Abn logo
Sep 25 2021 @ 02:23AM

రెండేళ్లలో మరో 250 స్టోర్లు

  • రూ.125 కోట్ల పెట్టుబడులు : బిగ్‌ సి
  • ప్రచారకర్తగా మహేశ్‌ బాబు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రిటైల్‌ స్టోర్ల ద్వారా మొబైల్‌ ఫోన్లను విక్రయిస్తున్న బిగ్‌ సి వచ్చే రెండేళ్లలో మరో 250 స్టోర్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకు దాదాపు రూ.125 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో స్టోర్లు ఉన్నాయని.. త్వరలో కర్ణాటకలోకి అడుగు పెట్టనున్నామని బిగ్‌ సి వ్యవస్థాపకుడు, సీఎండీ ఎం బాలు చౌదరి తెలిపారు. ప్రస్తుతం సంస్థకు 250 స్టోర్లు ఉన్నాయని.. రెండేళ్లలో వీటిని 500 స్టోర్లకు చేర్చనున్నట్లు చెప్పారు. ఏపీ, తెలంగాణల్లో రిటైల్‌ స్టోర్‌ బ్రాండ్ల ద్వారా విక్రయిస్తున్న మొబైల్స్‌లో దాదాపు 30 శాతం వాటా బిగ్‌ సికి ఉందన్నారు. ప్రస్తుతం 2,000 మంది ఉద్యోగులు ఉండగా.. రెండేళ్లలో మరో 2,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. సినీ హీరో మహేశ్‌ బాబును కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. బిగ్‌ సికి మహేశ్‌ బాబు రెండేళ్ల పాటు ప్రచారకర్తగా ఉంటారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొత్తం విక్రయాలు రూ.1,100 కోట్లకు చేరగలవని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బాలు చౌదరి చెప్పారు.