Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్నమయ్య పదాల్లో సంక్రాంతి

అన్నమయ్య జానపదులకు ప్రాణప్రదుడు. ఆయన జానపద సంకీర్తనలు బహుళ ప్రసిద్ధాలు. తీయని దేశి పదాల్లో అన్నమయ్య మధురంగా పంచిన సాహితీ విందులోని మధురమైన రుచిని ఆస్వాదించిన వారిదే నిజమైన అదృష్టం. జానపదుల విభిన్నమైన గేయ పద్ధతులను అద్వితీయశైలిలో అన్నమయ్య విరచించి... సామాన్య ప్రజల భాషకు సాహితీ గౌరవాన్ని కలిగించాడు. ఈ సంకీర్తనల్లోని పదాల మేళవింపు మామూలు గీతాల స్థాయి కన్నా కొంచెం ఉన్నతంగా ఉన్నా, వాడిన భాష, కవితా విశేషాలు, చమత్కారాలు జానపద సాహిత్యానికి అత్యంత చేరువలో ఉంటాయి.


కొలని దోపరికి గొబ్బిళ్ళో...

అన్నమయ్యకు గ్రామాలంటే ఎంతో ప్రీతి. గ్రామీణుల ఆచారాలను, ఆలోచనలను, సంప్రదాయ వ్యవహారాలను తన సంకీర్తనల్లో అందంగా పొందుపరచాడు. తెలుగువారికి అత్యంత ఇష్టమైన పండుగ సంక్రాంతి. సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేది తెలుగు వాతావరణాన్ని ప్రతిబింబించే పల్లెసీమలే. ముఖ్యంగా చెప్పుకోదగినవి ప్రతి ముంగిటా తీర్చిదిద్దిన రంగవల్లులు, వాటి మధ్య అందంగా పేర్చిన గొబ్బిళ్ళు. ముగ్గుల్లో మురిపించే గొబ్బిళ్ళను గౌరమ్మ అవతారంగా భావించి పూజిస్తారు. అన్నమయ్య సుందరమైన సంకీర్తనను గొబ్బిళ్ళపై వెలయించాడు. శ్రీకృష్ణుని అపురూప చరితం ఈ గొబ్బిళ్ళ సంకీర్తనకు ఆధారం. ఈ సంకీర్తనకే గాక, అన్నమయ్య జానపద సంకీర్తనలెన్నింటికో కేంద్రబిందువు నల్లనయ్యే కావడం గమనార్హం.


ఒక్కసారి సంక్రాంతికే ప్రత్యేకమైన ఈ గొబ్బిళ్ళ పాట...

కొలనిదోపరికి గొబ్బిళ్ళో యదు

కులస్వామికిని గొబ్బిళ్ళో

కొండ గొడుగుగా గోవుల గాచిన

కొండుక శిశువుకు గొబ్బిళ్ళో

దుండగంపు దైత్యులకెల్లను తల-

గుండు గండనికి గొబ్బిళ్ళో...

ఇలా... గొబ్బి పదాన్ని ఊతంగా చేసుకుని, కృష్ణ చరితాన్ని సంక్షిప్తంగా అక్షరబద్ధం చేశాడు అన్నమయ్య. ‘కొలనిదోపరి’ అంటూ శ్రీకృష్ణుని గోపికా వస్త్రాపహరణ ఘట్టంతో సంకీర్తనను ఆరంభించాడు. గోవిందుడు అలవోకగా గోవర్ధన గిరిని ఎత్తడం, దుష్ట రాక్షసులను వధించడం, శిశుపాలుని వధించడం, కంసుని సంహరించడం లాంటి ఘట్టాలను సైతం అలతి పదాలతో అన్నమయ్య ఈ గొబ్బిళ్ళ సంకీర్తనలో సుందరంగా లిఖించాడు.


సువ్వి సువ్వి సువ్వాలమ్మ... 

సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చే మరో విషయం, నోరూరించే పిండివంటలు. అరిసెలు, చక్కిలాలు, జంతికలు లాంటివి ప్రతి ఇంటా ఉండవలసిందే. వీటికి కావలసిన పిండిని సమకూర్చేవి యంత్రాలు కావు. కేవలం పెద్ద పెద్ద రోళ్ళలో రకరకాల పదార్థాలను వేసి, రోకళ్ళతో దంచుకుంటారు. ఆ విధంగా పిండిని దంచడానికి ఎంతో శ్రమపడవలసి ఉంటుంది. ఆ శ్రమను మరచిపోవడానికి పాడుకునే పాటలే దంపుళ్ళ పాటలు. ‘హా... సువ్వి... ఓహో... సువ్వి’ అంటూ పాడుకొనే సువ్వి పాటలు ఈ దంపుళ్ళ పాటల కోవలోనికే వస్తాయి.


అన్నమయ్య రాసిన కొన్ని సువ్వి పాటల పల్లవులను గమనిస్తే... ‘సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెదరోలాల’ అంటూ ఒక చక్కటి గీతికను పల్లవించాడు. మరో సువ్వి పాటలో ‘సువ్వి సువ్వి సువ్వాలమ్మ... నవ్వుచు దేవకి నందను గనియె’ అంటాడు పరవశంతో సంకీర్తనాచార్యుడు.


ఏలేఏలే మరదలా’...

సంక్రాంతి పెద్ద పండగ కాబట్టి అల్లుళ్ళు, పట్నాల్లో ఉండే వారు అందరూ తప్పకుండా తమ తమ ఊళ్లకు వెళ్ళడం ఆనవాయితీ. అందుకే, సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి బావా మరదళ్ళ సరదాలు, సరసాలు. అన్నమయ్య బావా మరదళ్ల పాటలనూ మకరందభరితంగా రాశాడు. ‘ఏలేఏలే మరదలా...’ .అంటూ ఒక సంకీర్తనలో మధురస భావాలను నింపాడు. మరో సంకీర్తనలో ‘బాపు బాపు జాణకదే బావగారు... ఓపనంటే కోపగించీ గోల బావగారు’ అంటూ పసందైన పదాల విందు అందించాడు.

ఇదే విధంగా వేడుకతో ఆడుకునే కోలాటం పాటలు, తుమ్మెదల పాటలు అన్నమయ్య సుధామయ పద భాండాగారంలో మనకు దర్శనమిస్తాయి. అన్నమయ్య పల్లెవాసుల గుండెలను తన అరుదైన భావాలతో కొల్లగొట్టాడు. సంక్రాంతి లాంటి ముఖ్యమైన పండుగలలో కానవచ్చే వేడుకలకు పెద్దపీట వేసి, తెలుగింటి సంప్రదాయాలను నభోవీధిని తాకేలా విరాజమానంగా నిలబెట్టాడు. అన్నమయ్య పదాల కాంతిలో నిండారా వెలిగింది సంక్రాంతి. సాహితీవీధుల్లో అది ఎన్నటికీ తరగని నవకాంతి. 


వెంకట్‌ గరికపాటి

Advertisement
Advertisement