పెద్ద మనసు: కడేరు గ్రామంలో ఉచిత వైద్య సేవలు

ABN , First Publish Date - 2021-06-23T18:11:39+05:30 IST

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత డాక్టర్ గుడారు జగదీష్ ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు సమీపంలో

పెద్ద మనసు: కడేరు గ్రామంలో ఉచిత వైద్య సేవలు

ప్రకాశం: తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత డాక్టర్ గుడారు జగదీష్ ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు సమీపంలో కరేడు అనే గ్రామాన్ని దత్తత తీసుకుని ఉచిత ఆర్థోపెడిక్ సేవలను కొనసాగిస్తున్నారు. కరేడుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రధానంగా మత్స్యకార, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు. వారి ఆర్థిక పరిస్థితులను గమనించిన ఆయన.. ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి నెలా నాలుగు సార్లు గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ప్రతి విజిట్‌లో 50 మందికి పైగా రోగులను పరీక్షించి వారికి ఉచితంగా మందులు సైతం అందిస్తున్నారు. ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స అవసరమయ్యే రోగులకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు.

 




డాక్టర్ గుడారు జగదీశ్ సేవాకార్యక్రమానికి లింగారెడ్డి అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహాయ సహకారాలు అందిస్తోంది. ట్రస్ట్ నిర్వాహకులు లింగారెడ్డి మధుసూధన్ రెడ్డి గత ఏడాదిన్నరగా నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరంలో ఇప్పటి వరకు 1120 మందికి పైగా రోగులు చికిత్స పొందారు. వీరిలో ఎక్కువమంది పుట్టుకతో వచ్చే అంగ వైకల్యం, సెరిబ్రల్ పాల్సీ, వివిధ రకాలైన కీళ్ళ ఆస్టియో ఆర్థ్రోసిస్, వెన్నెముక సమస్యలు, ప్రమాదాల వలన ఏర్పడే గాయాలతో బాధపడుతున్నారు. 


ఈ నెల 22, 23 తేదీలలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో 62 మందికి వైద్య సేవలను అందించడమే కాకుండా రూ. 92,000/- విలువైన మందులను సైతం ఉచితంగా అందించారు. కరేడులో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరానికి ప్రకాశం జిల్లా వాసులే కాకుండా నెల్లూరు జిల్లా నుంచి కూడా వచ్చి చికిత్స పొందుతున్నారు. కరేడులో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరంలో పాల్గొనదలచిన వారు లింగారెడ్డి అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ +91 99484 28189 నంబరులో సంప్రదించి వివరాలు నమోదు చేసుకోగలరు.

Updated Date - 2021-06-23T18:11:39+05:30 IST