జీవులకు సత్యమైన మార్గం

ABN , First Publish Date - 2021-12-24T05:30:00+05:30 IST

రెండువేల ఏళ్ళ క్రితం... మానవాళికి మార్గదర్శనం చేయడానికి ఒక మహాపురుషుడు జన్మించాడు. ..

జీవులకు  సత్యమైన మార్గం

రెండువేల ఏళ్ళ క్రితం... మానవాళికి మార్గదర్శనం చేయడానికి ఒక మహాపురుషుడు జన్మించాడు. సామాన్య మానవుడిగా ఇహలోకంలో కష్టాలు అనుభవించాడు. మానవులను పాప విముక్తులను చేయడానికి శిలువనెక్కి తన రక్తాన్ని చిందించాడు. తన తండ్రి అయిన దేవుడి ఆదేశం ప్రకారం సువార్తను లోకానికి ప్రసాదించాడు. లోకరక్షకుడైన ఏసు ఆవిర్భావాన్ని వేడుక చేసుకుంటూ... ఆయన చూపిన మార్గంలో నడవాలని మరోసారి గట్టి సంకల్పం చేసుకొనే విలువైన సందర్భం... క్రిస్మస్‌.


ఏసు జీవితాన్ని, బైబిల్‌లో ఏసు గురించి ప్రస్తావితమైన విశేషాలను పరిశీలించినప్పుడు ఆయన ఎంతటి విశిష్టమైన వ్యక్తో తెలుస్తుంది. ఏసు సుఖాలనూ, సంపదలనూ ఏనాడూ కోరుకోలేదు. తనపై తన తండ్రి ఉంచిన బాధ్యతను నెరవేర్చడమే ధ్యేయంగా ముందుకుసాగాడు. ఈ క్రమంలో దీనులను ఆదుకున్నాడు. ఎందరికో స్వస్థత కలిగించాడు. శారీరక వైకల్యాలను తొలగించాడు. వారి మానసిక ఉన్నతికి దోహదపడ్డాడు. క్రూరమైన రాజ శాసనాలకు ఆయన లొంగలేదు. మూర్ఖమైన పద్ధతులనూ, ఆచారాలనూ నిర్భయంగా ఎదిరించాడు. ప్రేమ మానవ లక్షణమనీ, తోటివారిని ప్రేమించేవారే దైవానికి సన్నిహితులవుతారనీ స్పష్టం చేశాడు.


ఒకసారి తోమా అడిగిన ఒక ప్రశ్నకు ఏసు జవాబిస్తూ ‘‘నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. నా ద్వారానే తప్ప వేరే ఏ విధంగానూ నా తండ్రి దగ్గరకు రాలేరు. నేను మీకు తెలిసినట్టయితే, నా తండ్రి కూడా మీకు తెలిసినట్టే’’ అన్నాడు. ఈ జవాబు ద్వారా గొప్ప సందేశాన్ని ఏసు అందించాడు. ఆయన మార్గాన్ని చూపిస్తానని చెప్పలేదు... ‘‘నేనే మార్గం’’ అని చెప్పాడు. సత్యాన్ని చెబుతానని అనలేదు. ‘‘నేనే సత్యాన్ని’’ అన్నాడు. నేను జీవాన్ని ప్రసాదిస్తానని అనలేదు. ‘‘నేనే జీవాన్ని’’ అని ప్రకటించాడు. విశ్వాసులు ఈ మాటలను ఎల్లప్పుడూ మననం చేసుకోవాలి. ‘ఏసు’ అనే సత్యాన్ని విశ్వసించి, ‘ఏసు’ అనే జీవాన్ని తమలో నింపుకొని, ‘ఏసు’ అనే మార్గంలో పయనించేవారు... ఈ విశ్వంలోని అందరికీ తండ్రి అయిన దేవుణ్ణి చేరుకోగలుగుతారు. అలా చేరే మార్గం ఏసు మాత్రమేననీ, దైవ కుమారుడైన ఏసుపై విశ్వాసం లేనివారు, ఆయన మార్గాన్ని ఎంచుకోనివారు దైవానికి చేరువకాలేరనీ తోమాకు ఏసు ఇచ్చిన సమాధానం వెల్లడిస్తోంది. 


‘‘ఏసు చేసిన కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ ఒకదాని తరువాత ఒకటి వివరించి రాస్తే... ఆ గ్రంథాలకు ఈ భూలోకం చాలదనిపిస్తోంది’’ అంటాడు యోహాను. ఆయన ఈ కార్యాలన్నీ ఎవరి మెప్పు కోసమో, తన ఘనతను ప్రకటించుకోవడం కోసమో చేయలేదు. మానవుల్లో మార్పు తేవడానికి చేశాడు. ఆనాటి మతగురువుల్లా ఏసు ఒక చోటికి పరిమితమై, తన దగ్గరకు వచ్చినవారికి మాత్రమే సందేశాలు ఇవ్వలేదు. ఆయన కాలినడకనే దూరప్రాంతాలకు పర్యటించాడు. ఇళ్ళలోనే కాదు, సముద్ర తీరాల్లో, పడవల్లో, వీధుల్లో... తనను ఎక్కడ ఎవరు కలిసినా వారికి బోధలు చేసి, మార్పు తేవడానికి ప్రయత్నించాడు. ఆయుధాలతోనో, ధనంతోనో కాదు... తన సువార్తతో ఆయన ప్రపంచాన్ని జయించాడు. అందుకే ఆయన సాధించిన ఆ విజయం ఇప్పటికీ కొనసాగుతోంది, ఇంకా విస్తరిస్తోంది. ఎందరిలోనో విశ్వాసాన్ని చిగురింపజేస్తోంది. దైవంపై నెలకొన్న ఆ నమ్మకాన్ని మరింత పదిలం చేసుకొని, ఏసును మరింత నిష్టగా అనుసరించే అవకాశాన్ని.. క్రిస్మస్‌ విశ్వాసులకు అందిస్తోంది.

Updated Date - 2021-12-24T05:30:00+05:30 IST