ఉరకలేసిన ఉత్సాహం

ABN , First Publish Date - 2021-10-18T18:21:12+05:30 IST

అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలు స్థానిక రాయపేటలోని పార్టీ ప్రదాన కార్యాలయం ‘ఎంజీఆర్‌ మాళిగై’లో ఆదివారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పార్టీ ఉపసమన్వయ కర్త, మాజీ ముఖ్యమంత్రి

ఉరకలేసిన ఉత్సాహం

అట్టహాసంగా అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలు

ఎంజీఆర్‌ మాళిగైలో సంబరాలు

ఎంజీఆర్‌, జయ సమాధుల వద్ద  నేతల నివాళి

చెన్నై: అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలు స్థానిక రాయపేటలోని పార్టీ ప్రదాన కార్యాలయం ‘ఎంజీఆర్‌ మాళిగై’లో ఆదివారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పార్టీ ఉపసమన్వయ కర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్త ఒ పన్నీర్‌సెల్వం ఉదయం పది గంటలకు పార్టీ కార్యాలయానికి వెళ్ళి వేలాదిమంది కార్యకర్తల నడుమ ఎంజీఆర్‌, జయలలిత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరిం చారు. కార్యకర్తలందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. పార్టీ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. కార్యాలయం ఉన్న రహదారికి ఇరువైపులా అరటి చెట్లను పార్టీ పతాకాలను కట్టారు. పలుచోట్ల స్వాగత తోరణాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకలలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది కార్యకర్తలు ఉదయం ఎనిమిది గంటలకే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద మంగళవాయిద్యాలు, కేరళ చండీ మేలాలతో కళాకారులు సందడి చేశారు. ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం ఉదయం పది గంటలకు పార్టీ కార్యాలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే కార్యకర్తలంతా అన్నాడీఎంకే వర్థిల్లాలి, ఎడప్పాడి వర్థిల్లాలి, పన్నీర్‌సెల్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత ఎంజీఆర్‌, జయలలిత విగ్రహాలను ఆనుకుని నిర్మించిన ప్రత్యేక వేదికపై ఎక్కి ఇరువురూ దివంగత పార్టీ నేతలు ఎంజీఆర్‌, జయలలిత విగ్రహాలకు గజమాలలను వేసి నివాళులర్పించారు. స్వర్ణోత్సవ సంబరాల ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. కార్యకర్తలు, పాత్రికేయులకు, ఫోటోగ్రాఫర్లకు, వీడియో కెమెరామెన్‌లకు మిఠాయిలు పంచిపెట్టారు.


ఈ వేడుకల్లో అన్నాడీఎంకే డిప్యూటీ సమన్వయకర్తలు కేపీ మునుసామి, వైద్యలింగం, మాజీ మంత్రులు పొన్నయ్యన్‌, సెంగోటయ్యన్‌ దిండుగల్‌ శీనివాసన్‌, డి. జయకుమార్‌, పి. వలర్మతి, ఎస్పీ వేలుమణి, తంగమణి, కేపీ అన్బళగన్‌, సెల్లూరు రాజు, కడంబూరు రాజు, దళవాయి సుందరం, పి. బెంజమిన్‌, పార్టీ ప్రముఖులు జేసీడీ ప్రబాకరన్‌, గోకుల ఇందిర, వైగై సెల్వన్‌, తమిళ్‌మగన్‌ హుసేన్‌, కమలకన్నన్‌ ఎంజీఆర్‌ యువజన విభాగం డిప్యూటీ కార్యదర్శి డాక్టర్‌ సునీల్‌ తదితరులు పాల్గొన్నారు. అటుపిమ్మట అక్కడి నుంచి బయల్దేరి మెరీనాబీచ్‌కు చేరుకున్నారు. ఎంజీఆర్‌ సమాధి, జయలలిత సమాధిపై పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T18:21:12+05:30 IST