మరో 1,018 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-18T05:40:52+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

మరో 1,018 కరోనా కేసులు

విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా 1,018 మందికి వైరస్‌ సొకినట్టు సోమవారం నిర్ధారణ అయ్యింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,66,443కు చేరింది. ఇందులో 1,58,887 మంది కోలుకోగా, మరో 6,444 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్‌తో 1,112 మంది మృతిచెందారు. 


కలెక్టర్‌కు కరోనా

ఇంటి నుంచే విధులు

విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున కరోనా బారినపడ్డారు. గత మూడు రోజులుగా ఆయన ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కరోనా కట్టడి కోసం జీవీఎంసీ కమిషనర్‌, జాయింట్‌ కలెక్టర్‌, వైద్య శాఖాధికారులతో కలిసి ఆయన నగరంలో పలు ప్రాంతాలను సందర్శించారు. ఆ మరుసటిరోజు జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషాకు కరోనా సోకినట్టు బయటపడింది. ఆ తరువాత రోజు జీవీఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శాస్ర్తికి పాజిటివ్‌ వచ్చింది. అంతకుముందు జిల్లా వైద్య శాఖాధికారికి కూడా కరోనా సోకడంతో హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నారు. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా కరోనాకు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.


నో మాస్క్‌ నో ఎంట్రీ...ఆర్టీసీ నిర్ణయం

ద్వారకా బస్‌స్టేషన్‌, జనవరి 17: కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రజా రవాణా శాఖ (పీటీడీ)/ఆర్టీసీ విశాఖ రీజియన్‌ అధికారులు నిర్ణయించారు. మాస్క్‌ లేని ప్రయాణికులను బస్టాండులలోనికి అనుమతించడం లేదు. అదేవిధంగా బస్సుల్లో కూడా సీటింగ్‌ కెపాసిటీకి మించి అనుమతించడం లేదు. ఈ మేరకు రీజియన్‌ పరిధిలోని పది డిపోల మేనేజర్లకు, అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్లకు పీటీడీ విశాఖ రీజనల్‌ మేనేజర్‌ అంధవరపు అప్పలరాజు ఆదేశాలు ఇచ్చారు. కొవిడ్‌పై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలని సూచించారు. పీటీడీ సిబ్బంది కూడా  తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్క్‌లు, శానిటైజర్‌ తప్పనిసరిగా వినియోగించాలన్నారు.

Updated Date - 2022-01-18T05:40:52+05:30 IST