డయాగ్నస్టిక్‌ హబ్‌లు రాష్ట్రంలో మరో 16

ABN , First Publish Date - 2021-06-16T09:23:38+05:30 IST

ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలను పేద ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకుగాను రాష్ట్రంలో మరిన్ని డయాగ్నస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

డయాగ్నస్టిక్‌ హబ్‌లు రాష్ట్రంలో మరో 16

  • 15 జిల్లాల్లో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం
  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో 12 మినీ కేంద్రాలు
  • ఉచితంగా 57 రకాల వైద్య నిర్ధారణ పరీక్షలు
  • ఆగస్టు నాటికి ప్రజలకు అందుబాటులోకి


హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలను పేద ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకుగాను రాష్ట్రంలో మరిన్ని డయాగ్నస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా 15 జిల్లాల్లో 16 చోట్ల ఈ కేంద్రాలను, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిఽధిలో మరో 12 చోట్ల మినీ హబ్‌లను ఏర్పాటు చేయనుంది. వీటిని ఈ ఏడాది ఆగస్టు నాటికి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కేంద్రాల్లో మొత్తం 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఇప్పటికే 19 జిల్లాల్లో 19 డయాగ్నస్టిక్‌ కేంద్రాలను ఈ నెల 9న అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇవి కాకుండా.. అవసరమైన చోట్ల మరికొన్నింటిని కొత్తగా ప్రారంభిస్తామని ఈ నెల 5న వైద్య ఆరోగ్యశాఖపై జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.




సీఎం ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఎక్కడెక్కడ  కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న దానిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇందులో 16 డయాగ్నస్టిక్‌ కేంద్రాలతోపాటు గ్రేటర్‌లో 12 మినీ హబ్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సూచించారు. రాజధాని పరిఽధిలో జనాభా ఎక్కువగా ఉండటం, ఇప్పటికే ఉన్న డయాగ్నస్టిక్‌ కేంద్రాల సంఖ్య సరిపోయే అవకాశం లేకపోవడంతో మినీ హబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉండబోతున్నాయి. పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రి, అమీర్‌పేట యూసీహెచ్‌సీ, కంటోన్మెంట్‌, మలక్‌పేట ఏరియా ఆస్పత్రి, బాలాపూర్‌ పీహెచ్‌సీ, హయత్‌నగర్‌ సీహెచ్‌సీ, అల్వాల్‌ యూపీహెచ్‌సీ, కూకట్‌పల్లి యూపీహెచ్‌సీ, కుషాయిగూడ యూపీహెచ్‌సీ, శేరిలింగంపల్లి పీహెచ్‌సీ, నార్సింగ్‌ యూపీహెచ్‌సీ(మణికొండ), రాజేంద్రనగర్‌ సీహెచ్‌సీల్లో ఈ మినీ హబ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. 


ఇప్పటికే విజయవంతంగా మినీ హబ్స్‌..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గతంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన మినీ హబ్స్‌ విజయవంతంగా కొనసాగుతున్నాయి. నారాయణగూడ ఐపీఎం కేంద్రంలో 2018 జూన్‌ 9న తొలి డయాగ్నస్టిక్‌ కేంద్రం ప్రారంభం కాగా, ఆ తరువాత ఈ ఏడాది జనవరి 22న ఎనిమిది ప్రాంతాల్లో మినీ హబ్స్‌ను ఏర్పాటు చేశారు. ఇవి బార్కాస్‌, జంగం మెట్‌, అంబర్‌పేట, పురానా పూల్‌, పానీపుర, శ్రీరామ్‌నగర్‌, సీతాఫల్‌మండి, లాలాపేట్‌లో ఇవి కొనసాగుతున్నాయి. ‘‘సకాలంలో-సమీపంలో- ఉచితంగా’’ నినాదంతో ప్రారంభమైన ఈ మినీ కేంద్రాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ కేంద్రాల్లో రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలతోపాటు ఇమేజ్‌ టెస్టులు, ఈసీజీ, ఎక్స్‌రే, అలా్ట్ర సౌండ్‌ స్కానింగ్‌ కూడా చేస్తున్నారు. దీంతో ఎంతో ఖరీదైన వైద్య నిర్ధారణ పరీక్షలు బస్తీల్లోని నిరుపేదలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చినట్లయింది


కొత్త కేంద్రాలు ఇక్కడే..

భద్రాచలం, కాగజ్‌నగర్‌, కల్లూరు, నారాయణఖేడ్‌, ఏటూరునాగారం, భూపాలపల్లి, నారాయణపేట, కామారెడ్డి, మంచిర్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, వనపర్తి, భువనగిరి, హసన్‌పర్తి, నర్సంపేట, శంషాబాద్‌ 

Updated Date - 2021-06-16T09:23:38+05:30 IST