Hyderabad లో ఎన్నో వెరై‘TEA’లు.. సాధారణ టీ తర్వాత ఎక్కువ మంది తాగేది ఇవే.. ఆ కేఫ్‌లు కనుమరుగు..!

ABN , First Publish Date - 2021-10-24T18:57:47+05:30 IST

‘అరే భాయ్‌.. ఏక్‌ చాయ్‌ లావో’ అంటూ దోస్తులతో కలిసి బాతాఖానీ కొట్టేందుకు అడ్డాలుగా నిలిచిన ఇరానీ కేఫ్‌లు మెల్లిమెల్లిగా కనుమరుగవుతున్నాయి...

Hyderabad లో ఎన్నో వెరై‘TEA’లు.. సాధారణ టీ తర్వాత ఎక్కువ మంది తాగేది ఇవే.. ఆ కేఫ్‌లు కనుమరుగు..!

  • నగరంలో మల్టీ చైన్‌ టీ స్టాల్స్‌
  • నచ్చిన రుచి, ఫ్లేవర్‌ కూడా.. 
  • తలసరి టీ పొడి 
  • వినియోగం 302 గ్రాములు


‘అరే భాయ్‌.. ఏక్‌ చాయ్‌ లావో’ అంటూ దోస్తులతో కలిసి బాతాఖానీ కొట్టేందుకు అడ్డాలుగా నిలిచిన ఇరానీ కేఫ్‌లు మెల్లిమెల్లిగా కనుమరుగవుతున్నాయి. టీ కొట్టు ఆధునికతను సంతరించుకుని టీ బార్‌/కేఫ్‌లుగా మారిపోయాయి. అభిరుచికి, కార్పొరేట్‌ శైలి తోడు  కావడంతో మల్టీ చైన్‌ టీస్టాల్స్‌ అందుటుబాటులోకి వచ్చాయి. ఎన్నో వెరైటీ టీల రుచులను నగరవాసులు ఆస్వాదిస్తున్నారు.


భాగ్యనగరంలో వందల సంఖ్యలో టీలు లభిస్తున్నా సాధారణ టీ తర్వాత మసాలా టీ, గ్రీన్‌ టీ, అల్లం టీ లాంటి వెరైటీలను మాత్రమే ఎక్కువగా తాగడానికి ఇష్టపడుతున్నారు.


హైదరాబాద్‌ సిటీ : సుమారు 500ల రకాలకు పైగా టీలు, వాటితో గ్లోబల్‌ స్టాండర్డ్స్‌తో బేకరీ, ఫుడ్‌ ఐటెమ్స్‌ నయా టీ కేఫ్‌/బార్‌లలో అందుబాటులోకి వచ్చాయి. చాయ్‌ పాయింట్‌, చాయ్‌ కహానీ, టీ ట్రైల్స్‌, టీ ప్లానెట్‌, టీ టైమ్‌, చాయ్‌ పానీ, చాయ్‌ అడ్డా.. ఇలా చెబుతూ పోతే ఇటీవల టీ కేఫ్‌ ఔట్‌లెట్లు చాలా కనిపిస్తున్నాయి.


వెరై‘టీ’..

ఇరానీ చాయ్‌ ఆ తర్వాత గ్రీన్‌ టీ, అల్లం టీ, మసాలా టీ అంటూ నాలుగైదు వెరైటీల దగ్గరనే చాలామంది ఆగిపోతారు. కానీ, నగరంలో ఈ చాయ్‌ బార్స్‌ వద్ద పదుల సంఖ్యలో టీ వెరైటీలు కనిపిస్తాయి. తేయాకు ఎంపికలో నిలోఫర్‌ లాంటి సంప్రదాయ ఇరానీ కేఫ్‌లు ఎంత జాగ్రత్తను వహిస్తాయో, విభిన్న రుచులతో ప్రయోగాలు చేయడానికీ ఇప్పుడు నగరంలో వెలుస్తున్న సరికొత్త టీ బార్లు అంతే ఆసక్తిని చూపుతున్నాయి. మందార మకరందం, గులాబీల గుబాళింపు, మల్లెల గమ్మత్తు ఇలా ఒక్కటేమిటీ టీ ప్రేమికులను ఆకట్టుకుంటాయనే ఏ పదార్థాన్నీ వదలడం లేదు. దాదాపు 1500 రకాల టీలు అందుబాటులో ఉంటే మన హైదరాబాద్‌ మార్కెట్‌లో 500 రకాల వరకూ అందుబాటులో ఉన్నాయి.


రెడ్‌ జెన్‌, రష్యన్‌ కారవన్‌, సిల్వర్‌ నీడిల్‌ వైట్‌ టీ, గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ.. లాంటి ఎక్సోటిక్‌ టీలూ లభిస్తున్నాయి. ఒక్కో టీ ఒక్కో విధమైన రుచి, వాసన, రంగు ఇస్తుంది. కామన్‌మన్‌ డ్రింక్‌గా టీ ఇప్పటికీ రోడ్డు.. పక్కన కొన్ని టీస్టాళ్లలో రూ.5కే దొరుకుతున్నా.. ఖరీదైన టీలు కూడా నగరంలో ఇప్పుడు ఎక్కువగానే కనబడుతున్నాయి. నిలోఫర్‌ కేఫ్‌లో గోల్డెన్‌ టిప్స్‌ బ్లాక్‌ టీ కప్పు రూ.వెయ్యి చెల్లించాల్సిన విషయం తెలిసిందే కదా. గుండె ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటుగా కొలెస్ట్రాల్‌ తగ్గించి, జీర్ణ క్రియకూ తోడ్పడుతుందట ఈ టీ. అలాగే వైట్‌, సిల్వర్‌ నీడిల్‌ వైట్‌ టీ, ఊలాంగ్‌, పెరల్స్‌, మొరాకన్‌ మింట్‌, జపనీస్‌ సెన్చా తరహా టీలు రూ. 300ల నుంచి లభ్యమవుతున్నాయి.


పెరిగిన పో‘టీ’..

విభిన్న తరహా టీలను అంతే వైవిధ్యంగా అందించడానికి ఇప్పుడు టీ కేఫ్‌/బార్‌లు పోటీపడుతున్నాయి. వేగవంతమైన జీవితం అలవాటు పడ్డ వారికి అంతే వేగంగా టీ సర్వ్‌ చేయడంతో పాటు, ఆ పది నిమిషాల సమయంలోనే తమను తాము పునరుత్తేజం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటుగా విశ్రాంతి తీసుకోవడం, ఫ్రెండ్స్‌తో ఆహ్లాదంగా గడిపే అవకాశం కూడా అందిస్తున్నాయి. నిజానికి కరోనా తర్వాత శుభ్రతకు ప్రాధాన్యం పెరిగింది. నగరంలో ఇరానీ కేఫ్‌ ఎప్పటికీ కింగే కానీ కార్పొరేట్‌ ఉద్యోగులు కూడా తమ హ్యాంగవుట్‌ స్పాట్స్‌గా చాయ్‌ దుకాణాలను భావిస్తుండటంతో డిజైన్‌ పరంగా ఎక్కువ దృష్టి సారించాల్సి వస్తుంది అని అంటున్నారు నగరంలో పలు ఔట్‌లెట్లను నిర్వహిస్తున్న ఓ సంస్థ ప్రతినిధి. ఆయన మాట్లాడుతూ విభిన్న రుచులతో టీ అందించడం ద్వారా మాత్రమే ఆకట్టుకోగలమన్నది  నిజమే కానీ, డెకార్‌ కూడా ఇప్పటి పరిస్థితులలో ముఖ్యమే! ఆహ్లాదకరమైన మొక్కలు, ఆకట్టుకునే డెకరేషన్‌ కనిపించడానికి కారణం అదే అన్నారు.


తలసరి ‘టీ’ పొడి వినియోగం.. 

దక్షిణ భారతదేశంలో టీని అమితంగా అభిమానించే రాష్ట్రాలలో మనం ముందున్నాం. టీ లేకుండా జీవించే సగటు హైదరాబాదీ లేరన్నట్లుగా మన వారి అభిరుచి ఉంటుంది. అసలు మనవాళ్ల తలసరి వినియోగం ఎంతుంటుందో తెలుసుకునేందుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఓ అధ్యయనం చేసింది. రాష్ట్రంలో 89 శాతం ఇళ్లలో టీ తాగుతారని, కేవలం 8 శాతం మాత్రమే కాఫీ తాగుతారని వెల్లడించింది. ఇక టీ పొడి తలసరి వినియోగమూ లెక్క కట్టింది. రాష్ట్రంలో తలసరిగా 306 గ్రాముల తేయాకు సేవిస్తే, హైదరాబాద్‌లో అది 302 గ్రాములని తేల్చారు.  హైదరాబాదీలే టీ ప్రేమికులని అనుకుంటాం కానీ  కుమరం భీం అసిఫాబాద్‌లో ఏకంగా 437 గ్రాముల తలసరి వినియోగం ఉందట.


‘టీ’ చేయడం ఒక కళ..

పొద్దునే నిద్ర లేవగానే టీతోనే తమ రోజు ప్రారంభించే వారు ఎందరో ఉంటారు. కానీ టీ తాగడం.. ఆ టీ కలపటం కూడా ఓ కళ. ఆ కళని తాము నగరవాసులకి చేరువ చేస్తున్నామంటున్నాయి టీ బార్లు/లాంజ్‌లు. మన నగరంలో 98 శాతం టీలో పాలు తప్పనిసరి అంటుంటారు. నగరంలో రోడ్‌ సైడ్‌ టీ వెండార్లకు దాటి వెళ్తే ఇప్పుడు వెరైటీలు కనబడుతున్నాయి. హై ఎండ్‌ టీ బార్‌లలో విభిన్నమైన బ్రూయింగ్‌, బ్లెండ్‌లతోనే తేనీరు ప్రేమికుల మనసు దోచే ప్రయత్నం చేస్తున్నారు.


టీ సోమలియర్ల సహాయంతో విభిన్న రుచులను అందిస్తున్న టీ బార్లు/కేఫ్‌లు బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ లాంటి ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంటే, హై- టీ రుచులను అందించేందుకు టీతో పాటుగా విభిన్నరుచుల సమ్మేళనాన్ని అందిస్తూ ఆకట్టుకుంటున్న ఔట్‌లెట్లూ చాలానే ఉన్నాయి. ఇరానీ చాయ్‌తో ఉస్మానియా బిస్కెట్‌ కాంబినేషన్‌గా తీసుకునే నగరవాసులు ఉన్నట్లే డానిష్‌ పేస్ట్రీ, కప్‌కేక్‌లనూ రుచి చూడాలనుకుంటున్న వారి కోసం ఆ తరహా ఏర్పాట్లనూ చేస్తున్నాయి. మనం తినే ఆహారపదార్థాలు కూడా మనం తాగే ఫ్లేవర్‌పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు టీ సోమలియర్‌ విద్య.


‘టీ’ సిటీలో కాఫీ గుబాళింపు..!

హైదరాబాద్‌ నగరంలో టీ సేవించే వారు ఎక్కువే కానీ, కాఫీ రుచులనూ ఆస్వాదించాలనుకుంటున్న వారూ కనబడుతున్నారు. ముఖ్యంగా మల్టీ నేషనల్‌ కంపెనీలు అధికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాలలో.. మల్టీ నేషనల్‌ బ్రాండ్లు విదేశీ రుచులతో కాఫీలను అందిస్తున్నాయి. అయితే, దక్షిణ భారత ఫిల్టర్‌ కాఫీ రుచికి సాటిలేదనే కాఫీ ప్రియులను లక్ష్యంగా చేసుకుని కుంభకోణం కాఫీ సంస్థ తమ డిగ్రీ కాఫీ ఔట్‌లెట్లను నగరంలో విరివిగా ప్రారంభిస్తోంది. మదీనాగూడ, మణికొండ, మియాపూర్‌, కేపీహెచ్‌బీ, వనస్థలిపురం, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాలలో ఇవి ఎక్కువగా కనబడుతున్నాయి.



Updated Date - 2021-10-24T18:57:47+05:30 IST