Abn logo
Nov 25 2021 @ 00:00AM

మృగాలను కెమెరాలో బంధించేస్తుంది!

కాలేజీ ట్రిప్పు... కేరళలోని ‘పెరియార్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌’... లోపలికి అడుగుపెట్టగానే ఓ అడవి ఏనుగు... అంతెత్తు ఆకారాన్ని ఒక్కసారిగా చూసే సరికి పక్కనున్న స్నేహితుల్లో భయం... బెరుకు. కానీ ఆమె ముఖంలో ఆశ్చర్యం... ఆనందం. వెంట తెచ్చుకున్న చిన్ని కెమెరా తీసి... ఆ గజరాజ ఠీవీని చిత్రీకరించింది. ఆ ‘చిత్రం’ తరువాత ఆమె జీవనచిత్రమైంది. దేశంలోనే తొలి మహిళా వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా ఎందరికో స్ఫూర్తిమంత్రమైన రాధికా రామస్వామి అనుభవాలు ‘నవ్య’కు ప్రత్యేకం...


ఉత్తరాఖండ్‌ ‘జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌’లో... ఇరుకైన మార్గం ద్వారా జీపులో ఓ పర్వతంపైకి వెళ్లాం. కెమెరా పట్టుకుని పులుల కోసం వేచి చూస్తున్నా. ఉన్నట్టుండి ఓ ఏనుగు... మాకేసి దూసుకువస్తోంది. ఒకవైపు కొండ... ఇంకో వైపు లోయ... తప్పించుకొనే మార్గం లేదు. ఇక మా పని అయిపోయిందనుకున్నాం. 


‘‘పక్షులు... ప్రకృతిపై ప్రేమ... ఫొటోగ్రఫీ అంటే మక్కువ... పదో తరగతిలో ఉన్నప్పుడే నా ‘క్లిక్‌’ కహానీ మొదలైంది. స్కూల్‌కు వెళ్లే రోజుల్లో భుజాన ఎప్పుడూ ఒక కెమెరా వేలాడుతుండేది. ఇంట్లో కంటే బయట ప్రపంచంలోనే ఎక్కువ గడిపేదాన్ని. కొత్త ప్రదేశాలు చుట్టిరావడమంటే మహా సరదా. ఏ చోట నేనున్నా... దానికి గుర్తుగా ఒక చిత్రం నా లెన్స్‌లో ఫిక్సయిపోతుండేది. అవే కదా తీపి జ్ఞాపకాలుగా మిగిలేది. నేను పుట్టిన ఊరు... పెరిగిన పరిసరాలు... నన్ను ఇటు వైపు నడిపించాయి. 


తమిళనాడు తేని జిల్లా పశ్చిమ కనుమల చెంతనున్న వెంకటాచలపురం మా ఊరు. పర్వతాలు... పరుచుకున్న పచ్చందాలు... అకస్మాత్తుగా పలుకరించే వాన చినుకులు... ఆహ్లాదం పంచే అందమైన ప్రదేశం అది. మా ఇంట్లో నుంచి ఆ దృశ్యాలు చూస్తూ మైమరిచిపోయేదాన్ని. నా కనులను తాకిన ఆ చిత్రాలు కలకాలం నాతోనే ఉండిపోవాలంటే! అప్పుడు తట్టిందే ఫొటోగ్రఫీ. 


చదువుతూనే... 

ఒక పక్క చదువుకొంటూనే ఫొటోగ్రఫీ కూడా కొనసాగించా. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ తరువాత ఎంబీయే చేశాను. కానీ ఉద్యోగాల కోసం పరుగెత్తలేదు. ఎందుకంటే అప్పటికే నాకేం కావాలనేదానిపై స్పష్టత ఉంది. చదువు అవగానే పూర్తిగా నా అభిరుచి కోసం సమయం కేటాయించే వీలు దొరికింది. మొదట్లో నా దగ్గర సాధారణ కెమెరానే ఉండేది. అయితే ఫొటోగ్రఫీని ప్రొఫెషన్‌గా మార్చుకోవాలని నిర్ణయించుకోవడంతో 2004లో డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా కొన్నా. అది తీసుకొని తొలిసారి రాజస్తాన్‌లోని ‘భరత్‌పూర్‌ పక్షుల అభయారణ్యం’కి వెళ్లా. అక్కడున్న రకరకాల పక్షులు, వాటి కదలికలు నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరుక్షణం నా లెన్స్‌ క్లిక్‌మన్నాయి. ప్రొఫెషనల్‌గా మారాక నా మొట్టమొదటి వైల్డ్‌లైఫ్‌ ఫొటో షూట్‌ అది. మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

అంతకముందే... 

వాస్తవానికి దీని కంటే ముందే, అంటే పదో తరగతిలో ఉన్నప్పుడే నేను వైల్డ్‌లైఫ్‌ ఫొటో ఒకటి తీశాను. స్కూల్‌వాళ్లు మమ్మల్ని కేరళలోని ‘పెరియార్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌’కు తీసుకువెళ్లారు. అడవి లోపలకు, అదీ పులులకు ఆవాసమైన ప్రాంతానికి వెళ్లగానే ఏదో తెలియని ఉత్సుకత. ఇంతలోనే అంత దూరంలో అడవి ఏనుగు కనిపించింది. నా స్నేహితులంతా కాస్త భయపడ్డారు. నేను ఆశ్చర్యంగా దాని వంక చూస్తున్నా. ఠక్కున కెమెరా తీసి ఆ ఏనుగుపై ఫోకస్‌ పెట్టాను. అదో అద్భుత అనుభవం. వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ని కావడానికి నాకు స్ఫూర్తినిచ్చిన వాటిల్లో అదొకటి. 


పాతికకు పైనే... 

ఇప్పటి వరకు నేను పాతికకు పైగా నేషనల్‌ పార్క్‌లు, టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లు సందర్శించా. భారత్‌తో పాటు కెన్యా, టాంజానియా, శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్‌ల్లోని అభయారణ్యాలను చుట్టేశా. పక్షుల కదలికలు లెన్స్‌లో బంధించడం నా ప్రత్యేకత. తరువాత ఏనుగులంటే ఇష్టం. పులులు, సింహాల వంటి క్రూరమృగాల చిత్రాలు కూడా తీస్తుంటాను కానీ... అధిక ప్రాధాన్యం మాత్రం పక్షులకే.

 

అంత సులువు కాదు... 

వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ అంటే ఆ ఫొటోలు చూసినంత ఆహ్లాదంగా ఉండదు. ఎంతో క్లిష్టమైన వృత్తి. అయితే అందరూ అనుకున్నట్టు అంత ప్రమాదకరమైనదేమీ కాదు కానీ, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఫొటోలు తీయాలంటే ముందుగా సంబంధిత అటవీ శాఖ వారి అనుమతి తీసుకోవాలి. వాళ్లు ఒక గైడ్‌ని వెంట పంపుతారు. జీప్‌లో నుంచి కిందకు దిగకుండా ఫొటోలు తీసుకోవాలి. ఒక డాక్యుమెంటరీ తీయాలంటే పెద్ద పెద్ద కెమెరాలు, ఇతర వస్తువులు మోసుకొంటూ అడవిలో చాలా దూరం నడవాలి. కావల్సిన షాట్‌ కోసం గంటలకు గంటలు నిరీక్షించాలి. విష సర్పాలు, ఇతర కీటకాలు దాటుకొంటూ వెళ్లాలి. ఒకవేళ జరగరానిది జరిగితే మనల్ని కాపాడేవారెవరూ ఉండరు. అటవీ శాఖ బాధ్యత వహించదు. 


వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌కు అన్నింటి కంటే పెద్ద సమస్య ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం. ఇతర రంగాల్లోలాగా ఆరంభంలో ఆదాయం ఉండదు. 9-5 ఉద్యోగం కాదు. పేరు వస్తే కానీ ఆదాయం ఉండదు. వచ్చినా ఎక్కువ కాలం కొనసాగడం చాలా కష్టం. జీవజాతులపై అమితమైన ప్రేమ గలవారు మాత్రమే ఇటువైపు రావాలి. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉన్నవారు మాత్రమే అడవిలో అడుగుపెట్టాలి. 


నా పని అయిపోయిందనుకున్నా... 

పదిహేడేళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒకేఒక్క సందర్భంలో మినహా నేను భయపడింది లేదు. అడవి ఏనుగులు చాలా ప్రమాదకరమైనవి. ఉత్తరాఖండ్‌ ‘జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌’లో ఎదురైన అనుభవం ఇది. సన్నని మార్గం ద్వారా జీపులో ఓ పర్వతంపైకి వెళ్లాం. కెమెరా పట్టుకుని పులుల కోసం వేచి చూస్తున్నాను. ఉన్నట్టుండి ఒక ఏనుగు... హూంకరిస్తూ మాకేసి దూసుకువస్తోంది. డ్రైవర్‌ జీపు ఆపేశాడు. ఒకవైపు కొండ... ఇంకో వైపు లోయ... తప్పించుకొనే మార్గం లేదు. ఇక మా పని అయిపోయిందనుకున్నాం. అదృష్టమేమంటే... ఆ ఏనుగు దారి మార్చుకుని మాకు దూరంగా వెళ్లిపోయింది. మేం ఊపిరి పీల్చుకున్నాం. తలుచుకొంటే ఇప్పటికీ భయమేస్తుంది. అలాగే సిక్కింలో వారం రోజులు ఫొటో షూట్‌కు వెళ్లినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. నా కెరీర్‌లోనే క్లిష్టమైన ట్రిప్‌ అది. ఎత్తయిన కొండపైకి వెళ్లినప్పుడు ఆక్సిజన్‌ సమస్య, మోషన్‌ సిక్‌నెస్‌ వంటి సమస్యలు ఎదురయ్యాయి. వన్యప్రాణుల కదలికలు, అవుట్‌డోర్‌ లైట్‌... ఇక్కడ ఏదీ మన నియంత్రణలో ఉండదు. కానీ అద్భుతమైన ఫొటోలు తీయాలి. నేర్పు, ఓర్పు ఎంతో అవసరం. రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటేనే దీన్ని ప్రొఫెషన్‌గా ఎంచుకోవాలి. అయితే ఒక్కసారి మనం అనుకున్న షాట్‌ అనుకున్నట్టు వచ్చాక కలిగే ఆనందం, సంతృప్తి మాటల్లో చెప్పలేం.

 

అప్పటి వరకు తెలియదు... 

2008లో అనుకొంటా... మహిళా దినోత్సవం సందర్భంగా డీడీ నేషనల్‌ ఛానల్‌ వారు నన్ను అతిథిగా పిలిచారు. ఆ సందర్భంగా వారు... ‘దేశంలోనే తొలి మహిళా ప్రొఫెషనల్‌ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌’ అంటూ నన్ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అప్పటి వరకు ఆ విషయం నాకు కూడా తెలియదు. ఫీల్డ్‌కు వెళ్లిన ప్పుడల్లా తోటి ఫొటోగ్రాఫర్లను అడుగుతుండేదాన్ని... మహిళలు ఎవరూ కనిపించడంలేదని! అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. చాలామంది అమ్మాయిలు ఈ ప్రొఫెషన్‌లోకి వస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. వైల్డ్‌లైఫ్‌ అనేది ఒక సముద్రంలాంటిది. అందులో నేను ప్రయాణించాల్సింది చాలా ఉంది.’’ 

 

రాధికా రామస్వామి...

వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీలో 51 సంవత్సరాల రాధికా రామస్వామిది పదిహేడేళ్ల సుదీర్ఘ పయనం. పురస్కారాలు, అభినందనలు ఎన్నో అందుకున్నారు! ‘ఫొటోగ్రఫీ ఆర్ట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’కు వ్యవస్థాపక సభ్యురాలు. పలు జాతీయ, అంతర్జాతీయ ఫొటో అవార్డులకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. 2019లో తమిళనాడు పదో తరగతి సైన్స్‌ పాఠ్యాంశంలో రాధిక పేరును ప్రస్తుతించారు. ‘ఇంటర్నేషనల్‌ కెమెరా ఫెయిర్‌ అవార్డ్‌’, ‘ఉమన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ’ తదితర అవార్డులు పొందారు. దేశంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన వర్క్‌షాప్‌ల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం భర్తతో కలిసి చెన్నైలో ఉంటున్న ఆమెకు అభయాణ్యాలే ఇల్లు. అందులోని జీవజాతులే ప్రపంచం. 


                                                                                                    హనుమా