పరీక్షలు లేకుండానే పైతరగతులకు

ABN , First Publish Date - 2020-03-27T10:54:29+05:30 IST

కరోనాను కట్టడి చేసేందుకు వచ్చే నెల 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఈ ఏడాది 1-9వ తరగతుల విద్యార్థులకు నిర్వహించాల్సిన వార్షిక పరీక్షలను రద్దు

పరీక్షలు లేకుండానే  పైతరగతులకు

6 నుంచి 9 వరకూ  వార్షిక పరీక్షలు రద్దు

ఏపీ ప్రభుత్వం నిర్ణయం

అదే బాటలో తెలంగాణ

9వ తరగతి వరకు పరీక్షలు రద్దు!

అందర్నీ ప్రమోట్‌ చేయాలని విద్యా శాఖ యోచన 


హైదరాబాద్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కరోనాను కట్టడి చేసేందుకు వచ్చే నెల 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఈ ఏడాది 1-9వ తరగతుల విద్యార్థులకు నిర్వహించాల్సిన వార్షిక పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులందర్నీ ప్రమోట్‌ చేయాలని భావిస్తోంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 6-9 విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 7-16 వరకు స్కూల్‌ స్థాయి వార్షిక పరీక్షలు జరిగాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం అసాధ్యం.


ఇప్పటికే పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఒకవేళ కరోనా వ్యాప్తి తగ్గితే ముందుగా అధికారులు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది పాఠశాలలకు ఏప్రిల్‌ 23న చివరి పనిదినం. 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్కూల్‌ స్థాయి పరీక్షలను ఈ ఏడాది నిర్వహించకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వాస్తవానికి విద్యాహక్కు చట్టం ప్రకారం పరీక్షలతో సంబంధం లేకుండా కేవలం హాజరును పరిగణనలోకి తీసుకుని విద్యార్థులను ప్రమోట్‌ చేయాల్సి ఉంటుంది.  


ఏపీలో పరీక్షలు లేకుండానే పైతరగతులకు

అమరావతి: కరోనా వైరస్‌ కారణంగా పాఠశాలలన్నీ మూసేసిన నేపథ్యంలో 6 నుంచి 9 తరగతుల వరకూ చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షలు లేకపోయినా నేరుగా పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పట్లో పాఠశాలలు తెరిచే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విద్యాశాఖపై సమీక్షించారు. పరీక్షలు వాయిదా, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కరోనా వైరస్‌ కారణంతో ఇతర రాష్ర్టాల్లో పరీక్షలు రాయకుండానే 6 నుంచి 9 తరగతుల విద్యార్థులను పైతరగతులకు పంపుతున్నారనే విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో రాష్ట్రంలో కూడా అదే విధానం అమలుచేయాలని సీఎం ఆదేశించారు. పాఠశాలలు మూతపడినందున మధ్యాహ్న భోజనానికి సంబంధించిన డ్రై రేషన్‌ను విద్యార్థుల ఇళ్లకే పంపుతున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. వలంటీర్ల సాయంతో పకడ్బందీగా పిల్లలకు అందేలా చూడాలని దిశా నిర్దేశం చేశారు.

Updated Date - 2020-03-27T10:54:29+05:30 IST