మళ్లీ కరోనా అలజడి

ABN , First Publish Date - 2020-05-14T06:10:35+05:30 IST

ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌జోన్‌కు మారుతుందని అనుకున్న జనగామ జిల్లాలో బుధవారం మరో రెండు కరోనా పాజిటీవ్‌ కేసులు

మళ్లీ కరోనా అలజడి

జనగామ జిల్లాలో భార్యాభర్తలకు కరోనా పాజిటివ్‌ 

ఇద్దరు ముంబాయి నుంచి వచ్చిన వలసకూలీలు

మరో 23 మంది హోం క్వారంటైన్‌


జనగామ, మే 13 (ఆంధ్రజ్యోతి) :  ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌జోన్‌కు మారుతుందని అనుకున్న జనగామ జిల్లాలో బుధవారం మరో రెండు కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిందనుకుంటున్న సమయంలో రఘునాథపల్లి మండలం నిడిగొండకు చెందిన భార్యాభర్తలు బతుకుదెరువు కోసం ముంబాయి వెళ్లి, ఈనెల 11న రాత్రి ప్రైవేటు వాహనంలో స్వగ్రామానికి చేరుకున్నారు. జలుబు, జ్వరంగా బాధపడుతుండగా అధికారులు గుర్తించి, అదేరోజు హైదరాబాద్‌లోని కింగ్‌కోటి ఫీవర్‌ ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో రెండు కొత్తకేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో గతంలో మర్కజ్‌కు వెళ్లివచ్చిన ఇద్దరికి, పంజాబ్‌ రాష్ట్రంలో ఆర్మీజవాన్‌గా పనిచేస్తున్న ఒకరికి కరోనా పాజిటివ్‌ నమోదుకాగా, వీరిలో ఇద్దరు కోలుకోగా ఆర్మీజవాన్‌ జనగామలోని ప్రధాన ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.


కొత్తకేసుల నమోదుతో భయాందోళనలు

దాదాపు 15 రోజుల తరువాత జిల్లాలో కొత్తగా రెండుకరోనా పాజిటివ్‌లు నమోదు కావడంతో జిల్లావ్యాప్తంగా ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఓ వైపు లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతుండగా వలసకూలీలు స్వగ్రామాలకు పెద్ద ఎత్తున చేరుతుండడంతో వారిని పసిగట్టడం అధికారయంత్రాంగానికి కష్టతరంగా మారింది. సమాచారం అందిన వారిని హోం క్వారంటైన్‌ చేస్తుండగా సమాచారం లేకుండా వచ్చిన అనేకమంది జనగామ జిల్లాలోని తమతమ గ్రామాలకు చేరుకుంటున్నారు. తాజాగా రఘునాథపల్లి మండలం నిడిగొండకు చెందిన వలస కార్మికులైన భార్యాభర్తలకు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వలసకార్మికుల వివరాలను అధికారులు సేకరించే పనిలో పడ్డారు. 


పలువురి హోం క్వారంటైన్‌ 

నిడిగొండకు చెందిన భార్యాభర్తలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణకాగా, వారితోపాటు ముంబాయి నుంచి ప్రైవేటు వాహనంలో వచ్చిన లింగాలఘణపురం మండలం సిరిపురం గ్రామానికి చెందిన 12 మంది, పటేల్‌గూడెంకు చెందిన ముగ్గురిని అధికారులు వెంటనే గుర్తించి హోం క్వారంటైన్‌కు పంపారు. ఎవరూ ఇంటి నుంచి వెలుపలకు రావొద్దని, నిత్యావసర సరుకులు కావాల్సితే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. డీసీపీ శ్రీనివా్‌సరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించి సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారితో పాటు పారిశుధ్య చర్యలు చేపట్టారు.

Updated Date - 2020-05-14T06:10:35+05:30 IST