కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళ.. కొవిడ్-19ను ఎదుర్కోవడంలో కీలక పాత్ర

ABN , First Publish Date - 2021-03-09T15:37:19+05:30 IST

కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళ అనితా ఆనంద్ దూసుకుపోతున్నారు. దేశంలో కొవిడ్-19ను నియంత్రించడంలో

కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళ.. కొవిడ్-19ను ఎదుర్కోవడంలో కీలక పాత్ర

ఆంటారియో: కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళ అనితా ఆనంద్ దూసుకుపోతున్నారు. దేశంలో కొవిడ్-19ను నియంత్రించడంలో ప్రభుత్వం తరపున ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఆమె విశ్రమించలేదు. అన్నింటికి తానే ముందుండి నడిపించారు. ఎప్పటికప్పడు కేసులు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అనితా ఆనందర్ ప్రస్తుతం కెనడా పబ్లిక్ సర్వీసెస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ రిసీవర్ జెనరల్ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కరోనా కేసులు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, లక్షలాది మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించామని, పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నట్టు ఆమె చెప్పారు. ప్రస్తుతం కెనడా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కిట్లకు, వ్యాక్సిన్‌‌లకు తీవ్రమైన పోటీ నెలకొన్నా.. లక్షలాది పీపీఈ కిట్లు, ర్యాపిడ్ కిట్లు సంపాదించామని, దాదాపు 40 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను దిగుమతి చేసుకున్నామన్నారు.  


అనితా ఆనంద్ తొలుత టోరంటోలోని ఓ యూనివర్శిటీలో లా ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2019 అక్టోబర్‌లో కెనడా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. కెనడాలోని హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికైన, ప్రధాని జస్టిన్ టుడ్రో కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న మొదటి హిందూ మహిళ కూడా ఈమెనే కావడం విశేషం. అనితా ఆనంద్ తల్లిదండ్రులిద్దరూ భారత్‌కు చెందినవారే. తల్లి పంజాబ్‌కు చెందిన డాక్టర్ సరోజ్ దౌలత్ రామ్, తండ్రి తమిళనాడుకు చెందిన డాక్టర్ సుందర్ వివేక్ ఆనంద్. అనితా ఆనంద్ తల్లిదండ్రులకు ఐర్లాండ్‌లో పరిచయం కాగా వారిద్దరూ ఇంగ్లాండ్‌లో వివాహం చేసుకున్నారు. కెనడాకు రాకముందు ఆమె తల్లిదండ్రులు ఇండియా, నైజీరియాలో నివసించారు. 1965 నుంచి కెనడాలో స్థిరపడ్డారు. ‘‘మా బంధువులు కొంతమంది ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులో ఉన్నారు. మా తాత మహాత్మగాంధీ నడిపిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు’’ అని అనితా ఆనంద్ ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. 

Updated Date - 2021-03-09T15:37:19+05:30 IST