దాన్యం కొనుగోలులో జాప్యంపై ఆగ్రహం

ABN , First Publish Date - 2021-11-28T05:24:24+05:30 IST

మండలంలోని కూరెల్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులతో కలిసి కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేశారు.

దాన్యం కొనుగోలులో జాప్యంపై ఆగ్రహం
కోహెడ మండలం కూరెల్లలో రైతులతో కలిసి ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

కోహెడ, నవంబరు 27:  మండలంలోని కూరెల్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులతో కలిసి కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేశారు.  రెండు రోజులుగా ఈ కేంద్రంలో ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో నిర్వాహకులపై వారు మండిపడ్డారు. రైతులకు మద్ధతుగా ఈ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కిసాన్‌సెల్‌ మండల అధ్యక్షుడు భీంరెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కలిసి రైతులను నిలువునా ముంచుతున్నారని ఆరోపించారు. ధాన్యం దిగుమతి సమయంలో తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గాజుల వెంకటేశ్వరు,్ల హుస్నాబాద్‌ నియోజకవర్గం యూత్‌ ఉపాధ్యక్షుడు దూలం శ్రీనివాస్‌, మండల యూత్‌ అధ్యక్షుడు ఆవుల మహేందర్‌, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షులు చింతకింది శంకర్‌, నాయకులు పాల్గొన్నారు.


తరుగు పేరిట మోసం చేస్తే సహించం

హుస్నాబాద్‌రూరల్‌, నవంబరు 27: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మిల్లర్లు తరుగుపేరిట కోతలు విధిస్తూ రైతులను మోసం చేస్తే ఊరుకోబోమని సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు గడిపె మల్లేశం పేర్కొన్నారు. శనివారం మహ్మదాపూర్‌, నాగారం తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో తూర్పారబట్టే యంత్రాలను కొనుగోలు చేసి ఇచ్చినప్పటికీ కొనుగోలులో ఎందుకు జాప్యం జరుగుతున్నదని అధికారులను ప్రశ్నించారు. ధాన్యం డబ్బులు సకాలంలో బ్యాంకులో జమకావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.  జిల్లా అధికారులు స్పందించి రైతుల ధాన్యం డబ్బులను వెంటనే బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో  జిల్లా కౌన్సిల్‌ సభ్యులు  అయిలేని సంజీవరెడ్డి, కొయ్యడ కొంరయ్య, సుదర్శనచారి, ఏఐవైఎఫ్‌ జిల్లా నాయకులు జనగామ రాజ్‌కుమార్‌, పిట్టల ప్రసాద్‌, సుధాకర్‌, దుద్దెడ రాజయ్య, మొగిలయ్య, రమేష్‌ బాలయ్య తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-11-28T05:24:24+05:30 IST