కరోనా చికిత్సలో యువకెరటం

ABN , First Publish Date - 2020-10-22T06:06:14+05:30 IST

కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు వందలాది శాస్త్రవేత్తలు అలుపెరగకుండా ప్రయత్నిస్తున్న ఈ సమయంలో ఒక స్కూలు విద్యార్థిని తన సైన్స్‌ ప్రాజెక్ట్‌తో కరోనాపై పోరులో కొత్త ఆశలు రేపుతోంది...

కరోనా చికిత్సలో యువకెరటం

కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు వందలాది శాస్త్రవేత్తలు అలుపెరగకుండా ప్రయత్నిస్తున్న ఈ సమయంలో ఒక స్కూలు విద్యార్థిని తన సైన్స్‌ ప్రాజెక్ట్‌తో కరోనాపై పోరులో కొత్త ఆశలు రేపుతోంది. కరోనా వైరస్‌ వృద్ధిని నియంత్రించే ప్రొటీన్‌కు అతుక్కునే ఒక పదార్థాన్ని రూపొందించింది అనికా చేబ్రోలు అనే యువ శాస్త్రవేత్త. అంతేకాదు ‘3క యంగ్‌ సైంటిస్ట్‌ ఛాలెంజ్‌’లో విజేతగా నిలిచిన ఈ ఇండియన్‌ అమెరికన్‌ విశేషాలివి... 


కరోనా వైరస్‌ వ్యాప్తి, వృద్ధిని అరికట్టే దిశగా యువపరిశోధకులు సైతం పరిశోధనలు, ప్రాజెక్టులు చేస్తున్నారు. ప్రపంచం ఎదుక్కొనే సమస్యల మీద ఆవిష్కరణలు చేస్తున్న వారిని ప్రోత్సహించేందుకు అమెరికాలో నిర్వహించిన ‘3క యంగ్‌ సైంటిస్ట్‌ ఛాలెంజ్‌’లో పద్నాలుగేళ్ల అనికా విజేతగా నిలిచింది. కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు ఆమె చేపట్టిన సైన్స్‌ ప్రాజెక్ట్‌ ఇప్పుడు అందరిలోనూ ఆశలు రేపుతోంది. ‘‘నేను కనిపెట్టిన పదార్థం కరోనా వైరస్‌ (సార్స్‌ కోవ్‌-2వైరస్‌)లోని ఒక ప్రొటీన్‌కు అతుక్కుంటుంది. ఆ తరువాత ఆ ప్రొటీన్‌ పనితీరును నియంత్రిస్తుంది. నా ప్రాజెక్టుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఈ ప్రక్రియలో ప్రతిదీ సవ్యంగా జరిగేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నాను’’ అంటుందీ యువ శాస్త్రవేత్త. 


కంప్యూటర్‌ ప్రొగ్రామ్స్‌ సాయంతో

అనికా మొదటి నుంచి కరోనా వైరస్‌ లక్ష్యంగా పరిశోధనలు చేయలేదు. ఆమె ఈ ఏడాది ప్రారంభంలో సీజనల్‌ ఫ్లూను ఎదుర్కోవడం మీద పరిశోధనల్లో మునిగిపోయింది. అయితే కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చిన తరువాత ఆమె ప్రణాళిక ఒక్కసారిగా మారిపోయింది. తేలికగా ఒకరి నుంచి మరొకరికి సోకే ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు శక్తిమంతమైన ఔషధం తీసుకురావాలనుకుంటోంది అనికా. ఆ ఉద్దేశంతోనే ఆమె పలు కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌ సాయంతో సార్స్‌ కోవ్‌-2 వైరస్‌ ప్రొటీన్‌ మీద తాను రూపొందించిన పదార్థం ఎక్కడ అతుక్కుంటుందో తెలుసుకునేందుకు చాలా  ప్రయత్నించింది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ తయారీ చేయడం కోసం, ప్రత్యేకంగా సార్స్‌కోవ్‌-2 వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ మీద అతుక్కొనే పదార్థాన్ని గుర్తించేందుకు అనికా ‘ఇన్‌సిలికో’ విధానాన్ని ఎంచుకుంది. దీంతో కొవిడ్‌-19కు చికిత్స సులభతరమవుతుంది. 


తాతయ్య వల్లనే సైన్స్‌పై ఆసక్తి...

భవిష్యత్తులో మెడికల్‌ రీసెర్చర్‌, ప్రొఫెసర్‌ అవ్వాలనుకుంటున్న అనికాకు సైన్స్‌ మీద ఆసక్తి పెరగడానికి కారణం ఎవరో తెలుసా... వాళ్ల తాతయ్య. ‘‘నేను చిన్నగా ఉన్నప్పుడు మాతాతయ్య ప్రతిసారి నాకు సైన్స్‌కు సంబంధించిన విషయాలే చెబుతుండేవారు. ఆయన రసాయనశాస్త్రంలో ప్రొఫెసర్‌. దాంతో ఆవర్తనపట్టికలోని మూలకాలు, వాటికి సంబంధించిన సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాలని నాకు పదేపదే చెప్పేవారు. అలా రోజులు గడిచే కొద్దీ నాకు సైన్స్‌ మీద ఇష్టం పెరిగింది. నా సైన్స్‌ ప్రాజెక్ట్‌కు మీడియా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే కరోనా వైరస్‌ అంతమవ్వాలని అందరూ ఎంత బలంగా కోరకుంటున్నారో అర్థమవుతుంది. నేను కూడా అందరిలానే కోరకుంటున్నా. మనందరం తిరిగి మునుపటిలా జీవితాన్ని ఆస్వాదిస్తామని భావిస్తున్నా’’ అంటుంది అనికా.

Updated Date - 2020-10-22T06:06:14+05:30 IST