కరోనా నుంచి కోలుకుని.. బాధిత కుటుంబాలకు అండగా..!

ABN , First Publish Date - 2021-05-14T19:02:50+05:30 IST

కరోనా మహమ్మారి దెబ్బకు అయిన వారే... కానివారుగా మారుతున్న ప్రస్తుత రోజుల్లో

కరోనా నుంచి కోలుకుని.. బాధిత కుటుంబాలకు అండగా..!

  • ఆపత్కాల బంధువులు
  • కుల, మతాలు, పేద, ధనిక తేడా లేకుండా సేవలు 
  • కొవిడ్‌ బాధిత కుటుంబాలకు ఆహారం, మాస్కుల పంపిణీ
  • అవసరార్ధులు 93926 30475కు ఫోన్‌ చేయొచ్చు

హైదరాబాద్/బోయినపల్లి : కరోనా మహమ్మారి దెబ్బకు అయిన వారే... కానివారుగా మారుతున్న ప్రస్తుత రోజుల్లో కరోనా బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు బాసటగా ఉంటూ వారికి అండగా నిలుస్తున్నారు కొందరు. ఆ కోవకు చెందిన యువతే బోయినపల్లి ప్రాంతానికి చెందిన గౌరీ బాకరాజు. కొవిడ్‌ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ‘అనస్థిషియా పాటిసరి’ పేరుతో స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారంతో బిస్కెట్లు, పండ్లు, ఆహారం, మాస్కులు అందజేస్తున్నారు. 


కరోనా నుంచి కోలుకుని.. దాతృత్వం చాటుకుంటూ..

కొన్ని నెలల క్రితం ఒకే ఇంట్లో ఉంటున్న గౌరీ బాకరాజు కుటుంబ సభ్యులు 11 మంది ఒకేసారి కరోనా బారిన పడ్డారు. ఇంట్లోనే ఉండి ఒకరికొకరు ధైర్యం నింపుకుంటూ గడిపారు. ఎన్నో బాధలు పడుతూ కరోనాను జయించి బయట పడ్డారు. అప్పుడే ఆమెకు అనిపించింది.. ఆర్థిక స్థోమత ఉన్న తామే కరోనా వేళ ఇన్ని బాధలు పడితే పేదల పరిస్థితి ఏంటా అని. దీంతో కొవిడ్‌ బారిన పడ్డ పేద కుటుంబాలకు అండగా నిలవాలని భావించింది. ఆనాటి నుంచీ కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లోనే వంటలు చేస్తూ, వాటిని ప్యాకెట్లుగా తయా రు చేసి, స్వయంగా తీసుకెళ్లి, వివిధ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తున్నారు. తర్వాత ఆమెకు స్నేహితులు తోడయ్యారు.


రోజూ 200 మందికి పైగా... 

సేవలు ప్రారంభించిన తొలి నాళ్లలో 100 మంది బాధితులకు ఆహారం అందించేవారు. ఇప్పుడు నిత్యం 200 మంది వరకూ అల్పాహారం, భోజనం, పండ్లు అందిస్తున్నారు. ఆపత్కాలంలో బాధితులకు బంధువులుగా నిలుస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత వారి సేవలను మరింత విస్తృతం చేశారు. 


ఇది సేవ చేయాల్సిన తరుణం

కొవిడ్‌ రోగులకు, పోషకాహారం అందించాలన్నదే మా లక్ష్యం. కొన్ని నెలలుగా ఈ తరహా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంట్లోనే ఆహారం తయారుచేసి పంపిణీ చేస్తున్నాం. చాలా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. మా సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించాం. కుటుంబ సభ్యులు, స్నేహితులు వైశాలి సోమంచి, సూర్య, మౌనికారెడ్డి, అనురాగ్‌రెడ్డి నాకు సహకరిస్తున్నారు. వీరందరి ప్రోత్సాహంతో మరింత ఎక్కువ మంది సేవలందించాలనేదే ధ్యేయం. కొవిడ్‌ బాధితులు ఆహారం కోసం 9392630475కు ఫోన్‌ చేయొచ్చు. - గౌరీ (చీఫ్‌ చెఫ్‌)

Updated Date - 2021-05-14T19:02:50+05:30 IST