ్యమంత్రి, మరో మంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని పవన్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు విశాఖలో డిమాండ్‌ చేశారు. పవన్‌ మానసిక స్థితి దెబ్బ తిందని, బుద్ధిజంకు చెందిన ఉపాసన ధ్యాన కేంద్రానికి వెళితే మంచిదని సలహా ఇచ్చారు. ఆన్‌లైన్‌ టికెట్ల విధానంపై పవన్‌ అవగాహన లేమితో మాట్లాడుతున్నారని విమర్శించారు.