Abn logo
Mar 30 2020 @ 02:02AM

అన్న క్యాంటీన్లు ఉండుంటే..

  • సామాన్యులు, శ్రమజీవులకు ఆకలి బాధలు తప్పేవి
  • వారి కడుపు నింపడం ప్రభుత్వానికీ సులభమయ్యేది
  • ఈ అనుభవంతోనైనా వాటిని పునరుద్ధరిస్తే మేలు
  • పలువురి నోట ఇదే మాట


(అమరావతి - ఆంధ్రజ్యోతి) లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశమంతటా జనజీవనం స్థంభించింది. హోటళ్లు, సినిహా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ అన్నీ మూతపడ్డాయి. అత్యవసర సేవల విభాగాలు తప్ప.. అవకాశం ఉన్న చోటల్లా ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. భవన నిర్మాణ పనులు, వ్యవసాయ పనులు ఇలా ఉపాధినిచ్చే పనులన్నీ ఆగిపోయాయి. కార్మికులు, కూలీలకు ఉపాధి కరువైంది. వలస కార్మికులు, నిరాశ్రయుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రెక్కాడితేగానీ డొక్కాడని బడుగుజీవులు పనుల్లేక.. చేతిలో డబ్బుల్లేక.. కడుపు నిండే మార్గం కానరాక.. ఆకలి మంటలతో అల్లాడిపోతున్నారు. అక్కడక్కడా పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, సహృదయులు అలాంటివారికి ఆహారం అందిస్తున్నప్పటికీ.. ఇంకా చాలామంది ఆకలితో అలమిటిస్తూనే ఉన్నారు. పట్టెడన్నం పెట్టే వారికోసం దీనంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇలాంటి దుర్భర సమయంలో ‘అన్న క్యాంటీన్‌’లు ఉండి ఉంటే ఈ ‘ఆకలి’ సమస్యలు తలెత్తేవి కాదు కదా.. అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.


మూసివేశారు.. మార్చివేశారు..

పేద, బడుగు బలహీన వర్గాలకు రూ.5కే ఆకలి తీర్చే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో సుమారు 210 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. వీటిద్వారా ఉదయం నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను అందజేసింది. అంటే మూడు పూటలా కేవలం రూ.15కే కడుపు నింపుకునే భాగ్యాన్ని కల్పించింది. దీంతో అన్న క్యాంటీన్లు అనతికాలంలోనే విశేష ఆదరణను చూరగొన్నాయి. లాభాపేక్షతో కాకుండా సంపూర్ణ సేవాదృక్పథంతో పనిచేసే అక్షయ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందజేశారు. పేదలకు పట్టెడన్నం పెడుతూ సజావుగా సాగుతున్న అన్న క్యాంటీన్లను కొత్తగా అధికారంలోకొచ్చిన జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం మూసివేయించింది.  దీంతో వాటిపై ఆధారపడిన లక్షలాది మంది అభాగ్యులకు తీరని నష్టమని అన్ని వర్గాల నుంచి పెద్దఎత్తున ఆక్షేపణలు వచ్చాయి. అయితే అన్న క్యాంటీన్లను తామేమీ శాశ్వతంగా మూసివేయడం లేదని.. ‘అన్నార్తులకు మరింత మెరుగైన సేవలందించేలా’ వాటిని పునర్వ్యవస్థీకరించి, కొద్ది రోజుల్లోనే పునఃప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ సందర్భంలో ప్రకటించారు. పురపాలక శాఖ డైరెక్టర్‌ అండ్‌ కమిషనర్‌ జేఎస్సార్కేఆర్‌ విజయ్‌కుమార్‌ కూడా వాటికి సంబంధించిన ‘కాన్సెప్ట్‌’ తయారీ బాధ్యతలను కొన్ని ప్రైవేట్‌ కన్సల్టెన్సీలకు అప్పగించామని, అవి సిద్ధం కాగానే తదనుగుణంగా మార్పులు చేసి వాటిని కొద్ది వారాల్లోనే తెరుస్తామని చెప్పారు. కానీ.. అవేమీ జరగలేదు. అన్న క్యాంటీన్లు మూతబడి 8 నెలలు పూర్తయ్యాయి. ఈలోగా అన్నక్యాంటీన్లకు తొలుత వేసిన రంగులు తొలిగించి.. లోపల కూడా మార్పులు చేయించిన ప్రభుత్వం చాలావాటిని వార్డు సచివాలయాలుగా మార్చివేసింది! మరికొన్నింటిని అలాగే నిరర్ధకంగా వదిలేసింది.


ఉపాధి లేదు.. తినడానికి తిండి లేదు..

లాక్‌డౌన్‌ కారణంగా ఎన్నో రంగాలు కుదేలై రాష్ట్రవ్యాప్తగా లక్షలాది మంది రోజువారీ కూలీలు, వలస కార్మికులు, బడుగుజీవులు ఉపాధి కోల్పోయారు. చేతిలో చిల్లిగవ్వ లేక, కొద్దోగొప్పో ఉన్నా హోటళ్లు, మెస్‌లు చాలావరకు మూతబడడంతో ఆకలితో నకనకలాడుతున్నారు. స్వస్థలాలకు వెళ్దామంటే  సాధ్యం కావడం లేదు. దీంతో కడుపు నింపుకునే మార్గం కానరాక ఆపన్నుల కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. సేవాసంస్థలు, సహృదయులు, పోలీసులు, ఇతరులు కొన్ని చోట్ల ఆహారాన్ని అందిస్తున్నా, అది కూడా అందని వారు కోకొల్లలు. ఈ సమయంలో గనుక అన్న క్యాంటీన్లు నడుస్తూ ఉంటే పరిస్థితి ఇంత ఘోరంగా ఉండేది కాదు. ఇలాంటి వారందరికీ చాలా ప్రణాళికా బద్ధంగా, మంచి ఆహారాన్ని అందించే వీలుండేది. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం వాటిని మూసివేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం ఇకనైనా ‘అన్న’ క్యాంటీన్లను  తక్షణమే పునరుద్ధరిస్తే బడుగు జీవులకు మేలు చేసినట్టు అవుతుంది.


Advertisement
Advertisement
Advertisement