అన్నమయం.. జలమయం.. తేజోమయం

ABN , First Publish Date - 2020-12-30T08:43:34+05:30 IST

మనసు, ప్రాణం, వాక్కు.. వీటికి ఆధారమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానాన్ని.. ఆరుణ వంశజుడైన ఉద్దాలకుడు తన కుమారుడు

అన్నమయం.. జలమయం.. తేజోమయం

మనసు, ప్రాణం, వాక్కు.. వీటికి ఆధారమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానాన్ని.. ఆరుణ వంశజుడైన ఉద్దాలకుడు తన కుమారుడు శ్వేతకేతునకు తెలిపాడు. ‘‘మనం తిన్న అన్నం జఠరాగ్ని చేత జీర్ణమై మూడు విధాలుగా మారుతుంది. దాంట్లోని స్థూలభాగం మలంగా మారుతుంది. మధ్యమాంశం మాంసమవుతుంది. సూక్ష్మాంశం మనస్సవుతుంది. మనం తాగిన జలంలోని స్థూల భాగం మూత్రంగా మారుతుంది. మధ్యమాంశం రక్తంలోకి చేరుతుంది. సూక్ష్మాంశం ప్రాణమవుతుంది. తేజస్సంబంధమైన నెయ్యి, వెన్న, నూనెల స్థూలాంశం ఎముకలుగా, మధ్యమాంశం మజ్జగా, సూక్ష్మాంశం వాక్కుగా (మాట్లాడే శక్తి) మారుతాయి. కాబట్టి మనస్సు అన్నమయం. ప్రాణం జలమయం. వాక్కు తేజోమయం’’ అని ఉద్దాలకుడు వివరించాడు. పెరుగును చిలికినప్పుడు పెరుగులోనుండి సూక్ష్మాంశం వెన్నగా ఎలా పైకి లేస్తుందో.. అదేవిధంగా అన్నం యొక్క సూక్ష్మాంశం మనస్సుగా, జలం యొక్క సూక్ష్మాంశం ప్రాణంగా, తేజస్సు యొక్క సూక్ష్మాంశం వాక్కుగా అవుతుంది అని వివరించాడు.


పురుషుడు పదహారు కళలు కలవాడని కుమారుడికి చెప్పి.. అతణ్ని 15రోజులపాటు అన్నం తినకుండా కేవలం జలం తాగుతూ ఉండాలని ఆదేశించాడు. ప్రాణం జలమయం కాబట్టి.. జలం తాగుతుంటే ప్రాణం శరీరాన్ని విడువదని చెబుతాడు. శ్వేతకేతు తన తండ్రి చెప్పిన విధంగానే పదిహేను రోజులపాటు కేవలం నీళ్లు తాగి, అనంతరం తండ్రి వద్దకు వెళ్లాడు. అప్పుడు ఉద్దాలకుడు తన కుమారుడిని చూసి.. ‘‘నీవు అభ్యసించిన ఋక్కులు, యజస్సులు, సామములు చెప్పు’’ అని అడిగాడు. దానికి శ్వేతకేతు.. ‘‘తండ్రీ అవి నాకు ఇప్పుడు గుర్తురావట్లేదు’’ అని చెప్పాడు నీరసంగా. అప్పుడు ఉద్దాలకుడు.. ‘‘బాగా ప్రజ్వలించి ఆరిపోయిన అగ్నిలో మిణుగురుపురుగంత అగ్ని కణం మిగిలితే అది ఎక్కువ వస్తువులను కాల్చలేదు.


అదేవిధంగా.. ఈ పదిహేను రోజులుగా నీవు అన్నం తినకపోవడం వల్ల నీ పదహారు కళల్లో ఒక్క కళ మాత్రమే మిగిలింది. కాబట్టి నీకు వేదం చెప్పడానికి శక్తి సరిపోవట్లేదు. ఇక నీవు అన్నం తిను’’ అని ఆదేశించాడు. అన్నం తిన్న తర్వాత శ్వేతకేతు.. తండ్రి అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానమిచ్చాడు. వేదం చదివాడు. అప్పుడు ఉద్దాలకుడు.. ‘‘మిణుగురు పురుగంత అగ్ని కణాన్ని గడ్డిపరకలతో ప్రజ్వలింపజేస్తే అది తన కంటే ఎక్కువైన దాన్ని కాల్చగలదు. అలాగే.. నీ పదహారు కళల్లో మిగిలిన ఒక్క కళనూ అన్నంతో పోషించడంతో మనోబలం పొంది వాక్కు బలపడింది. అందువలన నీకు వేదాలు మళ్లీ స్మరణకు వచ్చాయి. మనస్సు అన్నమయం, ప్రాణం జలమయం, వాక్కు తేజోమయం అనడానికి ఇదే ఆధారం’’ అని వివరించాడు.



జక్కని వేంకట రాజం

Updated Date - 2020-12-30T08:43:34+05:30 IST