రక్తదానం చేస్తున్న కుక్కలు, పిల్లులు

ABN , First Publish Date - 2021-02-25T15:08:50+05:30 IST

మనుషులకు సంబంధించిన బ్లడ్ బ్యాంక్ గురించి అందరికీ తెలిసిందే.

రక్తదానం చేస్తున్న కుక్కలు, పిల్లులు

న్యూయార్క్: మనుషులకు సంబంధించిన బ్లడ్ బ్యాంక్ గురించి అందరికీ తెలిసిందే. అయితే జంతువులకు సంబంధించిన బ్లడ్ బ్యాంక్ గురించి మీరెప్పుడైనా విన్నారా? ప్రపంచంలోని పలు దేశాల్లో ‘పెట్స్ బ్లడ్ బ్యాంక్’ లు ఉన్నాయి. ఈ బ్లడ్ బ్యాంకులలో అధికశాతంలో కుక్కలు, పిల్లుల రక్తం లభ్యమవుతుంది. ఈ జంతువులు... మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉండటం కారణంగానే ఈ బ్లడ్ బ్యాంకులు ఏర్పడ్డాయి. ఎవరికైనా కుక్క లేదా పిల్లి బ్లడ్ కావాలంటే ఈ బ్యాంకులలో సంప్రదించవచ్చు. 


కుక్కలకు, పిల్లులకు కూడా బ్లడ్ గ్రూపులలో వివిధ రకాలు ఉంటాయి. కుక్కలకు సంబంధించి 12 రకాల బ్లడ్ గ్రూపులుంటాయి. పిల్లులకు మూడు రకాల బ్లడ్ గ్రూపులుంటాయి. ఉత్తర అమెరికాలోని ‘పశు చికిత్స బ్లడ్ బ్యాంక్’ హెడ్ డాక్టర్ కెసీ మిల్స్ తెలిపిన వివరాల ప్రకారం కాలిఫోర్నియాలోని డిక్సన్, గార్డెన్ గ్రోవ్ పట్టణాలతో పాటు స్టాక్‌బ్రిడ్జి, వర్జీనియా, బ్రిస్టో, మేరీలాండ్ తదితర ప్రాంతాలలో పశువుల బ్లడ్ బ్యాంకులున్నాయి. ఇక్కడికి చాలామంది తమ కుక్కలను, పిల్లులను తీసుకువచ్చి వాటిచేత రక్తదానం చేయిస్తుంటారు. పశువులకు సంబంధించిన రక్తదాన ప్రక్రియకు 30 నిముషాల సమయం పడుతుంది. అయితే వాటి నుంచి బ్లడ్ సేకరించేటప్పడు వాటికి మత్తుమందు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు అప్పుడప్పుడు రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తుంటారు. భారత్‌లోని తమిళనాడులో ‘తనువాస్ పశు బ్లడ్ బ్యాంక్’ ఉంది. ఇది ప్రభుత్వ పశువైద్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. 

Updated Date - 2021-02-25T15:08:50+05:30 IST