అంజయ్యా... 22న మీ ఊరికొస్తున్నా

ABN , First Publish Date - 2021-06-19T09:17:50+05:30 IST

‘‘ఏం అంజయ్య.. బాగున్నావా.. 22న వస్తున్నా మీ ఊరికి’’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా తన దత్తత గ్రామం వాసాలమర్రి సర్పంచ్‌ పోగుల ఆంజనేయులుకు శుక్రవారం ఫోన్‌ చేసి చెప్పారు.

అంజయ్యా... 22న మీ ఊరికొస్తున్నా

  • వాసాలమర్రి సర్పంచ్‌కు కేసీఆర్‌ ఫోన్‌
  • మాట ఇచ్చిన ప్రాజెక్ట్‌ టేకప్‌ చేద్దాం..
  • ఊరంతా కలిసి భోజనం చేద్దాం..


యాదాద్రి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ‘‘ఏం అంజయ్య.. బాగున్నావా.. 22న వస్తున్నా మీ ఊరికి’’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా తన దత్తత గ్రామం వాసాలమర్రి సర్పంచ్‌ పోగుల ఆంజనేయులుకు శుక్రవారం ఫోన్‌ చేసి చెప్పారు. ఆయనతో ముఖ్యమంత్రి ఏం మాట్లాడారంటే..

కేసీఆర్‌: అంజయ్య.. బాగున్నవా...

ఆంజనేయులు: బాగున్న సర్‌.. బాగున్న సర్‌

కేసీఆర్‌: అంజయ్యా... 22న వస్తున్న మీ ఊరికి. మధ్యలో నాకు కరోనా వచ్చె.. రాలేకపోయినం. అప్పుడు మాటిచ్చి ఉన్నం కాబట్టి 22న వచ్చి.. ప్రాజెక్ట్‌ను టేకప్‌ చేద్దాం.

ఆంజనేయులు: సరే సార్‌

కేసీఆర్‌: రెండు ప్రదేశాలు చూడాలి నువ్వు. ఒకటి ఊరందరికీ భోజనం నేనే పెడతా ఆరోజు. ఎమ్మెల్యేకు కూడా చెప్పిన. టీం హైదరాబాద్‌ నుంచి వస్తది. మొత్తం మీ ఊరి జనాభా ఎంతయా..

ఆంజనేయులు: 2,600 సార్‌..

కేసీఆర్‌:ఒక 3,000 మందికి వండితే సరిపోతది కదా..

ఆంజనేయులు: మస్త్‌ సార్‌.. మూడు నాలుగు వందల మంది బయటి నుంచి వచ్చినా 3000 మందికి వండితే సరిపోతది సార్‌.

కేసీఆర్‌:నా ఎమ్మటే వస్తరయా.. రెండు, మూడు వందల దాకా.. కాకపోతే, రెండు జాగాలు చూడాలి నువ్వు. మీ కలెక్టర్‌ గూడా వస్తుంది మీ ఊరికి.

ఆంజనేయులు: ఇప్పుడు వస్తరా సార్‌.

కేసీఆర్‌: ఆ వస్తది. నీ పేరు కూడా చెప్పిన. మధ్యాహ్నం వరకు వస్తదేమో. మొత్తం రెండు జాగాలు చూడాలి. కులం, మతం, జాతి లేకుండా ఊరు మొత్తం అందరం కలిపి ఒక్కకాన్నే తింటం. నేను పదకొండున్నర, పన్నెండు మధ్యన చేరుకుంట. అందరితో కలిసి తింటా. మీతోపాటు మందిల్నే కూసొని తింటం. ఆ తర్వాత మీటింగు. రెయిన్‌ ప్రూఫ్‌ టెంట్‌ ఏర్పాటు చేయాలె. వర్షం ఇబ్బంది లేకుండా.

ఆంజనేయులు: సరే సార్‌

కేసీఆర్‌:కలెక్టర్‌కు చెప్పిన. ఖాళీ జాగాలు నీటుగా ఉండెటివి రెండూ వేర్వేరుగా ఉండాలి.

ఆంజనేయులు: సార్‌.. సార్‌.. చిన్న విషయం సార్‌. కొండాపూర్‌ రోడ్డుల పడాల శ్రీనివా్‌సకు 30 ఎకరాలు ఉంటది. హాస్టల్‌ దగ్గర. అక్కడే పెడదాం సార్‌.

కేసీఆర్‌: అదే జాగల పెట్టు. నా బస్సు వస్తది. దాన్లోనే నా బాత్రూం, గీత్రూం అన్ని ఉంటయి. నేను ఎవరింటికి పోవాల్సిన అవసరం ఉండదు.

ఆంజనేయులు: ఒకసారి మా ఇంటికి రావాలి సార్‌.

కేసీఆర్‌: మీ ఇల్లు ఎక్కడుంటది. 

ఆంజనేయులు: లోపలికి ఉంటది సార్‌. చిన్నది గూనె పెంకునిల్లు. మీకు చెప్పినగా సార్‌ ఇల్లు లేదని.

కేసీఆర్‌: పర్లేదు. మీ ఇంటికే వస్త. ఏముంది.

ఆంజనేయులు: మాకు బ్లెస్సింగ్‌ ఇచ్చిపోండి, మా కుటుంబానికి బ్లెస్సింగ్స్‌ ఇచ్చిపోవాలి సార్‌

కేసీఆర్‌: నో ప్రాబ్లం. ఐదు నిమిషాల కోసం పోదాం. దీన్ల చిల్లర రాజకీయాలు, పార్టీలు ఉండవు.

ఆంజనేయులు: లేదు సార్‌. నాకు అట్లాంటిది లేదు సార్‌.

కేసీఆర్‌: నీకు గాదు. వేరే ఎవడన్న వేరే పార్టీ ఓడు ఉంటె గూడా కలుపుకొని పోవాలి ఇప్పుడు. ఊర్లో ప్రతి ఇంటిని బాగు చేయాలని వస్తున్నం కాబట్టి వీడు వాడు అని ఏం ఉండదు. ప్రాజెక్టు బాగా ఇంప్లిమెంట్‌ చేస్తే మళ్లి టర్మ్‌ నువ్వే గెలుస్తవు. పేరు బాగొస్తది.

ఆంజనేయులు: మీ దయ సార్‌. మీ బ్లెస్సింగ్‌ సార్‌

కేసీఆర్‌:అన్నం తిని మంచిగ, హ్యాప్పీగా మీటింగ్‌కు రావాలి. మధ్యలో వచ్చేలోపు మీ ఇంటికి పోయొద్దాం. ఐదారు నిమిషాలు మీ ఇంటికాడ కూసుందాం. మళ్ల మీటింగుకు పోదాం.

ఆంజనేయులు: ఓకే సార్‌.. థాంక్యూ సార్‌.

కేసీఆర్‌: అట్ల ప్లాన్‌ చేసుకో ఇగ.



Updated Date - 2021-06-19T09:17:50+05:30 IST