రైతంటే సినిమాలో చూపించినట్లు ఉండడు

ABN , First Publish Date - 2020-09-21T06:31:44+05:30 IST

పదేళ్ల బాలుడు.. కాగితపు పడవలు చేసి, వాటిని పారే వాన నీళ్లలో వదిలి ఆనందించే ప్రాయం! కానీ, ఇప్పుడు వర్షాలతో రైతులు పడుతున్న కష్టాలను చూసి కరిగిపోయి సమాజాన్ని ప్రశ్నించాడు.

రైతంటే సినిమాలో చూపించినట్లు ఉండడు

ఇదిగో అన్నదాత సమస్యలు ఇలా ఉంటాయి

యాదాద్రి జిల్లాలో పదేళ్ల బాలుడి ఆవేదన 

 నీళ్లలో మునిగిన పొలం.. మెడదాకా కూర్చుని వీడియో


యాదాద్రి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల బాలుడు.. కాగితపు పడవలు చేసి, వాటిని పారే వాన నీళ్లలో వదిలి ఆనందించే ప్రాయం! కానీ, ఇప్పుడు వర్షాలతో రైతులు పడుతున్న కష్టాలను చూసి కరిగిపోయి సమాజాన్ని ప్రశ్నించాడు. రైతులను ఎవ్వరూ పట్టించుకోరా? అని నిలదీశాడు. టీవీ ష్లోల్లో.. సినిమాల్లో చూసినట్లుగా రైతు ఉండడని.. ఇదిగో అన్నదాత కష్టాలు ఇలా ఉంటాయి అంటూ ఓ వీడియో ద్వారా కళ్లకు కట్టాడు. తన తాత నాటు వేసిన వరి పొలం వానకు నిండా మునగడంతో ఆ నీళ్లలోనే మెడదాకా కూర్చుని.. దణ్ణం పెడుతూ రైతుల పడుతున్న అవస్థలను కళ్లకుగట్టే ప్రయత్నం చేశాడు. ఆ అబ్బాయి... యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అర్రూర్‌ గ్రామానికి చెందిన రైతు దొంతి అయిలయ్య మనవడు. పేరు వరుణ్‌. ఐదో తరగతి చదువుతున్నాడు.


అయిలయ్య, తనకున్న ఆరు ఎకరాల్లో వరి పంట వేశాడు. ఇప్పటిదాకా రూ.1.5లక్షలు ఖర్చయింది. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బోరు, మోటరు, స్టార్టర్‌ సహా పొట్టదశలో ఉన్న పంటంతా మూడు అడుగల మేర నీట మునిగింది. ఈ పొలం అంతా కూడా కాండ్లబావికుంట ఎగువ భాగంలోని శిఖం పట్టా. కుంట నిండితే అదనపు నీరు బయటకు పొర్లేందుకు అలుగు ఏర్పాటు లేదు. ఆ నీటిని తూము ద్వారానే వదలాల్సి ఉంటుంది. దీంతో కుంట నిండినప్పుడల్లా అయిలయ్య పొలం నీళ్లపాలవుతోంది. పంటంతా నీట మునగడంతో అప్పులు మిగిలాయని అయిలయ్య పడుతున్న ఆవేదన వరుణ్‌ను కలిచివేసింది. తాత ఇబ్బందులను బయట ప్రపంచానికి తెలిపేందుకు బోరు దగ్గర చుట్టూ చేరిన నీళ్లలో కూర్చుని.. మేనమేమ సాయంతో వరుణ్‌, మూడు రోజుల క్రితం ఓ వీడియో రూపొందించాడు. ‘‘రైతు పండించిన అన్నమే తింటూ రైతుల కష్టాలు ఎందుకు పట్టించుకోరు? కంపెనీలు చేసే వేల కోట్ల అప్పులు తీరుస్తున్న ప్రభుత్వం, రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోదు.


దయచేసి మా రైతుల కష్టాలు తీర్చండి’’ అని కోరాడు. వరదనీరు బయటకు వెళ్లడానికి తూము అనుకూలంగా లేదని, అందుకే పంట పొలం నీట మునిగిందని ఆవేదన వ్యక్తంచేశాడు. తమకు నష్టపరిహారం వద్దని, తూము సమస్యను పరిష్కరించాలని .జిల్లా కలెక్టర్‌ను బాలుడు వేడుకున్నాడు. ఇప్పుడీ వీడియో సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ స్పందించారు. బాలుడు చెప్పిన రైతు సమస్యపై విచారణ జరపాలని ఆదేశించారు. ఆ మేరకు తూములోంచి నీళ్లు త్వరగా వెళ్లిపోయే ఏర్పాటు చేయడంతో అయిలయ్య ఇబ్బందులు తొలగిపోయాయి.

Updated Date - 2020-09-21T06:31:44+05:30 IST