ఆండ్రాయిడ్‌ సేఫ్టీ ఫీచర్లు

ABN , First Publish Date - 2021-06-12T05:30:00+05:30 IST

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లకు ఉన్న ఆదరణ తిరుగులేనిది. మోసం చేయాలనుకున్నా దీనినే అదనుగా తీసుకుంటున్నారు.

ఆండ్రాయిడ్‌ సేఫ్టీ ఫీచర్లు

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లకు ఉన్న ఆదరణ తిరుగులేనిది. మోసం చేయాలనుకున్నా దీనినే అదనుగా తీసుకుంటున్నారు. మాల్వేర్‌ పంపి మోసం చేస్తున్న విషయాన్ని గుర్తించిన ఆండ్రాయిడ్‌, భద్రత చర్యలు పటిష్టపర్చినప్పటికీ, వాటిని వినియోగించుకోవడంలో యూజర్లు కొంత వెనుకబడి ఉన్నారని చెప్పవచ్చు. అసలు ఏయే చర్యలతో భద్రత పెంచుకోవచ్చో చూద్దాం. 

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఉన్న యాప్స్‌, ప్రాసెసస్‌, ఏపీకే ఫైళ్ళను మొదట చెక్‌ చేసుకోవాలి. అలాగే వాటన్నింటిపై సదా ఒక కన్నేసి ఉంచాలి. అప్పుడు మాత్రమే ఏవైనా అనవసరంగా వచ్చి చేరుతున్నాయా అన్నది తెలుస్తుంది. స్పైవేర్‌, యాడ్‌వేర్‌ అలాగే ఇతర మాల్వేర్‌లు తమ ఆనుపానులు కనిపించని పద్ధతిలోనే వచ్చి చేరుతుంటాయి. మీ డేటాను తస్కరించే పని చేస్తుంటాయి. వీటికి ఐకాన్‌ అంటూ ఏమీ ఉండదు. సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ఎప్పటికప్పుడు యాప్స్‌ జాబితాను చెక్‌ చేసుకుంటూ ఉండాలి. సిస్టమ్‌ ప్రాసెస్‌ చెకింగ్‌ను కూడా ఇందులో కలుపుకోవాలి. 



పర్మిషన్‌ మేనేజర్‌తో చెక్‌

ఏయే యాప్‌లకు ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయో చెక్‌  చేసుకోవాలి. అంటే సెన్సర్లకు యాక్సెస్‌, డేటా ఎలా ఉందో  చూసుకోవాలి. ఆండ్రాయిడ్‌ 11 ఫోన్లలోకి వెళితే సెట్టింగ్స్‌లో ‘పర్మిషన్‌ మేనేజర్‌’ ఉంటుంది. బాడీ సెన్సర్స్‌, కాల్‌ లాగ్‌, కెమెరా, మైక్రోఫోన్‌, ఫైల్స్‌ అండ్‌ మీడియా, ఫిజికల్‌ యాక్టివిటీస్‌ వరకు అన్నింటినీ దీంతో చెక్‌ చేసుకోవచ్చు. ఫోన్‌ పనిచేయడానికి అన్ని యాప్‌ల యాక్సెస్‌ అవసరం ఉండదని ముందు తెలుసుకోండి. అవసరాలకు అనుగుణంగా ఈ యాప్స్‌ సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. ‘ఆస్క్‌ ఎవ్రీ టైమ్‌’, ‘డినై’తో డేటా యాక్సెస్‌ను పరిమితం చేసుకోవచ్చు. 


గూగుల్‌ ప్లే నుంచే డౌన్‌లోడ్‌

మెసేజ్‌లలో వచ్చే లింక్స్‌తో యాప్స్‌, ఏపీకే ఫైల్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. యాప్‌ పేరు బాగా తెలిసి ఉన్నట్టు అనిపించినప్పటికీ వాటిని కూడా ‘గూగుల్‌ ప్లే స్టోర్‌’ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఫోన్‌ని స్కాన్‌ చేసుకునేందుకు డిఫాల్ట్‌ ఆప్షన్‌ ఉంటుంది. సెట్టింగ్స్‌ - సెక్యూరిటీ - గూగుల్‌ ప్లే ప్రొటెక్ట్‌తో రోగ్‌ యాప్‌లను సులువుగా పట్టేయవచ్చు. తరచూ ఫోన్‌ను స్కాన్‌ చేసుకోవడాన్ని మర్చిపోకూడదు.



ఇన్‌స్టాల్‌ అన్‌నోన్‌ యాప్స్‌ డిజేబుల్‌

సెట్టింగ్స్‌ మెనూలో చేంజింగ్‌ ఆప్షన్‌ను ఉపయోగించి తెలియని లేదా మూడో పార్టీ యాప్స్‌ డౌన్‌లోడ్‌కు ఆస్కారం లేకుండా చూసుకోవచ్చు. దీంతో మీ అనుమతి లేకుండా యాప్స్‌ డౌన్‌లోడ్‌ కావు. ‘గూగుల్‌ క్రోమ్‌ సేఫ్‌ బ్రౌజింగ్‌’ను ఎనేబుల్‌ చేసుకోండి. గూగుల్‌ క్రోమ్‌తో ఇంటర్నెట్‌ను బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు ‘సేఫ్‌ బ్రౌజింగ్‌’ టర్న్‌ ఆన్‌లో ఉందా లేదా చూడండి. చెత్త వెబ్‌సైట్లు టచ్‌ చేయకుండా ఇది కాపాడుతుంది. 


యాప్‌ పిన్నింగ్‌కు టర్న్‌ ఆన్‌

గేమ్‌ ఆడుకునేందుకో, మరొకటి చూసేందుకో ఫోన్‌ను ఫ్రెండ్‌ లేదంటే ఇంకొకరికి ఇచ్చే ముందు యాప్‌ పిన్నింగ్‌ను ఎనేబుల్‌ చేయండి. మీరంతట మేరు అన్‌పిన్‌ చేసేవరకు కరెంట్‌ యాప్‌ వ్యూలో ఉంటుంది. ముఖ్యంగా ఈ చర్యతో మీ ఫోన్‌లో వ్యవహారాలపై గూఢచర్యం చేసేందుకు అవతలి వ్యక్తులకు వీలు ఉండదు. 


టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌

గూగుల్‌ అకౌంట్‌కు సంబంధించి టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను చెక్‌ చేసుకోండి. అందుకోసం ‘ఫైండ్‌ మై డివైస్‌’ టర్న్‌ ఆన్‌ చేయాలి. డివైస్‌ పోయినా లేదంటే డేటా పోతే సెర్చ్‌ చేసుకోవచ్చు. 


లిమిట్‌ విజిబిలిటీ

మీకు ఎవరు మెసేజ్‌ చేశారు అన్నది వేరే వ్యక్తులు చెక్‌ చేసే వీలు లేకుండా విజిబిలిటీని పరిమితం చేసుకోవచ్చు. లాక్‌ స్ర్కీన్‌ నోటిఫికేషన్స్‌తో ఈ పని చేయవచ్చు.సెట్టింగ్‌ మెనూలో ఇది ఉంటుంది. 


ఉపయోగించని యాప్‌ల డిలీట్‌

తరచూ ఉపయోగించని యాప్‌లను డిలీట్‌ చేసుకోవడం మంచి ఆలోచన. తక్కువగా ఉపయోగించే యాప్‌లను తరచూ అప్‌డేట్‌ చేసుకోని పక్షంలో అవే మాల్‌వేర్‌ ఫోన్‌లో చేరేందుకు బ్యాక్‌డోర్‌గా ఉపయోగపడతాయి. అందువల్ల వాటిని తీసేయడమే మంచిది. 


వైఫై, బ్లూటూత్‌ అనవసరంగా వద్దు

వైఫై ఉచితం కదా అని అస్తమాను దాన్ని ఎనేబుల్‌ చేసుకోవాల్సిన పనిలేదు. పడుకున్నప్పుడు, జిమ్‌లో ఉన్నప్పుడు, వాకింగ్‌ సమయాల్లో వైఫై, బ్లూటూత్‌ను ఆఫ్‌లో ఉంచుకోవచ్చు. ఉచితంగా అందుబాటులోకి వచ్చే వైఫై తదితరాలతో కూడా మాల్వేర్‌ ప్రవేశించే అవకాశం ఉంటుంది. 


Updated Date - 2021-06-12T05:30:00+05:30 IST