జడ్జిలను దూషించిన కేసు.. సీబీఐపై ఏపీ హైకోర్టు తీవ్ర అసహనం

ABN , First Publish Date - 2021-12-13T22:45:13+05:30 IST

సీబీఐపై ఏపీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియాలో న్యాయమూర్తులను దూషించిన కేసులో జనవరి 25లోపు పూర్తిస్థాయిలో...

జడ్జిలను దూషించిన కేసు.. సీబీఐపై ఏపీ హైకోర్టు తీవ్ర అసహనం

అమరావతి: సీబీఐపై ఏపీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియాలో న్యాయమూర్తులను దూషించిన కేసులో జనవరి 25లోపు పూర్తిస్థాయిలో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. విదేశాల్లో కూర్చొని మన దేశంలో ఉన్న న్యాయవ్యవస్థను విమర్శించడంపై హైకోర్టు సీరియస్‌ అయింది. మన వ్యవస్థల సత్తా ఏంటో చూపించాల్సిన అవసరం ఉందని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. 


పంచ్‌ ప్రభాకర్‌కు విదేశీ పౌరసత్వం ఉందని సీబీఐ పేర్కొనడం పట్ల హైకోర్టు తరపు న్యాయవాది అశ్వినీ కుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన బందువులు ఎవరూ, ఆయన ఆస్తులు గురించి సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదని అశ్వినీ కుమార్‌ ప్రశ్నించారు. నిందితుల పరస్పర అప్పగింతలో భాగంగా సీబీఐ ఎందుకు పనిచేయలేకపోతుందని ప్రశ్నించారు. సీబీఐ వేసిన అఫిడవిట్‌లో ఎటువంటి కొత్త విషయాలు లేవని, అందరికి తెలిసిన విషయాలే అందులో ఉన్నాయని అశ్వినీ కుమార్‌ పేర్కొన్నారు. గుగుల్‌‌లోకి వెళితే ఈ విషయాలు అందరికీ తెలుస్తాయన్నారు. తమకు సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారాలు సమాచారం ఇవ్వడంలేదని ధర్మాసనానికి సీబీఐ తరపు న్యాయవాది వివరించారు. సీబీఐ అడిగిన సమాచారాన్ని తాము ఎప్పటికప్పుడు ఇస్తున్నామని సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారాల న్యాయవాదులు చెప్పారు. దీంతో హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. జనవరి 25వ తేదీలోపు కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అందులో అంశాలు, విదేశాల్లో ఉన్న నిందితులను అరెస్ట్‌కు తీసుకుంటున్న చర్యలపై పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐను హైకోర్టు ధర్మాసనం  ఆదేశించింది. ఆ తరువాత అఫిడవిట్‌ను పరిశీలించి ఏం చేయాలన్న అంశం‌పై తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. 


Updated Date - 2021-12-13T22:45:13+05:30 IST