ఆందోళనలో అంగన్‌వాడీలు.. ‘సూపర్‌వైజర్‌’ నోటిఫికేషన్‌ సంగతేమైంది?

ABN , First Publish Date - 2022-01-29T13:58:35+05:30 IST

అంగన్‌వాడీ గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీలో ఎప్పటికప్పుడు సమస్యలు వచ్చిపడుతున్నాయి. గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి జనవరి 2న నిర్వహించిన పరీక్షలో ప్రశ్నపత్రం సరిగ్గా లేదని అంగన్‌వాడీ టీచర్లు ఆరోపిస్తున్నారు.

ఆందోళనలో అంగన్‌వాడీలు.. ‘సూపర్‌వైజర్‌’ నోటిఫికేషన్‌ సంగతేమైంది?

2న నిర్వహించిన పరీక్షపైనా అభ్యంతరాలు


హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీలో ఎప్పటికప్పుడు సమస్యలు వచ్చిపడుతున్నాయి. గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి జనవరి 2న నిర్వహించిన పరీక్షలో ప్రశ్నపత్రం సరిగ్గా లేదని అంగన్‌వాడీ టీచర్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో నిర్వహించిన గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీపై కొందరు గతంలో కోర్టును ఆశ్రయించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన పరీక్షకు సంబంధించి తలెత్తిన వివాదానికి ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. ఇప్పుడు కొత్తగా ప్రశ్నపత్రం సరిగ్గా లేదని అంగన్‌వాడీ టీచర్లు ఆరోపిస్తుండడంతో మళ్లీ ఆ పోస్టుల భర్తీపై కూడా సందేహాలు నెలకొన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తలెత్తిన తమ సమస్యకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పరిష్కారం దొరుకుతుందని భావించినా.. జీవో 16తో మరింత అన్యాయం చేశారని అంగన్‌వాడీ టీచర్లు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2013లో జీవో నంబరు 228/2013 ద్వారా 359 గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎలాంటి పరీక్ష లేకుండా తమను రెగ్యులరైజ్‌ చేయాలని సుమారు 160 మంది కాంట్రాక్ట్‌ సూపర్‌వైజర్లు కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం స్టే విధించింది. 


కాంట్రాక్టు సూపర్‌వైజర్ల వాదన సరైంది కాదని అప్పటి ప్రభుత్వం కోర్టుకు వివరించి స్టే వెకెట్‌ చేయించింది. నోటిఫికేషన్‌లో 359 పోస్టులను చూపించినా.. ఆతర్వాత కేవలం 168 గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. సెకండ్‌ లిస్ట్‌లో మిగతా పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన అధికారులు కాలయాపన చేయడంతో సమస్య అలాగే మిగిలిపోయింది. పరీక్ష రాసి వెయిటేజీ మార్కులు సాధించిన అంగన్‌వాడీ టీచర్లకు ఆ పోస్టులు దక్కలేదు. తమ సమస్యకు పరిష్కారం కోరుతూ మంత్రుల చుట్టూ అంగన్‌వాడీలు పదేపదే తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీనికితోడు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ 2016లో ప్రభుత్వం జీవో నంబరు 16 విడుదల చేసింది. దీంతో కాంట్రాక్టు గ్రేడ్‌-2 సూపర్‌వైజర్లు రెగ్యులర్‌ పోస్టుల్లోకి వెళ్తే పరీక్ష రాసిన తమ పరిస్థితి ఏమిటని అంగన్‌వాడీలు అందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-01-29T13:58:35+05:30 IST