ఇక సామాన్యప్రజలకు రక్షణేది: అనిత

ABN , First Publish Date - 2021-09-09T17:35:49+05:30 IST

ఏపీలో పోలీసులు టీడీపీ కార్యక్రమాలు అడ్డుకోడానికే సరిపోతున్నారని, ఇక సామాన్యప్రజలను ఎవరు కాపాడతారు?..

ఇక సామాన్యప్రజలకు రక్షణేది: అనిత

అమరావతి: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను హౌస్ అరెస్టు చేయడానికి, నారా లోకేష్ కార్యక్రమాలు అడ్డుకోడానికే పోలీసులు సరిపోతున్నారని, ఇక సామాన్యప్రజలను ఎవరు కాపాడతారని ఏపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద బుధవారం అర్ధరాత్రి బైక్‎పై వెళ్తున్న దంపతులపై దాడి చేసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై స్పందించిన ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఉన్మాది చేతిలో బలైన బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న నారా లోకేష్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడం అన్యాయమన్నారు. సుమారు వెయ్యిమంది పోలీసులను మోహరించారని విమర్శించారు. వేయి మంది పోలీసులతో పహరా కాయాల్సిన అవసరమేమొచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేదన్నది అందిరికీ అర్థమయిందని అనిత అన్నారు. ఆడపిల్లల రక్షణలో సీఎం జగన్ అలసత్వం వహిస్తే టీడీపీ ఊరుకోదని హెచ్చరించారు. పరామర్శకు వెళ్తున్న లోకేష్‌ని అడ్డుకోవడానికి వచ్చిన.. వేలాది పోలీసులు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఏమయ్యారని ఆమె ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలను గృహనిర్భందం చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. తాడేపల్లికి కూతవేటు దూరంలో గ్యాంగ్ రేప్ జరిగితే ముఖ్యమంత్రి నోరు మెదపలేదని, తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రారని  అనిత విమర్శించారు.

Updated Date - 2021-09-09T17:35:49+05:30 IST