Advertisement
Advertisement
Abn logo
Advertisement

అప్పుడు ఇచ్చేసి.. ఇప్పుడు అయ్యా... బాబూ!

  • రూ.175 కోట్ల కోసం హెల్త్‌ వర్సిటీ దైన్యం
  • డబ్బుల్లేకపోతే రోజు గడవదని లేఖ
  • వెంటనే ఇవ్వాలని ప్రాధేయపడిన రిజిస్ట్రార్‌
  • సోమవారం రూ.400 కోట్లు ఏపీఎ్‌సఎ్‌ఫసీకి
  • ఇప్పుడు రూ.175 కోట్లు తిరిగి ఇవ్వాలని వినతి


సర్కారు వారి ‘ప్రైవేట్‌ ఫైనాన్స్‌’ దెబ్బ ఎలా ఉంటుందో నాలుగు రోజులకే తెలిసొచ్చింది. మెడపై కత్తిపెట్టి లాక్కున్న డబ్బును... ప్రభుత్వం నుంచి తిరిగి తెచ్చుకోవాలంటే ‘ప్లీజ్‌... ప్లీజ్‌’ అని ప్రాధేయపడక తప్పదని రుజువైంది. ఇదంతా డబ్బులు ఇచ్చి మరీ తన్నులు తిన్న విధంగా ఉందని ప్రభుత్వ శాఖలు వాపోతున్నాయి!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘సీఎం నా హీరో! నా బాస్‌! ఆయన అడిగారు. ఇచ్చేస్తా. యూనివర్సిటీ మనుగడతో నాకు సంబంధం లేదు’ అంటూ మొన్నటికి మొన్న ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్పొరేషన్‌’ (ఏపీఎ్‌సఎ్‌ఫసీ)కు రూ.400 కోట్లు సమర్పించుకున్నారు. సరిగ్గా నాలుగు రోజుల తర్వాత పరిస్థితి ఏమిటంటే... ‘‘యూనివర్సిటీ రోజువారీ ఖర్చులకు కూడా డబ్బుల్లేవు.


పరీక్షలు పెట్టాలి. ఖర్చులున్నాయి. అర్జంటుగా మాకు రూ.175 కోట్లు వెనక్కి ఇచ్చేయండి’’ అని ప్రాధేయపడుతూ ఏపీఎ్‌సఎ్‌ఫసీకి లేఖ రాశారు. రకరకాలుగా అప్పులు తెస్తూ... ఆ పరిమితులు దాటిన తర్వాత కార్పొరేషన్ల ద్వారా రుణ వేట ప్రారంభించిన ప్రభుత్వం... ఏపీఎ్‌సఎ్‌ఫసీ ఏర్పాటు చేసి ప్రభుత్వ శాఖలు, విభాగాల నుంచి ‘డిపాజిట్లు’ సేకరిస్తున్న సంగతి తెలిసిందే. సర్కారుకు సమర్పించుకున్న సొమ్ములు తిరిగి వస్తాయో, రావో అనే భయంతో... చాలా విభాగాల అధిపతులు ఏపీఎ్‌సఎ్‌ఫసీకి డిపాజిట్లు మళ్లించేందుకు వెనుకాడారు. దీంతో స్వయంగా సీఎస్‌ సమీర్‌ శర్మ రంగంలోకి దిగి కార్యదర్శులపై ఒత్తిడి తెచ్చారు. జీవో కూడా జారీ చేశారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి చెందిన రూ.400 కోట్లను సోమవారం అడ్డదారిలో ఏపీఎ్‌సఎ్‌ఫసీకి మళ్లించారు. దీనిపై వర్సిటీ ఉద్యోగులు మండిపడ్డారు. వీసీ చాంబర్‌లో బైఠాయించారు. విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. నిధులన్నీ మళ్లించేస్తే వర్సిటీ నిర్వహణ కష్టమని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే... ‘ఆయన నా హీరో. ఆయనే నా బాస్‌. డబ్బులు అడిగాక కాదనలేను’ అంటూ వీసీ డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ తేల్చిచెప్పారు.


ఐదు రోజుల్లోనే సీన్‌ రివర్స్‌...

‘అడిగారు కాబట్టి ఇచ్చేశాం’ అని వీసీ పేర్కొనగా... ‘డబ్బులు కావాలి ప్లీజ్‌’ అంటూ సోమవారం హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శంకర్‌ ఏపీఎ్‌సఎ్‌ఫసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ‘‘ముందూ వెనుకా చూసుకోకుండా వర్సిటీకి చెందిన రూ.400 కోట్లు మళ్లించాం. ఇప్పుడు మా వర్సిటీ నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. వెంటనే రూ.175 కోట్లు మాకు జమ చేయండి’’ అంటూ లేఖ రాశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి (రాబోయే నాలుగు నెలలకు)రూ.100 కోట్లు నిధులు అవసరమవుతాయని తెలిపారు. ‘‘ఈ నిధులు లేకపోతే వర్సిటీలో రోజు వారీ కార్యకలాపాలతోపాటు ఆకడమిక్‌ వ్యవహారాలు, మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్‌లు, ముఖ్యంగా వివిధ కోర్సులకు నిర్వహించే పరీక్షలకు బాగా ఇబ్బంది  అవుతుంది. కనీసం రెగ్యులర్‌ ఉద్యోగులకు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి కూడా  జీతాలు ఇవ్వలేం. వీటిని ఆధిగమించాలంటే వర్సిటీకి తక్షణమే రూ.100 కోట్లు అవసరం.


ఈ విషయాన్ని వర్సిటీ ఆడిటర్‌ కూడా స్పష్టం చేశారు. రూ.400 కోట్లను మళ్లించేముందు ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకోలేదు’’ అని వర్సిటీ రిజిస్ట్రార్‌ తన లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు ఉద్యోగుల ఆందోళనల గురించి కూడా ప్రస్తావించారు. ‘‘ఉద్యోగులు తీవ్రఆందోళనలు చేస్తున్నారు. వర్సిటీలోని సంఘాల డిమాండ్లను పరిష్కరించేందుకు, పెన్షన్‌ ప్రయోజనాల కోసం మరో రూ.75 కోట్లు అవసరమవుతాయి. అందువల్ల వర్సిటీపై దయతలచి తక్షణమే రూ.175 కోట్లు నిధులు మా ఖాతాలో జమ చేయండి’’ అని రిజిస్ట్రార్‌ ప్రాధేయపడ్డారు. ఎస్‌ఎ్‌ఫఎ్‌ససీకి వర్సిటీ నుంచి వెళ్లిన రూ.400 కోట్లలో రూ.175 కోట్లు వెనక్కి ఇచ్చేసి... మిగిలిన రూ.225 కోట్లకు ప్రతి నెలా ఠంచనుగా వడ్డీ చెల్లించాలని రిజిస్ట్రార్‌ కోరారు. 5.5 శాతం వడ్డీ జమ చేయాలని కోరారు. ఆ వడ్డీ డబ్బులతోనే రోజువారీ ఖర్చులు గడుస్తాయని చెప్పారు. చివరగా... ‘‘ఇది చాలా అత్యవసరం. మీరు కూడా దీనిని అత్యవసర లేఖగా పరిగణించండి. మీకు అసౌకర్యం కల్పిస్తున్నందుకు చింతిస్తున్నాం’’ అని లేఖను ముగించారు.


సర్కారు ఏమంటుందో...

‘అయ్యగారి ఆర్డర్‌’ అంటూ... ఏపీఎ్‌సఎ్‌ఫసీకి ఉన్న డబ్బులన్నీ సమర్పించుకోవడంతో హెల్త్‌ యూనివర్సిటీ ఇప్పుడు ఆర్థికంగా ‘వెంటిలేటర్‌’పైకి వెళ్లిపోయింది. ప్రభుత్వం పైసలు విధిలిస్తే తప్ప రోజులు గడవని పరిస్థితి! రిజిస్ట్రార్‌ రాసిన లేఖపై ఏపీఎ్‌సఎ్‌ఫసీ ఎలా స్పందిస్తుందో తెలియదు! ఇదే డబ్బులు బ్యాంకుల్లో ఉంటే... హెల్త్‌ వర్సిటీకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ‘మీ బ్యాంకులో మా డబ్బులున్నాయి. అందులో రూ.175 కోట్లు ఇచ్చేయండి’ అని అడగాల్సిన అవసరం కూడా లేదు. నేరుగా ‘విత్‌ డ్రా’ చేసుకోవచ్చు. ఒకవేళ ఎఫ్‌డీ రూపంలో ఉన్నా... ముందుగానే రద్దు చేసుకోవచ్చు. ఇప్పుడు... సర్కారు స్థాపించిన కంపెనీకి డబ్బులు సమర్పించుకుని ‘ఎరక్కపోయి ఇరుక్కున్నాం’ అన్నట్లుగా విలవిల్లాడుతున్నారు. ‘ప్లీజ్‌... అర్థం చేసుకోండి. డబ్బులు ఇవ్వండి’ అని వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రాధేయపడటమే దీనికి నిదర్శనం. హెల్త్‌వర్సిటీకి ఎదురైన అనుభవంతో మిగిలిన శాఖలు, విభాగాల్లోనూ గుబులు మొదలైంది. డబ్బులు అవసరమైనప్పుడు తాము కూడీ ఏపీఎ్‌సఎ్‌ఫసీని ఇలా ప్రాధేయపడాల్సిందేనా... అలా రాసిన లేఖలకు సానుకూల స్పందన లభిస్తుందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.


నేనేం చేయలేను!

తలదించుకుని ఏడ్చాను

బాంచన్‌లా కూర్చోబెట్టారు

ఉద్యోగ నేతల ముందు వీసీ ఆవేదన

అమరావతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘నా హీరో... నా బాస్‌! ఆయన అడిగారు కాబట్టి రూ.400 కోట్లు ఇచ్చేశాం’ అని సోమవారం ఉద్యోగులతో ఘాటుగా మాట్లాడిన హెల్త్‌ వర్సిటీ వీసీ డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ శుక్రవారం తన అసహాయతను బయటపెట్టుకున్నారు. ‘డబ్బులిస్తారా... పంపించేయాలా? అంటే నేనేం చెప్పాలి! వ్యవస్థ ముఖ్యమే. కానీ... నేనేం చేయగలను’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. డిపాజిట్‌ కోసం దాదాపు నెల రోజులుగా తనను ఇబ్బంది పెడుతున్నారని పరోక్షంగా చెప్పారు. ‘‘ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ (సీఎంవోలో) చేతులు కట్టుకుని అక్కడే ఏడ్చాను. డాక్టర్‌గా నేను నిల్చుని ఆపరేషన్లు చేయడం వేరు. తలదించుకుని వాళ్లేం చెబుతారా అని ఎదురు చూసేలా బాంచన్‌లా కూర్చోబెట్టారు. నేను దళితుడినని ఏదేదో చేసేది కాదు. అప్పుడప్పుడు ఎటాక్స్‌ జరుగుతాయి. నవ్వుతూ వెళ్లిపోవడమే. ఆ తర్వాత దేవుడు చూస్తాడని అనుకోవడమే’’ అం టూ దేవుడిపై భారం వేశారు.


నిధుల బదలాయింపును నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఉద్యోగులకు సంఘీభావంగా ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌, ఇతర నాయకులు యూనివర్సిటీకి వచ్చి వీసీతో భేటీ అయ్యారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్లు వ్యవస్థ కోసం నిలబడాలి కదా... అని ఎన్జీవో నేత విద్యాసాగర్‌ ప్రశ్నించగా... వీసీ తన మనసులోని ఆవేదన మొత్తం వెళ్లగక్కారు. ‘‘అక్కడ (ప్రభుత్వంలో) జరిగే విషయాలు చూస్తే మీరు అయ్యో అంటా రు. నేను ఆ స్టేజ్‌లో కూడా లేను. రెండేళ్ల నుంచి ఏం చెప్పకుండా మూసేశారు. నేను చెప్పిన ఫిగర్‌ (డిపాజిట్‌) కాకుండా.. ఇంత ఇస్తేనేకానీ నా ఇంటికి రావద్దు... బయటకు పో అంటే నేనేం చెప్పేది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ కోసం ఎన్జీవో నాయకులు చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మీ కార్యాక్రమాలన్నీ చూస్తున్నాను. సజ్జల దగ్గరకి వెళ్తే ఆయన ఒక తేదీ... ఈయన ఒక తేదీ చెబుతున్నారు. నిన్న జగన్‌ 10 రోజుల్లో పీఆర్సీ ఇచ్చేస్తామని చెప్పారు. అన్ని అంకెలే!’’ అని అన్నారు.

Advertisement
Advertisement