అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఔట్‌

ABN , First Publish Date - 2021-04-06T08:25:34+05:30 IST

అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజీనామా చేశారు. నెలకు రూ 100 కోట్ల

అనిల్‌ దేశ్‌ముఖ్‌  ఔట్‌

  • మహారాష్ట్ర హోం మంత్రి రాజీనామా.. వసూళ్ల టార్గెట్‌ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు
  • మాజీ పోలీసు కమిషనర్‌ పరమ్‌బీర్‌సింగ్‌ 
  • ఆరోపణపై దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం
  • ఆ వెంటనే దేశ్‌ముఖ్‌ నిష్క్రమణ
  • సుప్రీంకు వెళ్లాలని మహా సర్కార్‌ నిర్ణయం
  • కొత్త హోం మంత్రిగా దిలీప్‌ వాల్సే పాటిల్‌ 
  • ఠాక్రే సర్కార్‌ వైదొలగాలి: బీజేపీ డిమాండ్‌

ఒక హోంమంత్రి అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని ఓ సీనియర్‌ అధికారి ఆరోపించడం  ఎన్నడూ విననిది.. మున్నెన్నడూ లేనిది.. అసాధారణమైనది. ఇది చాలా సీరియస్‌ వ్యవహారం. దీనిపై స్వతంత్ర దర్యాప్తు అవసరం. 

- బాంబే హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌


ముంబై, ఏప్రిల్‌ 5: అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజీనామా చేశారు. నెలకు రూ 100 కోట్ల రూపాయల ముడుపులను  బార్లు, రెస్టారెంట్లు, హుక్కా సెంటర్ల నుంచి వసూలు చేయాలంటూ కొందరు పోలీస్‌ అధికారులకు దేశ్‌ముఖ్‌ టార్గెట్‌ విధించారని ముంబై పోలీస్‌ మాజీ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశించింది. 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ జరిపి వివరాలను తమకు అందజేయాలని కోరింది. దీంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌  వెంటనే తన పదవికి రాజీనామా సమర్పించారు. ఈ ఆకస్మిక ఘటనతో ఉద్ధవ్‌ ఠాక్రే సర్కారు ఇరకాటంలో పడింది. కొత్త హోంమంత్రిగా దిలీప్‌ వాల్సే పాటిల్‌ను నియమించింది.


పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్‌ అంబానీ నివాసం ఏంటీలియా వద్ద పేలుడు పదార్థాలతో నిండిన వాహనం పార్క్‌ చేసిన కేసులో ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసిన వివాదాస్పద పోలీస్‌ అధికారి సచిన్‌ వాజేకు దేశ్‌ముఖ్‌ ఈ వసూళ్ల టార్గెట్‌ ఇచ్చారని పరమ్‌బీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణ మహారాష్ట్ర రాజకీయాల్ని ఒక్క కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ్‌ముఖ్‌ రాజీనామా చేయాలని కొద్ది రోజుల కిందటే తీవ్ర ఒత్తిళ్లు వచ్చినా ఆయన వైదొలగలేదు. ఎన్‌సీపీకి చెందిన ఆయనను ఆ పార్టీ అగ్రనేత శరద్‌ పవార్‌ సైతం వెనకేసుకొచ్చారు. తనను సీపీగా తొలగించి అప్రాధాన్య విభాగానికి బదిలీ చేయడంతో పరమ్‌బీర్‌ తన ఆరోపణలతో సుప్రీంకెక్కారు. సుప్రీంకోర్టు దీనిని హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. పరమ్‌బీర్‌తో పాటు ఘనశ్యామ్‌ ఉపాధ్యాయ్‌, మోహన్‌ భిడే అనే టీచర్లు, జయశ్రీ పాటిల్‌ అనే లాయర్‌ కూడా ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోరుతూ బాంబే హైకోర్టులో కేసు వేశారు.


 ‘‘ఒక హోంమంత్రి అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని ఓ సీనియర్‌ అధికారి ఆరోపించడం  ఎన్నడూ విననిది.. మున్నెన్నడూ లేనిది.. అసాధారణమైనది. ఇది చాలా సీరియస్‌ వ్యవహారం. దీనిపై స్వతంత్ర దర్యాప్తు అవసరం. పరమ్‌బీర్‌ చేసిన ఆరోపణలు గనక నిజమైతే పోలీసు యంత్రాంగం పనితీరుపై పౌరుల విశ్వాసం సన్నగిల్లుతుంది.  ఇలాంటి ఆరోపణలను అలా వదిలేయలేం. వాటిని లోతుగా పరిశీలించాలి.  ప్రజల్లో ఆ విశ్వాసాన్ని తిరిగి పాదుకొల్పాలి. వారి ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించాలి. ఇందుకు ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలి. నేరమని తేలితే ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయాలి’’ అని చీఫ్‌ జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ జీఎస్‌ కులకర్ణిలతో కూడిన బెంచ్‌ తన 52- పేజీల తీర్పులో పేర్కొంది.


పరమ్‌బీర్‌ చేసిన ఆరోపణల ఆధారంగా దేశ్‌ముఖ్‌పై కేసు నమోదుచేయాలని పిటిషనర్లలో ఒకరైన జయశ్రీ పాటిల్‌ పోలీసులను ఆశ్రయించినా పోలీసులు కేసు నమోదు చేయలేదని బెంచ్‌ గుర్తు చేసింది. కోర్టు తీర్పు వెలువడగానే అనిల్‌ దేశ్‌ముఖ్‌ శరద్‌ పవార్‌ నివాసానికి వెళ్లి చర్చించారు. ఆయన సూచనల మేరకు వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేని కలిసి రాజీనామా లేఖ అందించారు. ‘కోర్టు ఆదేశాలు వెలువడ్డాక ఈ పదవిలో కొనసాగడం నైతికంగా సరికాదు. ఈ పదవి నుంచి వెంటనే నన్ను రిలీవ్‌ చేయండి’ అని అందులో కోరారు. ఠాక్రే వెంటనే దానిని ఆమోదించారు.


ఎన్‌సీపీకే చెందిన దిలీప్‌ వాల్సే పాటిల్‌ను రాష్ట్ర కొత్త హోంమంత్రిగా నియమించారు. సీనియర్‌ రాజకీయవేత్త అయిన పాటిల్‌ ప్రస్తుతం కార్మిక, ఎక్సైజ్‌ శాఖల మంత్రిగా ఉన్నారు. గతంలో స్పీకర్‌గా కూడా పనిచేశారు. శరద్‌ పవార్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా రాజకీయ జీవితం ఆరంభించిన పాటిల్‌ పవార్‌ స్నేహితుడు, మాజీ ఎమ్మెల్యే దత్తాత్రేయ వాల్సే పాటిల్‌ కుమారుడు.


కాగా- పరమ్‌బీర్‌ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని అనిల్‌ దేశ్‌ముఖ్‌తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిశ్చయించింది. దేశ్‌ముఖ్‌ రాజీనామా చేసిన వెంటనే బీజేపీ దాడి మొదలెట్టింది. ‘‘పదవిలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయానని దేశ్‌ముఖ్‌ అన్నారు. కానీ ముఖ్యమంత్రి ఠాక్రే దీనిపై మౌనం దాల్చారు. ఆయన కూడా పాలించే నైతిక హక్కు కోల్పోయారు. తక్షణం గద్దె దిగాలి’’ అని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ‘‘ఈ వ్యవహారమంతా రాజకీయ అంశం. అయితే న్యాయవ్యవస్థను గౌరవించడం మా సంప్రదాయం’’ అని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు. 


Updated Date - 2021-04-06T08:25:34+05:30 IST