అంగన్‌వా‘డీలా...

ABN , First Publish Date - 2021-08-03T05:38:20+05:30 IST

గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం అందిచండంతోపాటు చిన్నారులకు పోషణ, పూర్వ ప్రాథమిక విద్యనందించే అంగన్వాడీ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకంగా మార నున్నదా ? అంటే అవునని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

అంగన్‌వా‘డీలా...

172 సర్క్యులర్‌తో గందరగోళం

ప్రీస్కూళ్ల విలీనంపై ఉద్యోగుల్లో ఆందోళన

వ్యవస్థ మనుగడేప్రశ్నార్థకమంటున్న సిబ్బంది


ఏలూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం అందిచండంతోపాటు చిన్నారులకు పోషణ, పూర్వ ప్రాథమిక విద్యనందించే అంగన్వాడీ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకంగా మార నున్నదా ? అంటే అవునని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 172 సర్క్యు లర్‌, కేంద్రం రూపొందించిన విద్యావిధానం వెరసి వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆందోళన బాట పట్టారు. ప్రాథమిక విద్య సహా, పూర్య ప్రాథమిక విద్యను ప్రైవేటుపరం చేయాలన్న కుట్రలో భాగమేనని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తు న్నాయి. ఉద్యోగుల్లో గందరగోళాన్ని, భయాన్ని కల్పిస్తున్న 172 సర్క్యు లర్‌ను తక్షణం వెనక్కి తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయకుండా నిలుపుదల చేయాలని ఉద్యోగులంతా ఆందోళన బాట పట్టారు.


రాబోతున్న మార్పు ఏంటి ?

అంగన్వాడీ కేంద్రాలలో ఇప్పటివరకు అందిస్తున్న పూర్వ ప్రాథమిక విద్యను పీపీ 1, పీపీ (ప్రీప్రైమరీ), ప్రిపరేటరీ తరగతులుగాను, అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలోని 1,2 తరగతులను కలిపి ఫౌండేషన్‌ స్కూల్‌గా మార్పు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయిం చింది. 3 నుంచి 12 వరకూ హైస్కూలు విద్యగా మార్పు చేయనున్నారు. ఫౌండేషన్‌కు సంబంధించి పీపీ 1, పీపీ 2 తరగ తులను అంగన్వాడీ సిబ్బంది బోధించా లని, 1, 2 తరగతులను సెకండరీ గ్రేడ్‌ టీచర్లు బోధించాలని నిర్ణయించారు. ప్రిపరేటరీ క్లాసులు ఎవరు చెప్పాలన్నది నిర్ణయించలేదు. కేంద్ర నూతన విద్యా విధానం ప్రకారం ఈ మొత్తాన్ని భవిష్య త్తులో ప్రైవేటు వ్యక్తులకు, సొసైటీలకు అప్పగిస్తారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. అందుకోసమే ఇవి ముందస్తు ఏర్పాటుగా వారు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే విలీన ప్రక్రియ జోరందుకుంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న అద్దె భవనాలపై అధికారులు దృష్టి సారించారు. జిల్లాలో మొత్తం 3,889 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 1,466 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. వీటిని ప్రాథమిక పాఠశాలలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాథమిక పాఠశాలల్లోనే అదనంగా ఒక గది నిర్మించి అక్కడే అంగన్వాడీ కేంద్రాలను నడిపేందుకు ఏర్పాటు చేస్తున్నారు.


 విలీనం ఆపాలి

–భారతి, యూనియన్‌ జిల్లా కార్యదర్శి


తక్షణం అంగన్వాడీల విలీనాన్ని ఆపాలి. ప్రాథమిక పాఠశాలల్లోకి కేంద్రాలను తరలించడం ప్రైవేటీకరణ కుట్రలో భాగమే. నూతన విద్యా విధానం అమలులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను నీరుగారుస్తున్నాయి.


మనుగడే ప్రశ్నార్థకం 

– కె.ఝాన్సీ, జిల్లా అధ్యక్షురాలు


ప్రస్తుత విధానంతో అంగన్వాడీల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. పూర్వ ప్రాథమిక విద్యను కూడా ప్రైవేటుపరం చేసేందుకు జరుగుతున్న కుట్ర ఇది. ప్రభుత్వం ఈ విధానాలను విడనాడాలి.  


విలీనమేమీ కాదు

– విజయకుమారి, ఐసీడీఎస్‌ పీడీ

ఉద్యోగులు చెబుతున్నట్లు ఇది విలీనం కాదు. ఇది కేవలం కో–లొకేషన్‌ కార్యక్రమం మాత్రమే. అంటే అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణంలోకి మారుస్తారే తప్ప వారి విధుల్లో ఎలాంటి మార్పూ ఉండదు. ఇదే విషయం వారికి చెబుతున్నాం. 


Updated Date - 2021-08-03T05:38:20+05:30 IST