పేర్నినాని, పోసానిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలి: అనిత

ABN , First Publish Date - 2021-09-30T20:57:29+05:30 IST

రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు మహిళల పేర్లు వాడుకోవడం సిగ్గుచేటని వంగలపూడి అనిత అన్నారు.

పేర్నినాని, పోసానిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలి: అనిత

విశాఖ: డాక్టర్ సుధాకర్ మృతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కారణమని, ఆయనను ప్రధమ ముద్దాయిగా చేర్చి చార్జ్ షీట్ ఓపెన్ చేయాలని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ వేధింపులు తట్టుకోలేకే డాక్టర్ సుధాకర్ మానసిక వేదనకు గురయ్యారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు మహిళల పేర్లు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. మంత్రి పేర్నినాని, పోసాని కృష్ణ మురళి మాటలు జుగుస్పాకరంగా ఉన్నాయని మండిపడ్డారు. వారిద్దరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


వైసీపీ నేతల భాష చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అనిత అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతున్నవారు రేపు మాపైనా మాట్లాడతారని, మహిళలను వైసీపీ నేతలు తిడుతుంటే ముఖ్యమంత్రికి సంగీత విభావరి వింటున్నట్టుందా? అని ప్రశ్నించారు. గ్రామ సింహాలకు అచ్చుపోసి బయటకు వదిలారా?.. దిశా చట్టం అంటూ గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. అధికార పార్టీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోకపోతే బడితపూజ తప్పదని వంగలపూడి అనిత హెచ్చరించారు.

Updated Date - 2021-09-30T20:57:29+05:30 IST