మరో 11 కేసులు

ABN , First Publish Date - 2020-04-02T09:14:27+05:30 IST

కరోనా జిల్లాలో కలకలం సృష్టిస్తోంది..

మరో 11 కేసులు

జిల్లాలో 20కి చేరిన పాజిటివ్‌లు

ఒకేరోజు ఇన్ని కేసులతో ప్రజల్లో ఆందోళన

క్వారంటైన్‌లో 2,500 మంది అనుమానితులు

వారిలో సగం మందికి కూడా జరగని వైద్య పరీక్షలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీ మూలాలతో తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఢిల్లీ సమావేశానికి వెళ్లి వచ్చిన వారికే కాకుండా వారి కుటుంబీకులను కూడా కరోనా పట్టి పీడిస్తుంది. మొదటి తొమ్మిది మందిలో ఇద్దరు మహిళలు ఉండగా వారికి ఈ వ్యాధి తమ భర్తల ద్వారానే సోకింది. తాజాగా బుధవారం రాత్రి వెలువడిన నమోదైన 11 కేసుల్లో నేరుగా సోకిన వారు ఎందరో కుటుంబీకుల ద్వారా సంక్రమించిన వారు ఎందరో వివరాలు తెలియాల్సి ఉంది. కేవలం వైద్యాధికారులు సంఖ్యను మాత్రమే వెల్లడించడంతో పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. తాజా కేసులతో జిల్లాలో మొత్తం 20 మందికి ఈ వ్యాధి సంక్రమించింది. ఇంకా 30 వరకు పరీక్షా ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండడంతో వారిలో ఎందరికీ పాజిటివ్‌ ఉందనేది నేడో, రేపో వెల్లడి కానుంది. క్రమేణా జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య పెరగడంతో అటు వైద్యాధికారులు, ప్రజానీకం ఆందోళనకు గురవుతున్నారు.


ఈ ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించిన గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు ఇప్పటికే పదివేల పడకలను సిద్ధం చేశారు. అయితే జిల్లాలో ఇంతటి తీవ్ర స్థాయిలో వైరస్‌ ప్రభావం ఉన్నప్పటికీ ఇక్కడ ప్రత్యేకంగా పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయలేదు. బుధవారం నాటికే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని వైద్యాధికారులు భావించినప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందకపోవడంతో జాప్యం జరిగింది.


రాష్ట్రంలోకెల్లా గుంటూరులోనే అత్యధికం

కరోనా పాజిటివ్‌ కేసులు రాష్ట్రంలో 111 మందికి రాగా వారిలో 20 మంది జిల్లావాసులే ఉన్నారు. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల్లో రాష్ట్రంలోకే ప్రథమ స్థానానికి చేరింది. జిల్లాలో మొదటి బాధితుడు ఓ ప్రజాప్రతినిధి చెల్లెలు భర్త కావడంతో ఆ రోజునే జిల్లాలో కలకలం రేగింది. పైగా ఆ బాధితుడు ఢిల్లీ యాత్ర నుంచి వచ్చేటప్పుడే రోగ లక్షణాలతో ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడమేకాకుండా అనేక సమావేశాలు ఇతర కార్యక్రమాల ద్వారా ఎంతో మందితో కలివిడిగా మెలగడంతో ఒక్కసారిగా గుంటూరులో వణుకు మొదలైంది. తమకు కూడా ఈ వ్యాధి సోకిందేమోనని పలువురు ఆందోళనకు గురయ్యారు. తాజాగా నిర్ధారణ అయిన 11 కేసుల్లో ఎవరెవరు ఉన్నారో నిర్ధారణ అయితే గానీ ఈ వ్యాధి ఎటు నుంచి ఎటువైపునకు వ్యాపిస్తుందో తెలియనుంది.  


ఎంత వరకు.. సేఫ్‌

జిల్లాపై కరోనా ప్రభావం ఎంత అనే దానిపై ఎవరూ అంచనాకు రాలేకపోతున్నారు. మంగళ, బుధవారాల్లో జిల్లాలో 16 కేసులు వెలికిచూడటంతో యంత్రాంగంతో పాటు ప్రజల్లో కూడా ఆందోళన రేకెత్తుతుంది. బుధవారం పల్నాడు ప్రాంతానికి చెందిన 80 మందికి రిపోర్టులు రాగా వారందరికీ నెగిటివ్‌ వచ్చింది. అయినా ఊపిరి పీల్చుకోవాలో లేదో కూడా అర్ధం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా పలు క్వారంటైన్‌ కేంద్రాల్లో పరీక్షలు చేయాల్సిన వారి సంఖ్య 1500కు పైగానే ఉంది.


దీంతో అధికార యంత్రాంగంతో పాటు జిల్లా వాసులకు కూడా కరోనా విస్తరణపై అవగాహన రావడం లేదు. మరో వైపు ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారందరికీ, కరోనా బారిన పడ్డ వారి దగ్గరి బంధువులకు పరీక్షలు నిర్వహించలేని స్థితి గుంటూరులో నెలకొంది. ఐసోలేషన్‌ సెంటర్లలో ఉన్న వారిని పరీక్షించే వారికి సైతం మాస్కులు, శానిటైజర్లు అందించలేక అధికారులు అవస్థలు పడుతున్నారు. మరో రెండు రోజుల్లో అనుమానితుల్లో కనీసం 50 శాతం మందికైనా పరీక్షలు నిర్వహించగలిగి వాటి ఫలితాలు చూస్తే కానీ జిల్లాలో కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకుంది.


క్వారంటైన్‌కు పలువురి తరలింపు 

ఢిల్లీ సదస్సుకు వెళ్లి ఈ నెల 18న వచ్చిన బావాజీపాలేనికి చెందిన ఒకరిని గుంటూరు క్వారంటైన్‌కు తరలించినట్లు నిజాంపట్నం వైద్యులు ఉదయ్‌కుమార్‌ తెలిపారు. వారి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌కు తరలించనున్నామన్నారు. అతడు విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళుతుంటాడని, అతడు చుట్టు పక్కల వారితో గడిపారనే విషయమై ఆరా తీశారు. కారంపూడి మండలం వేపకంపల్లికి చెందిన ఇద్దరిని పోలీసులు గుంటూరు కాటూరు మెడికల్‌ కళాశాలలోని క్వారెంటైన్‌కు తరలించారు. కారంపూడివాసికి పాజిటివ్‌ అని తేలగా అతడితో కలిసి తిరిగిన ఇద్దరు స్నేహితులను క్వారెంటైన్‌కు తరలించారు. మాచర్ల నెహ్రూనగర్‌కు చెందిన ఐదుగురికి కరోనా లక్షణాలున్నట్లు భావించి వారిని పోలీసులు గుంటూరుకు తరలించారు. చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామం నుంచి ఏడుగురిని బాపట్ల క్వారెంటైన్‌కు తరలించారు. కడప ప్రాంతం నుంచి జమాయిత్తులు మత ప్రార్థనల కోసం వీరు ఇక్కడకు వచ్చినట్లు గుర్తించిన పోలీసులు,  రెవెన్యూ అధికారులు వారిని ముందు జాగ్రత్త చర్యగా క్వారెంటైన్‌కు తరలించారు. 

Updated Date - 2020-04-02T09:14:27+05:30 IST