Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్నదాత ఆక్రందన

గరిడేపల్లిలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులకు నచ్చజెప్పుతున్న ఎస్‌ఐ కొండల్‌రెడ్డి

ధాన్యం అమ్ముకునేందుకు నానా తంటాలు

ఓవైపు అకాలవర్షాలు, మరోవైపు ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు

టోకెన్ల కోసం నేరేడుచర్ల, గరిడేపల్లి, మఠంపల్లిలో రాస్తారోకో

గంటల తరబడి ఆందోళనతో నిలిచిన రాకపోకలు

కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌జాం నేరేడుచర్ల, నవంబరు 5: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఓవైపు అకాలవర్షాలు, మరోవైపు కొనుగోళ్లు ప్రారంభంకాక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే కల్లాల్లో ధాన్యం తడిసిపోగా, పలుచోట్ల మొలకెత్తింది.ఇలాగే మరిన్ని రోజులు ఉంచితే పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంద ని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. మరోవైపు ధాన్యం విక్రయానికి అధికారులు అందిస్తున్న టోకెన్ల కోసం నేరేడుచర్ల, గరిడేపల్లిలలో రైతులు శుక్రవారం గంటల తరబడి మిర్యాలగూడ-కోదాడ రహదారిపై రాస్తారోకో చేశారు. హుజూర్‌నగర్‌ ప్రాంతానికి చెంది న రైతులు తమ ధాన్యాన్ని నల్లగొం డ జిల్లా మిర్యాలగూడలో విక్రయిస్తారు. ఇందుకోసం స్థానిక వ్యవసాయ అధికారులు రైతులకు టోకెన్ల అందజేస్తారు. టోకెన్లు పొందిన వారంతా మిర్యాలగూడ మిల్లులకు వెళ్లి ధాన్యం విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో నేరేడుచర్ల, గరిడేపల్లి మండలంలోని రైతులకు శుక్రవారం 50 టోకెన్లు మాత్రమే పంపిణీ చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు వేలాది ఎకరాల్లో పంట సాగు చేస్తే మండలానికి 50 టోకెన్లు ఇస్తే ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. 


మాకు టోకెన్లు ఎందుకు ఇవ్వడం లేదు 

అర్ధరాత్రి నుంచి ఇక్కడే ఉన్నా తమకు టోకెన్లు ఎందుకు ఇవ్వడం లేదం టూ నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాల రైతులు నేరేడుచర్ల వ్యవసాయ కార్యాలయం ఎదుట మిర్యాలగూడ-కోదాడ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అధికారులు వచ్చేవరకూ ఆందోళన విరమించేదిలేదని బీష్మించడంతో నేరేడుచర్ల ఎస్‌ఐ విజయ్‌ ప్రకాష్‌, ట్రైనీ ఎస్‌ఐ శ్వేతలు తహసీల్దార్‌ సరిత, వ్యవసాయాధికారి వీరభద్రరావులను పిలిపించి రైతులతో మాట్లాడించారు. రాత్రి వరకు టోకెన్లు వస్తాయని, తప్పకుండా అందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు. వచ్చిన టోకెన్లు రైతులకు ఇవ్వకుండా నాయకులే తీసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకెన్లు అన్ని రైతులకే ఇచ్చామని వ్యవసాయాధికారి తెలిపారు. ట్రాక్టర్లలో ధాన్యం తీసుకువచ్చిన రైతుల కే టోకెన్లు ఇవ్వాలని అధికారులను కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి అలాగే చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు రాస్తారోకో విరమించారు. ఒంటి గంట సమయంలో మొదలైన రాస్తారోకో మూడు గంటల వరకు కొనసాగటంతో ట్రాఫిక్‌ నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 


గరిడేపల్లిలో రోడ్డుకు అడ్డంగా దుంగలు, వాహనాలు 

గరిడేపల్లి, గరిడేపల్లి రూరల్‌: గరిడేపల్లి మండల కేంద్రంలో టోకెన్ల కోసం రైతులు 12 గంటల నుంచి నాలుగు గంటల వరకు మిర్యాలగూడ-కోదాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. రోడ్డుకు అడ్డంగా దుంగలు, వాహనాలను అడ్డుపెట్టి కూర్చున్నారు. దీంతో గరిడేపల్లి ఎస్‌ఐ కొండల్‌రెడ్డి రైతుల సమస్యలపై ఏవో ప్రీతమ్‌కుమార్‌ను ఫోన్లో సంప్రదించారు. శనివా రం నుంచి టోకెన్లు రైతులకు అందజేస్తామని ఏవో తెలిపారు. ఇదే విషయా న్ని రైతులకు ఎస్‌ఐ చెప్పినప్పటికీ రైతులు తమ ఆందోళనలు విరమించలేదు. ఏరోజు టోకెన్లు ఆరోజే ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ప్రతి రోజూ 250 టోకెన్లు ఇవ్వాలని కోరారు. పోలీస్‌ సిబ్బంది మినహా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు రాకపోవడం, స్పష్టమైనహామీ ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు మొదలైన ఆందోళన సాయంత్రం మూడున్నర గంటల వరకు కొనసాగింది. ఈ ఆందోళనతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయాయి.ట్రాఫిక్‌ సమస్యలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోసారి ఎస్‌ఐకొండల్‌రెడ్డి కలుగజేసుకొని శనివారం రైతులకు టోకెన్లు అం దజేస్తామని హామీ ఇచ్చి, నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమించారు.


గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షణ

మఠంపల్లి: పంట పండించడానికి నానా కష్టాలు పడ్డాం, తీరా చేతికొచ్చిన పంట అమ్ముకుందామంటే ఆంక్షలు విధించడమేమిటని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వానాకాలం ధాన్యాన్ని మిర్యాలగూడ మిల్లుల్లో అమ్ముకునేందుకు ప్రభుత్వం టోకెన్ల విధానం అమలుచేయడంతో శుక్రవారం మఠంపల్లి వ్యవసాయ కార్యాలయంలో రైతులు పెద్దఎత్తున క్యూకట్టారు. టోకెన్ల కోసం బారులు తీరిన రైతులు అధికారుల తీరుపై నిరసన వ్యక్తంచేశారు. మఠంపల్లికి హుజూర్‌నగర్‌ దగ్గరగా రైస్‌ మిల్ల్లులు ఉంటే, మిర్యాలగూడకు కేటాయించడం సరైందికాదన్నారు. మండలంలోని వర్థాపురం, యాతవాకిళ్ళ, చౌటపల్లి, బక్కమంతులగూడెం, భీల్యానాయక్‌తండా, పెదవీడు, రామచంద్రాపురం, దొనబండతండా, మఠంపల్లి, రఘునాథపాలెం తదితర గ్రామాలు, తండాల రైతులు టోకెన్ల కోసం ఒకేసారి ఎగబడడంతో గందరగోళం నెలకొంది. 


పోలీసుల తీరే కారణమా.. 

నేరేడుచర్ల: టోకెన్ల కోసం చేస్తున్న ఆందోళనకు పోలీసుల తీరే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. మిర్యాలగూడకు వెళ్లిన ట్రాక్టర్‌ మిల్లుల వద్ద అన్‌లోడ్‌ చేసి వెంటనే తిరిగి వస్తోంది. దీపావళి పండగ రోజైన గురువారం నేరేడుచర్ల ప్రాంతం నుంచి సుమారు 400ట్రాక్టర్లు ధాన్యంతో వెళ్లి మిర్యాలగూడ మిల్లులో దింపుకొని వచ్చాయి.అధికారులు, పోలీసులు లేకపోవడంతో సమస్య తలెత్తలేదని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసుల వల్లనే సమస్య వస్తుంది తప్ప, సమస్యేలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. నాలుగు రోజులుగా ధాన్యం విక్రయానికి ఆందోళనలు చేసిన రైతు దీపావళి రోజు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా విక్రయించగలిగా రు.నేరేడుచర్ల,గరిడేపల్లి, పాలకవీడు మండలాలకు చెందిన రైతులు ధాన్యం కోతలు కోసి మధ్యాహ్నం నుంచి ట్రాక్టర్లను తీసుకొని బయలు దేరుతున్నా రు. చిల్లేపల్లి వంతన వద్దకు రాగానే మిర్యాలగూడ పోలీసులు సూర్యాపేట జిల్లా ట్రాక్టర్లు రావడానికి అనుమతి లేదంటూ నిలిపి వేస్తున్నారు. దీంతో ఆందోళన మొదలై నాలుగు రోజుల పాటు గంటల తరబడి వాహనాలను నిలిపివేశారు. దీపావళి పండుగ రోజు మాత్రం అధికారులు, పోలీసులు ఎవరూ లేకపోవడంతో వచ్చిన ట్రాక్టర్‌ వచ్చినట్లే మిల్లుకు చేరింది. అందు లో కొన్ని టోకెన్లు ఉండగా, కొన్నింటికి టోకెన్లు లేవు. అయినా మిల్లుల వద్ద పెద్దగా రద్దీ లేకపోవడంతో వెంటనే ధాన్యం దింపివేసి వచ్చారు. తిరిగి శుక్రవారం మాత్రం టోకెన్లు విధానమంటూ మిర్యాలగూడ పోలీసులు చిల్లేపల్లి టోల్‌గేటు వద్ద తిష్ట వేయడంతో తిరిగి రైతుల పరిస్థితి మొదటికొచ్చింది. పంటచేతికొచ్చిన సమయంలో వరి కోయకపోతే నేలరాలే ప్రమాదం ఉంద ని, అధికారులు ట్రాక్టర్లో ధాన్యం తెచ్చిన రైతులకు మాత్రమే టోకెన్‌ ఇవ్వాలని కోరుతున్నారు. 


రైతులను ఇబ్బంది పెడితే చర్యలు 

మిల్లర్లకు ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ హెచ్చరిక 

హుజూర్‌నగర్‌ : రైతులను మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజేం ద్రప్రసాద్‌ హెచ్చరించారు. పట్టణంలోని సర్కిల్‌ కార్యాలయంలో మిల్లర్లు, మార్కెట్‌ అధికారులతో గురువారం ఎస్పీ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. తరుగు, తేమ పేరుతో రైతులను నష్ట పెట్టవద్దన్నారు. నిబంధనల మేరకు ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని తీసుకోకుండా మిల్లుల చుట్టూ తిప్పితే వాటిని సీజ్‌ చేస్తామన్నారు. సాగర్‌ ఆయకట్టు ప్రాంతంలోని ఎక్కడ రైతు ధాన్యం తెచ్చినా ఆయా ప్రాంతాల్లోని మిల్లర్లు కొనుగోలు చేయాలన్నారు. కొంతమంది మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టి మిల్లులను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెం కారెడ్డి, డీఎస్పీ రఘు, సీఐ రామలింగారెడ్డి, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ కడియం వెంకట్‌రెడ్డి, పచ్చిపాల ఉపేందర్‌  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement