Sep 22 2021 @ 13:33PM

త్వరలో విజయ్‌ 66వ చిత్రంపై ప్రకటన

స్టార్‌ హీరో విజయ్‌ తన 65వ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ  ఈ చిత్రం ‘బీస్ట్‌’ అనే టైటిల్‌తో రూపొందుతోంది. ఇందులోని ఫస్ట్‌లుక్‌లతో పాటు మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేయగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాకుండా, ఈ చిత్రం షూటింగ్‌ ఈజిప్టు, చెన్నై సహా పలు ప్రాంతాల్లో పూర్తి చేసుకుని ఇపుడు ఢిల్లీకి షిప్ట్‌ అయింది. ఇక్కడే రెండు వారాల పాటు షూటింగ్‌ జరిపేలా చిత్ర బృందం ప్లాన్‌ చేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కళానిధి మారన్‌ తన సొంత నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదిలా వుంటే, విజయ్‌ తన 65వ చిత్రం సెట్స్‌పైనే ఉండగానే 66వ చిత్రాన్ని ప్రకటించేందుకు ప్లాన్‌ చేశారు. ఈ చిత్రానికి టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ మూవీ ఏకకాలంలో నిర్మించనున్నారు. కోలీవుడ్‌ వర్గాల సమాచారం మేరకు విజయ్‌ 66వ చిత్రం పూజా కార్యక్రమం అక్టోబరు 14వ తేదీ జరుగనుంది. నిజానికి విజయ్‌ ఒక చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాతే మరో చిత్రంపై దృష్టిసారిస్తారు. ఆ ప్రకారంగా ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న 65వ చిత్రం షూటింగ్‌ను ఆ లోపు పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.