Oct 24 2021 @ 19:37PM

Anil paaduri: పూరి జగన్నాథ్‌ ఇచ్చిన ధైర్యంతో... ముందుకెళ్లా

‘‘నువ్వు సొంత కథ రాయగలవు. దానితో ఎవరినైనా ఒప్పించగలవ్‌. మంచి కథ రాసుకో’ అని పూరి జగన్నాథ్‌గారు దైర్యం ఇచ్చారు. సినిమా పూర్తయ్యాక అవుట్‌పుట్‌ చూపించా. ఆయన అలా లేచి వెళ్లిపోయారు. మళ్లీ వచ్చి కంట తడిపెట్టుకున్నారు. నా సినిమాలో ఇంత ఎమోషన్‌ ఎక్కడుందా? అనుకున్నాను. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాలో అంత ఎమోషన్‌ ఉందో.. అంతకుమించి ఈ చిత్రంలో ఉంది. నీకు మంచి భవిష్యత్తు ఉంది’ అని పూరి జగన్నాథ్‌ ప్రశంసించారు’’ అని చెప్పారు దర్శకుడు అనిల్‌ పాదూరి. పూరి ఆకాశ్‌, కేతిక శర్మ జంటగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘రొమాంటిక్‌’. పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనిల్‌ విలేకర్లతో మాట్లాడారు. 


మాది నర్సాపురం. ఇంజనీరింగ్‌ చేసి ఆర్ట్‌ మీదున్న ఆసక్తితో సినిమారంగంలో అడుగుపెట్టా. కళ్యాణ్‌ రామ్‌ గారితో కలిసి ఓ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీ ప్రారంభించాను. ‘టెంపర్‌’ సినిమా సమయంలో పూరి గారితో  పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని బట్టి దర్శకుడిగా నాకీ అవకాశం వచ్చింది. రైటింగ్‌ సెషన్స్‌కి నన్ను కూడా తీసుకెళ్లేవారాయన. ‘ఇజం’ సినిమా సమయంలోనే పూరి నన్ను వేరే కథను డైరెక్ట్‌ చేయమన్నారు. అప్పుడు నా మీద నాకు అంతగా నమ్మకం లేదు. నేను రాసే సీన్స్‌ ఆయనకు బాగా నచ్చేవి. ఆ నమ్మకంతోనే ‘రొమాంటిక్‌’ కథను ఇచ్చారు. దర్శకుడు అవ్వాలనే తపన పూరిగారిని చూశాక మొదలైంది. 


ప్రేమంటే పడని కుర్రాడు ప్రేమలో పడితే...

మోహానికి, ప్రేమకు మధ్య జరిగే కథే రొమాంటిక్‌. ప్రేమ, ఆకర్షణకు మధ్య ఉన్న సన్నని గీత గురించి ఇందులో వివరించాం. ప్రేమను నమ్మని ఓ కుర్రాడు.. ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది కథ. ఇందులో మంచి ఎమోషనల్‌ డ్రైవ్‌ ఉంటుంది. ట్రైలర్‌లో ఎక్కువగా రొమాన్స్‌ ఉంది కదా? అని సినిమా అంత అలానే ఉంటుందని కాదు. ఇది యూత్‌కే కాదు ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చుతుంది. కథ, మాటలు పూరి జగన్నాథ్‌ గారవే అయినా సినిమా నా మార్క్‌లో తీశా. ఆయన ప్రభావం లేకుండా నా పని జరగడు. ఈ కథను నువ్వు డైరెక్ట్‌ చేస్తే కొత్త ఫ్లేవర్‌ వస్తుందని ఆయన ప్రోత్సహించారు. ఆకాశ్‌ ఈ కథకు కరెక్ట్‌ హీరో. వంద శాతం పాత్రకు న్యాయం చేశాడు. ,ప్రేక్షకులు కూడా అదే చెబుతారు. కేతిక శర్మ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఆకాష్‌ కెరీర్‌కు రొమాంటిక్‌ చిత్రం బాగా ఉపయోగపడుతుది. రమ్యకృష్ణగారు రావడంతో  మా సినిమా లుక్‌ మారిపోయింది. ఆమె స్థ్థాయికి తగ్గ పాత్ర చేశారు. ఈ కథకు రమ్యకృష్ణ పాత్ర పిల్లర్‌ అనొచ్చు. 


కంట తడి పెట్టారు...

అవుట్‌పుట్‌ రెడీ అయ్యాక పూరిగారికి సినిమా చూపించా. ఆయన అలా లేచి వెళ్లిపోయారు. మళ్లీ వచ్చి కంట తడిపెట్టుకున్నారు. నా సినిమాలో ఇంత ఎమోషన్‌ ఎక్కడుందా? అని అనుకున్నాను. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాలో అంత ఎమోషన్‌ ఉంది. ఇందులో అంత కంటే ఎక్కువగా ఉంది. నీకు మంచి భవిష్యత్తు ఉంది’ మంచి సినిమా తీశావ్‌ అని మెచ్చుకున్నారు. మా సినిమాకు ఓటీటీ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి.  థియేటర్లోనే రిలీజ్‌ చేయాలని పూరి, ఛార్మీలకు థ్యాంక్స్‌. 


యన్‌.టి.ఆర్‌ ఆర్ట్స్‌లో రెండో సినిమా...

నా మొదటి సినిమా  యన్‌.టి.ఆర్‌ ఆర్ట్స్‌లోనే చేయాలి. ‘ఇజం’ సమయంలో వీఎఫెఎక్స్‌ పనులతో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను.  రెండో సినిమా యన్‌.టి.ఆర్‌ ఆర్ట్స్‌లోనే చేస్తున్నాను. అయితే రెండో సినిమాకు ఇంకా కథ సిద్ధం చేయలేదు. నాకు కమర్షియల్‌ సినిమాలంటే ఇష్టం. తర్వాతి చిత్రం ఆ తరహాలోనే ఉంటుంది.  వీఎఫ్‌ఎక్స్‌ మీద పట్టుంది కదా అని అవసరం లేకపోయినా ఇరికించను. కథను బట్టి వీఎఫెఎక్స్‌ చేయాల్సి ఉంటుంది. రాజమౌళి, త్రివిక్రమ్‌, కరుణాకరన్‌ చిత్రాలకు వీఎఫెఎక్స్‌ చేశాను.