స్వామీ...అన్నప్రసాదమేదీ?

ABN , First Publish Date - 2021-10-02T06:53:02+05:30 IST

అన్నవరం దేవస్థానంలో అన్న ప్రసాదం అమలు అటకెక్కింది. నెలలు గడుస్తున్నా అధికారులు అన్న ప్రసాదం ఊసే ఎత్తడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి కొండపైకి వచ్చిన భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. కొవిడ్‌ సాకుతో ఈ ఏడాది మార్చి కొండపై అన్న ప్రసాదం పంపిణీని దేవస్థానం నిలిపి వేసింది. ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణిగినా ఇంకా కొవిడ్‌ పేరు చెబుతుండడం విస్మయ పరుస్తోంది. ఒకపక్క ఇతర ఆలయాల్లో

స్వామీ...అన్నప్రసాదమేదీ?

అన్నవరం దేవస్థానంలో అన్న ప్రసాదం                   

కోసం భక్తులు ఎదురుచూపులు

కొవిడ్‌ సాకుతో కొన్ని నెలలుగా మంగళం 

దూరప్రాంతాల నుంచి దేవస్థానానికి                   

వచ్చిన భక్తులు భోజనానికి ఇక్కట్లు

రూ.50 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రూ.2.5             

కోట్ల వార్షిక వడ్డీ వస్తున్నా ఖర్చులకు వెనుకంజ

ఇతర ప్రముఖ ఆలయాల్లో యథావిథిగా                 

కొనసాగుతున్న అన్న ప్రసాదం పంపిణీ

ఇక్కడ మాత్రం తూతూమంత్రంగా                   

సాంబారు అన్నం మాత్రమే వితరణ

అర్ధాకలితో తిరుగుప్రయాణం అవుతున్న                   

భక్తులు.. అటు సిబ్బందికీ కష్టాలే


అన్నవరం దేవస్థానంలో అన్న ప్రసాదం అమలు అటకెక్కింది. నెలలు గడుస్తున్నా అధికారులు అన్న ప్రసాదం ఊసే ఎత్తడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి కొండపైకి వచ్చిన భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. కొవిడ్‌ సాకుతో ఈ ఏడాది మార్చి కొండపై అన్న ప్రసాదం పంపిణీని దేవస్థానం నిలిపి వేసింది. ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణిగినా ఇంకా కొవిడ్‌ పేరు చెబుతుండడం విస్మయ పరుస్తోంది. ఒకపక్క ఇతర ఆలయాల్లో అన్న ప్రసాదం యథావిథిగా కొనసాగుతుండగా ఇక్కడ మాత్రం సాకులతో కాలం వెలిబుచ్చుతుండడంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇప్పట్లో దీన్ని అమలు చేస్తారా? లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రూ.50 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రూ.2.5 కోట్ల వార్షిక వడ్డీ వస్తున్నా రోజుకు రూ.45 వేలలోపు అయ్యే అన్న ప్రసాదం ఖర్చులకు ఆలయ అధికారులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారనేది అంతుపట్టడం లేదు.



(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఆలయాలంటేనే నిత్య అన్నదానాలకు పెట్టింది పేరు. ఈ బృహత్కర కార్యాన్ని నెరవేర్చడం కోసం ఎందరో భక్తులు ఆలయాలకు విరాళాలు ఇస్తుం టారు. వాటిపై వచ్చే వడ్డీతో ఆయా ఆలయాలు భక్తులకు అన్నప్రసాదం అందిస్తుంటాయి. అయితే పేరులోనే అన్నమనే పదం ఉన్న అన్నవరం ఆలయంలో మాత్రం అన్నప్రసాదం అమలు కాకపోవడం భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. అసలు అన్నప్రసాదం ఎప్పుడు అమలు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో అన్నవరం కొండపై రద్దీరోజుల్లో రోజూ నాలుగు వేల మంది, సాధారణ రోజుల్లో 2,500 మందికి అన్నప్రసాదం అందించేవారు. రత్నగిరికి వచ్చే భక్తుల్లో పేద, ధనిక తేడా లేకుండా అంతా అన్నప్రసాదం స్వీకరించేవారు. కానీ కోవిడ్‌ పేరుతో ఈ ఏడాది మార్చి నుంచి కొండపై అన్న ప్రసాద వితరణ నిలిపివేశారు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అన్నప్రసాదం లేక ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అనేక విమర్శలు రావడంతో కొంతకాలం కిందట కేవలం పులిహోర పంపిణీ చేసి చేతు లు దులిపేసుకున్నారు. దీంతో ఇక్కడకు వచ్చే భక్తులు అర్ధాకలితో వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఆతర్వాత ప్రస్తుతం తూతూ మంత్రంగా సాంబారు అన్నం పంపిణీ చేస్తున్నారు. ఇది స్వీకరించే భక్తులు అర్ధాకలితో గడుపుతున్నారు. గడచిన కొన్నినెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ కొవిడ్‌ నిబంధనలు సడలించింది. దేవస్థానాల్లోను దర్శనాలకు పెద్దగా ఆంక్షలు కొనసాగించడం లేదు. 


ఈ నేపథ్యంలో అనేక ఆలయాల్లో నిత్య అన్నదానం కొనసాగుతోంది. కానీ అన్నవరం దేవస్థానంలో మాత్రం అధికారులు అన్నప్రసాదం ప్రస్తావనే తేవడం లేదు. ఒకపక్క భక్తులు కొండపైకి వచ్చి అన్నప్రసాదం లేక ఇబ్బంది పడుతున్నా అదేదీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. కానీ అన్ని ప్రాంతాల నుంచీ అన్నప్రసాద విరాళాలు మాత్రం స్వీకరిస్తున్నారు. అయితే ఈ తీరుపై భక్తులు మండిపడుతున్నారు. అన్నప్రసాదం పంపిణీ అన్ని చోట్లా జరుగుతుంటే ఇక్కడ మాత్రం ఇంకా కొవిడ్‌ సాకు చెబుతుండడాన్ని తప్పుబడుతున్నారు. వాస్తవానికి అన్నవరం ఆలయంలో ఏర్పాటుచేసిన అన్న దాన ట్రస్ట్‌కు ప్రస్తుతం రూ.50 కోట్ల మూలధనం ఉంది. దీనిపై ఏడాదికి రూ. 2.5 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఆర్థికంగా నిత్యాన్నదానానికి ఒక్కో భోజనానికి రూ.17 చొప్పున రోజుకు 2,500 మంది భక్తులకు రూ.45వేలలోపే ఖర్చవుతుంది. కానీ ఇంత ఆదాయం ఉన్నా అన్నప్రసాదం అమలు చేయడం లేదు. ఒకపక్క తిరుపతి ఆలయంలో నిత్యన్నదానం యథావిథిగా కొనసాగుతోంది. ద్వారకాతిరుమలతోపాటు ఇతర ఆలయాల్లో ఇప్పటికే నిత్యాన్నదానం కొనసాగుతోంది. కానీ అన్నవరంలో మాత్రం అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. 


వాస్తవానికి మిగిలిన ఆలయాలతో పోల్చితే అన్నవరంలో భక్తులకు అన్నప్రసాదం ఎంతో అవసరం. దూరప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడు ముందు రోజు రాత్రి వచ్చి బసచేస్తారు. ఉదయాన్నే స్వామివారి వ్రతాలు ఆచరించి దర్శనాలు చేసి ఆతర్వాత కొంత ఎంగిలి పడతారు. వ్రతం, దర్శన ప్రక్రియ సుమారు నాలుగు గంటలు ఉంటుంది. ప్రస్తుతం దేవస్థానానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం లేకపోవడం,  ఉన్న ఒకేఒక్క ప్రైవేటు క్యాంటిన్‌ ఆలయానికి దూరంగా ఉండడంతో అర్ధాకలితోనే భక్తులు కొండ కిందకు వెళ్తున్నారు. అటు అన్నదానం ప్రారంభించక దేవస్థానం సిబ్బంది సైతం ఇబ్బందిపడుతున్నారు. దీనిపై ఈవో త్రినాథరావును వివరణ కోరగా మంచిరోజు చూసి అన్నప్రసాదం పంపిణీ త్వరలో పునఃప్రారంభించడానికి ఆలోచిస్తున్నట్టు చెప్పారు.

Updated Date - 2021-10-02T06:53:02+05:30 IST