అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం జరిగేనా..!?

ABN , First Publish Date - 2022-01-23T05:23:27+05:30 IST

చెయ్యేరు నదిపై రాజంపేటకు 25 కి.మీల దూరంలో రెండు కొండల మధ్య అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించారు. ఈ జలాశయం సామర్థ్యం 2.24 టీఎంసీలు. 10,236.33 ఎకరాలకు సాగునీరు, రాజంపేట మున్సిపాలిటీ సహా మరో 18 గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది.

అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం జరిగేనా..!?
వరదకు కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు

నవంబరు 19న కొట్టుకుపోయిన జలాశయం

పాత డిజైన్‌ మేరకు రూ.80 కోట్లతో మట్టి ఆనకట్ట

అదే డిజైన్‌తో రూ.380-400 కోట్లతో కాంక్రీట్‌ డ్యాం నిర్మాణం

రూ.1,549 కోట్లతో 8 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టు

మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఇంజనీర్లు

రెండో ప్రతిపాదనకే ఇంజనీర్ల మొగ్గు

ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్నేళ్లో..?


ఇంజనీర్ల ఇరవైయ్యేళ్ల కృషి అన్నమయ్య ప్రాజెక్టు. పది కాలాలు రైతన్నల సేవలో తరించాల్సిన ప్రాజెక్టు గత ఏడాది నవంబరు 19న వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ ప్రాజెక్టు పునర్నిర్మాణానికి ఇంజనీర్లు మూడు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ప్రస్తుత ప్రాజెక్టు స్థలంలోనే పాత డిజైన్‌ మేరకు రూ.80 కోట్ల అంచనాతో మట్టికట్ట (ఎర్త్‌డ్యాం), రూ.380-400 కోట్ల అంచనాతో కాంక్రీట్‌ డ్యామ్‌, పాత ప్రాజెక్టుకు ఒకటిన్నర కి.మీల దిగువన రూ.1,549 కోట్లతో 8 టీఎంసీల సామర్థ్యంతో కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేసేలా మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రేపోమాపో ప్రభుత్వానికి పంపనున్నారు. నీటి లభ్యత, ఆర్థిక వనరుల దృష్ట్యా రెండవ ప్రతిపాదనకాంక్రీట్‌ డ్యాం నిర్మాణమే ఉత్తమమని ఇంజనీరింగ్‌ నిపుణులు అంటున్నారు. ఇంతకూ నిర్మాణం ఎప్పుడు జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. 


(కడప-ఆంధ్రజ్యోతి): చెయ్యేరు నదిపై రాజంపేటకు 25 కి.మీల దూరంలో రెండు కొండల మధ్య అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించారు. ఈ జలాశయం సామర్థ్యం 2.24 టీఎంసీలు. 10,236.33 ఎకరాలకు సాగునీరు, రాజంపేట మున్సిపాలిటీ సహా మరో 18 గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. ప్రాజెక్టు మట్టికట్ట, స్పిల్‌వే పొడవు 426.25 మీటర్లు. ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పట్లో పలు సర్వేలు చేశారు. మొదట్లో పులపత్తూరు, తొగూరుపేట గ్రామాల మధ్య రెండు కొండలను కలుపుతూ జలాశయం నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. ఇక్కడ నిర్మిస్తే గ్రామాలను ఖాళీ చేయించాల్సి వస్తుందని గుర్తించిన ఇంజనీర్లు అక్కడికి ఎగువన సుమారు 12 కి.మీల దూరంలో ప్రాజెక్టు నిర్మాణానికి రిపోర్టు తయారు చేశారు. దీనికి మొదట ‘చెయ్యేరు జలాశయం’గా పేరు పెట్టి రూ.823.60 లక్షలతో నిర్మాణానికి 24 ఏప్రిల్‌ 1976న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆధ్వర్యంలో పునాది రాయి పడింది. ఏమైందో ఏమో కానీ మరో ఐదేళ్ల పాటు ఈ పనుల్లో కదలిక రాలేదు. తిరిగి 1981లో  సీఎం టి.అంజయ్య ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలైంది. 20 ఏళ్ల ఇంజనీర్ల కృషి ఫలితంగా రూపుదిద్దుకొని 2001లో నిర్మాణం పూర్తి చేశారు. దీనికి అన్నమయ్య ప్రాజెక్టుగా పేరు పెట్టారు. దీనిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు అంకితం ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి నాడు చేసిన ఖర్చు కేవలం రూ.60.44 కోట్లే. పది కాలాలు అన్నదాత సేవల్లో తరించాల్సిన ప్రాజెక్టు ఇరవై ఏళ్లకే.. గత నెల 19న వచ్చిన భారీ వరదలకు కొట్టుకుపోయింది. 39 మంది మృతి చెందగా పులపత్తూరు, ఎగువ, దిగువ మందపల్లెలు, తొగూరుపేట, రామచంద్రాపురం, గుండ్లూరు సహా 16 గ్రామాలు వరద ముంపునకు గురైన సంగతి తెలిసిందే. జలవనరుల శాఖ నిపుణుల కమిటీ కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలించి పలు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కమిటీ సూచనల మేరకు ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం జిల్లా ఇరిగేషన్‌ ఇంజనీర్లు ప్రభుత్వానికి మూడు ప్రతిపాదనలు పంపారు.


ఇవీ ప్రతిపాదనలు..

- రాజంపేట మండలం బాదనగడ్డ గ్రామం సమీపంలో చెయ్యేరు నదిపై 426.25 మీటర్ల పొడవుతో మట్టికట్ట, స్పిల్‌వే 5గేట్లతో అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించారు. సామర్థ్యం 2.24 టీఎంసీలు. జలాశయానికి అనుబంధంగా 23.60 కి.మీల పొడవు ప్రధాన కాలువ, 18 డిస్ట్రిబ్యూటరీలు నిర్మించారు. 2001లో నిర్మించిన ప్రాజెక్టు గత ఏడాది నవంబరు 19న వరదకు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఇదేచోట పాత డిజైన్‌ మేరకు మళ్లీ మట్టి ఆనకట్ట (ఎర్త్‌డ్యాం)ను రూ.80 కోట్ల అంచనాతో నిర్మించేలా ప్రతిపాదించారు. 

- ప్రస్తుత పాత ప్రాజెక్టు స్థానంలోనే అదే డిజైన్‌ ప్రకారం మట్టి ఆనకట్ట బదులుగా సిమెంట్‌ కాంక్రీట్‌ డ్యాం నిర్మించేలా రెండవ ప్రతిపాదన. పాత ఐదు గేట్లు సహా కాంక్రీట్‌ డ్యాం మధ్యలో 4.50 లక్షల క్యూసెక్కుల వరద డిశ్చార్జ్‌తో 12 గేట్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. సామర్థ్యం 2.24 టీఎంసీలే. నిర్మాణ వ్యయం రూ.380-400 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 

- కొట్టుకుపోయిన ప్రాజెక్టుకు 1.50 కి.మీల దిగువన 8 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నూతన జలాశయం నిర్మాణానికి ప్రతిపాదించారు. ఇది మూడవది. అంచనా వ్యయం రూ.1,549 కోట్లుగా నివేదించారు. టోపోగ్రాఫికల్‌ సర్వే ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా ఉన్నా.. జియోలజికల్‌ సర్వే చేయాల్సి ఉంది. నీటి సామర్థ్యం పెరుగుతుండడం వల్ల అటవీ శాఖ భూమిని సేకరించేందుకు ఫారెస్ట్‌ అనుమతులు అవసరం ఉంటుందని అంటున్నారు.


రెండవ ప్రతిపాదనపై ఇంజనీర్ల మొగ్గు

మట్టి ఆనకట్ట ఎప్పటికైనా ప్రమాదమే. దీంతో మళ్లీ మట్టి ఆనకట్ట నిర్మాణానికి వరద ముంపు గ్రామాల జనం ఏ మాత్రం ఒప్పుకోరు. మూడవ ప్రతిపాదన ప్రకారం 8 టీఎంసీల సామర్థ్యంతో నూతన జలాశయం నిర్మించాలంటే నీటి లభ్యత లేదని ఇప్పటికే నిపుణుల కమిటీ తేల్చేసింది. పైగా 2.24 టీఎంసీలతో చెయ్యేరుపై ప్రాజెక్టు కట్టడం వల్ల కేవలం 30-40 అడుగుల లోతులో లభించే భూగర్భ జలాలు.. 350-500 అడుగులకు పడిపోయాయని అంటున్నారు. 8 టీఎంసీల సామర్థ్యంతో కొత్త ప్రాజెక్టు కడితే వెయ్యి అడుగులు వేసినా బోర్లల్లో నీళ్లు రావని నదితీర గ్రామాల జనం ఆవేదన. దీంతో ఈ ప్రతిపాదనకు కూడా ఒప్పుకోరు. పైగా అటవీశాఖ అనుమతులు ఇవ్వాలి. రూ.1,549 కోట్లకు పైగా భారాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తి అయ్యేలోగా ఇది రెట్టింపయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో మూడో ప్రతిపాదన కూడా ప్రయోజకరంగా లేదని ఇంజనీర్లే అంటున్నారు. ఈ నేపథ్యంలో రూ.380-400 కోట్ల అంచనాతో ప్రతిపాదించిన కాంక్రీట్‌ డ్యాం నిర్మాణంపైనే ఇంజనీర్లు మొగ్గు చూపుతున్నారు. ముంపు గ్రామాల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉండకపోవడమే కాకుండా ఆర్థికంగా కూడా సర్కారు ఖజానాపై భారం తక్కువే కావడంతో ప్రభుత్వం దీనికే ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని అంటున్నారు. డీపీఆర్‌ తయారీ కోసం రూ.4.20 కోట్ల నిధులు అవసరమని ఇరిగేషన్‌ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు.  


ప్రభుత్వానికి నివేదిక పంపాం

- శ్రీనివాసులు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ, కడప

వరదకు కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం ప్రభుత్వానికి మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఇప్పటికే ప్రభుత్వానికి రెండు ప్రతిపాదనలు పంపితే స్వల్ప మార్పులు చేయాలని సూచిస్తూ వెనక్కి పంపారు. చిన్నచిన్న లోపాలను సరిదిద్ది మూడు ప్రతిపాదనలను సిద్ధం చేశాం. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపుతాం.

Updated Date - 2022-01-23T05:23:27+05:30 IST