అన్నార్తులకు అండగా

ABN , First Publish Date - 2021-11-19T07:08:09+05:30 IST

పేదలకు పట్టెడన్నం పెట్టడం సంక్షేమ రాజ్యం బాధ్యత అంటూ, అన్నార్తుల కోసం సామాజిక వంటశాలలు ఏర్పాటు చేసే విషయంలో కేంద్రప్రభుత్వం కనబరుస్తున్న నిరాసక్తతపై దేశ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది...

అన్నార్తులకు అండగా

పేదలకు పట్టెడన్నం పెట్టడం సంక్షేమ రాజ్యం బాధ్యత అంటూ, అన్నార్తుల కోసం సామాజిక వంటశాలలు ఏర్పాటు చేసే విషయంలో కేంద్రప్రభుత్వం కనబరుస్తున్న నిరాసక్తతపై దేశ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.  ప్రజల ఆకలితీరుస్తామంటే ఏ చట్టమూ కాదనదు, రాష్ట్రాలతో చర్చించి ఒక జాతీయ స్థాయి విధానాన్ని మూడువారాల్లో ఖరారు చేసుకురండి అంటూ దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాట్ల విషయంలో సుప్రీంకోర్టు గట్టిపట్టుదలనే చూపుతున్నది. 


అన్నమో రామచంద్రా అంటున్నవారి విషయంలోనూ కేంద్రప్రభుత్వం సీరియస్ గా స్పందించకపోవడం కోర్టుకు కోపం తెప్పించింది. ఒక స్పష్టమైన విధానంతో రండి అని గడువు ఇచ్చిన తరువాత కూడా రాష్ట్రాలు ఏం చేస్తున్నాయన్నదే అఫిడవిట్ రూపంలో దాఖలు చేయడం ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఎన్.వి. రమణకు అగ్రహం కలిగించింది.  పోలీసుల మాదిరిగా రాష్ట్రాలను ప్రశ్నించి, అవి చెప్పిన విషయాలను నేరుగా నివేదించడం కాక, సామూహిక వంటశాలల ఏర్పాటు, నిర్వహణ ఇత్యాది అంశాలను వాటితో చర్చించి, వాటి సలహాలూ సూచనలు తీసుకోవాలన్నది సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం. అఫిడవిట్‌ను ఓ అండర్ సెక్రటరీ దాఖలు చేయడంతో అటార్నీ జనరల్ నేరుగా జస్టిస్  రమణ ఆగ్రహాన్ని చవిచూడవలసి వచ్చింది. సామాజిక వంటశాలలపై కేంద్రం ఆహారభద్రతాచట్టం పరిధిలో ఒక నిర్మాణాత్మకమైన పథకంతో మీ ముందుకు వస్తుందన్న అటార్నీ జనరల్ హామీమేరకు, సదరు విధాన రూపకల్పనకు మరికొంత సమయాన్ని ప్రధాన న్యాయమూర్తి మంజూరు చేశారు. దేశంలో ఆకలిచావుల నివారణకోసం కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలను ఆదేశించమని కోరుతూ అనున్ ధావన్ సహా మరికొందరు వేసిన రెండేళ్ళనాటి కేసును అత్యవసర విచారణకు స్వీకరించిన న్యాయస్థానం గతనెలలోనే స్పష్టమైన కార్యాచరణకు ఆదేశాలు జారిచేసినా ప్రభుత్వ స్పందన అంతంతమాత్రంగానే ఉండటం విచిత్రం.


పేదలు ఆకలితో ఉండకూడదన్న సద్బుద్దితో చాలా రాష్ట్రాలు తమకు తోచిన రీతిలో, వేర్వేరు రూపాల్లో, ఏవో పేర్లతో కమ్యూనిటీ కిచెన్లు నిర్వహిస్తున్నాయి. పేదలకు చవుకగా, కొన్నిచోట్ల ఉచితంగా భోజనం పెట్టే క్యాంటీన్లను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నగరపాలక సంస్థలు సైతం వీటిని ఏర్పాటుచేయడంతో అవి వేలాదిమంది ఆకలి తీర్చుతున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లమంది అభాగ్యులకు అన్నంపెడుతున్న అక్షయపాత్ర వంటి సంస్థలతో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు, మత సంస్థలు సైతం ఉచిత భోజనాలు పెడుతున్నాయి. అయితే, కరోనా మహమ్మారి ప్రవేశంతో నిరుపేదకు నిరంతరాయంగా నాలుగుముద్దలు పెట్టే ఒక పటిష్టమైన వ్యవస్థ అవసరం ఈ దేశంలో ఎంతో ఉందని విస్పష్టంగా తెలిసొచ్చింది. లాక్ డౌన్ రోజుల్లో కేరళ ప్రభుత్వం ఆరంభించిన కమ్యూనిటీ కిచెన్లు ఎంతో మంది ఆకలితీర్చాయి, చాలా రాష్ట్రాలు దానిని అనుసరించాయి. అనేక స్వచ్ఛంద సంస్థలు, స్థానిక సంఘాలు కూడా వలసకూలీల ఆకలితీర్చాయి. కానీ, నకనకలాడే కడుపులతో, నెత్తురోడుతున్న పాదాలతో వేలమంది కూలీలు సుదీర్ఘప్రయాణాలు చేయడం, మార్గమధ్యంలో అష్టకష్టాలు పడటం, ప్రాణాలు కోల్పోవడం మరిచిపోలేని దృశ్యం. వారి విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం అమానవీయమైనది. ఆకలిసూచీలో అధమస్థానంలో ఉన్న మనదేశంలో అన్నార్తుల ఆకలితీర్చాలంటే కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటు చక్కని మార్గమన్న వాదన కాదనలేనిది. చుట్టుపక్కలున్న చిన్నచిన్న దేశాలతో పోల్చినా కూడా ఇటీవలి  ప్రపంచ ఆకలిసూచీలో మనం వెనుకనే ఉన్నాం. కరోనా వంటి విపత్కర పరిస్థితులను తట్టుకోవడం మాట అటుంచితే, పౌష్టికాహారలోపం ఎన్ని దశాబ్దాలు గడిచినా, ఎన్నిదారుల్లో సాగినా మనం జయించలేని సమస్యగా మిగిలిపోయింది. మధ్యాహ్నభోజనాలు, పౌరసరఫరా పథకాలు ఎన్నివున్నా  ఆ సమస్య తీరడం లేదు. ఆహారభద్రతకు లోటులేదని అంటున్నప్పటికీ, ప్రపంచ ఆకలిలో నాలుగోవంతు భారత్ లోనే ఉన్నది. ఏ ఒక్కరూ అన్నానికి దూరంకాకుండా చూసుకోవడం పాలకుల బాధ్యత.

Updated Date - 2021-11-19T07:08:09+05:30 IST