అమూల్‌ సేవలో మరో అడుగు

ABN , First Publish Date - 2021-05-05T06:35:39+05:30 IST

ఒంగోలు డెయిరీని అమూల్‌కు అప్పగించేందుకు మరో అడుగు ముందుకుపడింది.

అమూల్‌ సేవలో మరో అడుగు

ఏపీడీడీసీఎఫ్‌ ఆస్తుల లీజుకు 

మంత్రివర్గం ఆమోదం

త్వరలో అధికారికంగానే అన్ని వ్యవహారాలు

రూ.69కోట్ల డెయిరీ అప్పులు తీర్చేందుకు అనుమతి

గతంలో ఉద్యోగుల వీఆర్‌ఎస్‌కు రూ.12 కోట్లు మంజూరు

ఇప్పటికే అనధికారికంగా సాగుతున్న అమూల్‌ కార్యకలాపాలు

ఒంగోలు, మే 4 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు డెయిరీని అమూల్‌కు అప్పగించేందుకు మరో అడుగు ముందుకుపడింది. ఇప్పటికే డెయిరీ ప్రాంగణం నుంచి అమూల్‌ కార్యకలాపాలు ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఫెడరేషన్‌(ఎపీడీడీసీఎఫ్‌) సారఽథ్యంలో సాగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో ఏపీడీడీసీఎఫ్‌ పరిధిలో ఉన్న ఆస్తులను  లీజుపై అమూల్‌కు ఇచ్చేందుకు అనుమతి ఇస్తూ మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. తాజా నిర్ణయంతో త్వరలో ఒంగోలు డెయిరీలో అమూల్‌ కార్యకలాపాలు అధికారికంగా కొనసాగనున్నాయి.


ఆదుకోవాల్సింది పోయి..

ఒంగోలు డెయిరీ ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోయి పడుతూ లేస్తూ సాగుతున్న సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  తొలుత డెయిరీ పరిస్థితిని చక్కదిద్ది రైతులకు ఉపయుక్తంగా నడిచేలా చేస్తామని సర్కారు పెద్దలు ప్రకటించారు. ఆతర్వాత అనంతరం మాటమారింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా డెయిరీల గొంతునులిమి గుజరాత్‌కు చెందిన అమూల్‌ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా గతేడాది నవంబరు నుంచి  ఒంగోలు డెయిరీతోపాటు కడప, చిత్తూరు డెయిరీల్లో అమూల్‌ కార్యక లాపాలు ప్రారంభమయ్యాయి.


అమూల్‌కు అప్పగింతే లక్ష్యం

జిల్లాలో అమూల్‌ కార్యకలాపాలు ప్రారంభించే నాటికి ఒంగోలు డెయిరీ రోజుకు 18వేల లీటర్ల పాల సేకరణ, అమ్మకాలు చేస్తూ రెగ్యులర్‌ నిర్వహణ ఖర్చులు చెల్లిస్తూ నడుస్తోంది. అయితే ఆర్థికంగా సహకరించి డెయిరీని గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకోని ప్రభుత్వం అమూల్‌ సేవలో తరించి ఆ సంస్థకు డెయిరీని అప్పగించే చర్యలు వేగవంతం చేసింది. ఆ క్రమంలో డిసెంబరు 31తో పాలసేకరణ నిలిపివేయడంతో పాటు శాశ్వత ఉద్యోగులను జనవరి ఆఖరుకు నిలిపివేసి వీఆర్‌ఎస్‌ ప్రకటించింది. అయితే కంపెనీ చట్టంలో డెయిరీ ఉండటంతో ఏఒక్కరికి సదరు సంస్థ రుణం ఉన్నా ఇతరులకు అప్పగించే వీలు లేదు. దీంతో బ్యాంకులు, ఇతర సంస్థలకు ఉన్న అప్పులు, ఉద్యోగుల ఖాతాలు, పీఎఫ్‌లు, విద్యుత్‌ బిల్లులు, ప్రభుత్వం గతంలో ఇచ్చిన రుణం అన్నింటినీ లెక్కలు వేసి మొత్తం రూ.109కోట్లు అప్పులు ఉన్నట్లు తేల్చారు. అయితే రూ.400కోట్లపైనే ఆస్తులు ఉన్న డెయిరీకి ప్రభుత్వ రుణం పోను ఉన్న అప్పులు పెద్ద ఇబ్బందికాకపోయినా అమూల్‌కు అప్పగించే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం తొలుత డెయిరీని మూసేసి ప్రస్తుతం అప్పులు చెల్లింపు చర్యలు చేపట్టింది. మొత్తం రూ.109 కోట్ల అప్పుల్లో గతంలో ప్రభుత్వం ఇచ్చిన రుణం, వడ్డీ కలిపి రూ.40కోట్లు పోను, మిగతా రూ.69కోట్లను నాలుగురోజుల క్రితం మంజూరుచేసింది. అవి చెల్లిస్తే డెయిరీ తొలుత ఏపీడీడీసీఎఫ్‌ స్వాధీనమై అనంతరం మంగళవారం కేబినెట్‌ చేసిన నిర్ణయానికి అనుగుణంగా అమూల్‌ సంస్థ లీజు పరిధిలోకి  వెళ్లడానికి మార్గం సుగమమైంది. మరోవైపు ఉద్యోగుల వీఆర్‌ఎస్‌కు సంబంధించి నెల క్రితమే రూ.12.26కోట్లు మంజూరయ్యాయి. అలా అప్పులు, ఉద్యోగుల వీఆర్‌ఎస్‌ ప్యాకేజీలను త్వరలో చెల్లించి అమూల్‌ కార్యకలాపాలు డెయిరీలో అధికారికంగా సాగేందుకు వీలుగా ముందుకుపోతున్న ప్రభుత్వం మంగళవారం నాటి కేబినెట్‌లో దీనిపై మరింత స్పష్టత ఇచ్చింది. 


Updated Date - 2021-05-05T06:35:39+05:30 IST