అన్నపూర్ణగా ఉమ్మడి జిల్లా

ABN , First Publish Date - 2020-05-18T10:19:09+05:30 IST

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అన్నపూర్ణగా రూపాంతరం చెందుతోంది. యాసంగిలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మంచి దిగుబడి వచ్చింది.

అన్నపూర్ణగా ఉమ్మడి జిల్లా

రికార్డు స్థాయిలో వరి దిగుబడి

 18 లక్షల మెట్రిక్‌ టన్నుల అంచనా 

ఇప్పటికే 9 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి 


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌):ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అన్నపూర్ణగా రూపాంతరం చెందుతోంది. యాసంగిలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మంచి దిగుబడి వచ్చింది. ఈ యాసంగిలో నాలుగు జిల్లాల్లో కలిపి 8.3 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. వానకాలంలో మరో లక్ష ఎకరాల్లో సాగు జరిగే అవకాశమున్నదని అంచనా వేస్తున్నారు. వర్షాలు కురిసినా, కురియక పోయినా ప్రాణహిత నది ప్రవహిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్‌, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు రిజర్వాయర్లు నిండి రెండు పంటల సాగుకు ఢోకా ఉండదని రైతులకు భరోసా కలుగుతున్నది. దీంతో నైరుతీ రుతుపవనాలు రాక ముందే వాన కాలపు పంటలు సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. 


వానకాలం సాగుకు ఏర్పాట్లు

కరీంనగర్‌ జిల్లాలో 2,10,250 ఎకరాల్లో వరి సాగుకు రైతులు సిద్ధమవుతుండగా జగిత్యాల జిల్లాలో 2,38,000 , పెద్దపల్లిలో 1,94,900, రాజన్న సిరిసిల్లలో 1,30,300 ఎకరాల్లో వరిసాగుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రాథమికంగా వ్యవసాయ శాఖ  7,7,3,450 ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని అంచనా వేసినా యాసంగి పంటను మించి సుమారు తొమ్మిది లక్షల ఎకరాల్లోనైనా వరిసాగు జరిగే అవకాశముంది. మద్దతు ధర, సాగునీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు వరిపైనే మక్కువ చూపుతున్నారు. సుమారు 3,10,000 ఎకరాల్లో పతి, 1,25,000 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగయ్యే అవకాశాలున్నాయి. ప్రధానంగా యాసంగిలో వరి దిగుబడి ఆశించిన రీతిలో రావడంతో రైతులు వరి సాగుపై మక్కువ చూపిస్తున్నారు. 


అంచనాలకు మించి..

యాసంగిలో ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల్లో 8,30,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 3,300 కోట్ల రూపాయల విలువ చేసే 18 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని జిల్లా అధికారులు అంచనా వేశారు. విత్తనపు పంట, రైతులు తమ ఆహారం కోసం ఉంచుకునే ధాన్యాన్ని మినహాయిస్తే సుమారు 12 నుంచి 13 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకోసం 4 జిల్లాల్లో 1,221 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 1,635 కోట్ల రూపాయల విలువ చేసే 8,94,016 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వాటిని విక్రయించిన రైతులకు 727 కోట్ల రూపాయలు చెల్లించారు.


కరీంనగర్‌ జిల్లాలో 2,59,970 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ 476 కోట్లు కాగా, 261 కోట్లను చెల్లించారు. పెద్దపల్లిలో 2,17,082 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 398 కోట్లకుగాను 180 కోట్లను రైతులకు చెల్లించారు. జగిత్యాల జిల్లాలో 2,77,531 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొని రైతులకు 506 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే 246 కోట్లు ఖాతాల్లో జమచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,39,439 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 255 కోట్లకుగాను 40 కోట్లు రైతులకు చెల్లించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి తీసుకున్న ధాన్యాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో జాప్యం జరుగుతున్న కారణంగా రైతులకు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. 


సన్నాల సాగు  కోసం ప్రణాళికలు  

ఉమ్మడి జిల్లాలో 35 నుంచి 40 శాతం సన్నరకం వరి ఽసాగును ప్రోత్సహించే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సన్న బియ్యం సరఫరా చేయడంతోపాటు సన్న ధాన్యానికి ఇతర ప్రాంతాల్లో డిమాండ్‌ అధికంగా ఉండడంతో ఈ రకం సాగును ఎక్కువగా చేపట్టే విధంగా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వరి ధాన్యం సేకరణను నిలిపివేసిన పక్షంలో దొడ్డురకం వరిసాగును చేపడితే పండిన పంటను అమ్ముకోవడం ఇబ్బందై రైతులు నష్టపోయే ప్రమాదముంటుంది. అందుకే ఇప్పటి నుంచే సన్న రకాలను ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.


రైతులు మాత్రం సన్న రకాల సాగుపై విముఖంగానే ఉన్నారు. సన్న రకాలు పంట కాలం ఎక్కువ ఉంటుంది. చీడ, పీడలు ఎక్కువ ఆశించి క్రిమిసంహారక మందుల కోసం పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. దొడ్డు రకాలకంటే దిగుబడి తక్కువ వస్తుండడం, సన్న రకాలకు ప్రభుత్వం మద్దతు ధర లేక పోవడంతో రైతులు వెనకంజ వేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తామని హామీ ఇస్తే రైతులు సన్నధాన్యం వైపు మొగ్గు చూపే అవకాశముంది.

Updated Date - 2020-05-18T10:19:09+05:30 IST