అమ్మవారు కాదు... ఆంజనేయుడే!

ABN , First Publish Date - 2021-06-18T09:28:18+05:30 IST

గదాధారి అయిన వీరాంజనేయుడు, ఆపదల నుంచి కాచే అభయాంజనేయుడు, ముకుళిత హస్తాలతో భక్తాంజనేయుడు... ఇలా హనుమంతుడు వివిధ రూపాలలో కనిపిస్తాడు.

అమ్మవారు కాదు... ఆంజనేయుడే!

గదాధారి అయిన వీరాంజనేయుడు, ఆపదల నుంచి కాచే అభయాంజనేయుడు, ముకుళిత హస్తాలతో భక్తాంజనేయుడు... ఇలా హనుమంతుడు వివిధ రూపాలలో కనిపిస్తాడు. కానీ వీటన్నిటికీ భిన్నమైన ఒక గుడి ఉంది. మారుతి ఆ ఆలయంలో స్త్రీ రూపంలో దర్శనమిస్తాడు.


హనుమంతుణ్ణి ఘోటక బ్రహ్మచారిగా పురాణాలు వర్ణించాయి. శ్రీరాముడి కోవెళ్ళలోనైనా, ఆంజనేయ మందిరాల్లోనైనా ఆయనకు బ్రహ్మచారిగానే పూజలు జరుగుతాయి. కొన్నిచోట్ల సువర్చలా సమేతుడైన ఆంజనేయుడి ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రతన్‌పూర్‌ జిల్లా గిర్జాబంధ్‌లోని గుడిలో... మహిళా మూర్తిగా హనుమంతుడు దర్శనమిస్తాడు. వందల ఏళ్ళ నుంచీ ఇదే రూపంలో పూజలు అందుకుంటున్నాడు. దీనికి కారణాలు ఆ ఆలయ చరిత్రలో కనిపిస్తాయి.


రతన్‌పూర్‌ ప్రాంతాన్ని పృధ్వీ దేవ్‌జూ అనే రాజు పాలించేవాడు. అతనికి కుష్ఠు వ్యాధి వచ్చింది. ఎందరో వైద్యులు చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు. చివరకు తన ఇష్టదైవం ఆంజనేయుణ్ణి ఆ రాజు ప్రార్థించాడు. ఒక రోజు రాత్రి రాజు కలలో హనుమంతుడు కనిపించి, తనకు ఆలయం కట్టిస్తే వ్యాధి నయం అవుతుందని చెప్పాడు. ఆ ప్రకారం ఆలయాన్ని నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠకు రాజు ఏర్పాట్లు చేస్తూండగా... మరోసారి మారుతి అతని కలలోకి వచ్చాడు. అక్కడికి దగ్గరలో ఉన్న మహామాయా కుండంలో ఒక విగ్రహం ఉందనీ, దాన్ని తీసి ప్రతిష్ఠించాలనీ ఆదేశించాడు.. రాజు తన పరివారంతో ఆ కుండం దగ్గరకు వెళ్ళి, వెతికించగా... విగ్రహం దొరికింది. కానీ అది స్త్రీ రూపంలో ఉంది. మొదట పృధ్వీ దేవ్‌జూ సంకోచించినప్పటికీ, స్వామి ఆదేశం ప్రకారం ఆ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించి, పూజలు చేయించాడు. క్రమంగా అతని కుష్టు వ్యాధి తగ్గింది.


ఆనాటి నుంచి స్త్రీ మూర్తిగా అలంకరించి... ఈ హనుమంతుడికి ఆరాధనలు జరుపుతున్నారు. కాగా, తదనంతర కాలంలో ఆలయం బయట ఏర్పాటు చేసిన మరో విగ్రహంలో... సీతారాములను భుజాలపై మోస్తున్న ఆంజనేయుడు కనిపిస్తాడు. దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయానికి విశేష సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఆలయం సమీపంలోని కుండంలో స్నానం చేసి, స్వామి వారిని దర్శించి, పూజిస్తే... దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయనీ, అనారోగ్యాలతో సతమతమవుతున్నవారికి స్వస్థత చేకూరుతుందనీ భక్తుల విశ్వాసం.

Updated Date - 2021-06-18T09:28:18+05:30 IST