హాట్‌ టాపిక్‌గా మారిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

ABN , First Publish Date - 2021-06-11T13:57:29+05:30 IST

గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తా కథనం

హాట్‌ టాపిక్‌గా మారిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

  • ‘సెలవులో అధికారి’పై సర్వత్రా చర్చ
  • మీర్‌పేట్‌లో అవినీతి నిజమేనని పలువురి వ్యాఖ్య

హైదరాబాద్ సిటీ/సరూర్‌నగర్‌ : ‘మంత్రి ఆగ్రహం.. సెలవులో అధికారి’ శీర్షికతో గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తా కథనం మీర్‌పేట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎక్కడ నలుగురు కలిసినా ఈ కథనంపై చర్చించుకోవడం కనిపించింది. ముఖ్యంగా పాలకవర్గంలోని పలువురు సభ్యులు, కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు దీనిపై ఆసక్తిగా చర్చించుకున్నట్టు సమాచారం. ఇంజనీరింగ్‌ విభాగంలోని ఓ అధికారి క్యూసీ ఏజెన్సీ నుంచి పర్సంటేజీ డిమాండ్‌ చేశారంటే.. రూ.కోట్ల విలువైన ఇతర అభివృద్ధి పనుల్లో ఏ మేరకు వెనకేసుకుని ఉంటారోననే చర్చ జరుగుతోంది. 


ఇదే విభాగంలోని ఇతర అధికారులు, సిబ్బంది సైతం కాంట్రాక్టర్ల నుంచి పనుల అంచనాను బట్టి పర్సంటేజీ తీసుకుంటున్నట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇక్కడ కొంతకాలంగా రెగ్యులర్‌ టీపీవో లేకపోవడంతో కార్యాలయం అధికారి ఒకరు అన్నీ తానై, నమ్మకస్తుడైన ఓ అసిస్టెంట్‌ను పెట్టుకుని మూడో కంటికి తెలియకుండా అక్రమ భవన నిర్మాణదారుల నుంచి వసూళ్లు చేయించుకుంటున్నట్టు పాలకవర్గంలో చర్చ జరుగుతోంది. మొత్తంమీద ‘ఆంధ్రజ్యోతి’ కథనం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మంత్రి సబితారెడ్డి సైతం దీనిపై ఆరా తీసినట్టు తెలిసింది. అన్ని విభాగాలను ప్రక్షాళన చేయాల్సిన అంశం ఆమె దృష్టిలోనూ ఉన్నట్టు సమాచారం! 

Updated Date - 2021-06-11T13:57:29+05:30 IST