నెత్తుటిమడుగులో ఎన్‌ఆర్‌ఐ కుటుంబం

ABN , First Publish Date - 2021-04-16T09:53:58+05:30 IST

విశాఖ నగరంలోని మధురవాడలో గురువారం తెల్లవారుజామున నలుగురు సభ్యులు కలిగిన ఓ ఎన్‌ఆర్‌ఐ కుటుంబం అంతబట్టని రీతిలో మృతిచెందింది.

నెత్తుటిమడుగులో ఎన్‌ఆర్‌ఐ కుటుంబం

కుటుంబంలోని నలుగురూ మృత్యువాత..

విశాఖలో మరో దారుణం

పెద్దకుమారుడు తప్ప అందరి బట్టలూ రక్తసిక్తం.. అతడే చంపినట్టు అనుమానం!

తగలబెట్టే యత్నంలో రేగిన పొగకు ఊపిరాడక తానూ చనిపోయినట్లు సందేహం


విశాఖపట్నం/కొమ్మాది, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): విశాఖ నగరంలోని మధురవాడలో గురువారం తెల్లవారుజామున నలుగురు సభ్యులు కలిగిన ఓ ఎన్‌ఆర్‌ఐ కుటుంబం అంతబట్టని రీతిలో మృతిచెందింది. ఇంట్లోనుంచి పొగలు వస్తుండడంతో ఇరుగుపొరుగు చూసి అగ్నిప్రమాదం సంభవించిందని భావించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు విరగొట్టిచూస్తే..లోపల రక్తపు మడుగులో చెల్లాచెదురుగా వారంతా పడి ఉన్నారు. ముగ్గురి మృతదేహాలపై కత్తిపోట్లు ఉన్నాయి. ఎవరు చంపారు? ఎలా చనిపోయారనేది అంతుచిక్కడం లేదు. పోలీసుల కథనం ప్రకారం... సుంకరి బంగారునాయుడు(50) రెండు దశాబ్దాలు బహ్రెయిన్‌లో పనిచేసి కొన్నాళ్ల క్రితమే కుటుంబంతో సహా విశాఖపట్నం వచ్చేశారు.


ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా గంట్యాడ. పెద్దకుటుంబం. పలుకుబడి ఉంది. ఆర్థికంగా స్థితిమంతులు. ఆయన భార్య నిర్మల (50) హోమియో వైద్యురాలు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు దీపక్‌(22) వరంగల్‌ నిట్‌లో విద్యాభ్యాసం పూర్తిచేసి, సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నారు. కరోనాకు ముందు ఢిల్లీలో ఉండేవారు. ఆ తరువాత తల్లిదండ్రులతోనే ఉంటున్నారు. చిన్న కుమారుడు కశ్యప్‌ (19) ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. బంగారునాయుడు మధురవాడ ప్రాంతంలోని మిథిలాపురి వుడా కాలనీలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పక్కనే స్థలం కొని అందులో నాలుగు అంతస్థుల భవనం నిర్మిస్తున్నారు. పనులు దగ్గరుండి చూసుకోవడానికి అక్కడికి సమీపంలోనే ఆదిత్య ఫార్చూన్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో 8నెలల క్రితం అద్దెకు దిగారు. సీ బ్లాకులోని 505 ఫ్లాట్‌లో కుటుంబంతో  ఉంటున్నారు. గురువారం తెల్లవారుజామున 2గంటల సమయంలో ఆ ఫ్లాట్‌ నుంచి పెద్ద శబ్దాలు వచ్చాయి. సెక్యూరిటీ గార్డు వచ్చేసరికి అలికిడి ఆగిపోయింది. దీంతో ఆయన వెనక్కి వెళ్లిపోయాడు. 4గంటల సమయంలో ఫ్లాట్‌ నుంచి దట్టమైన పొగలు వస్తుండడంతో ఇరుగు పొరుగు వారు గమనించి, అపార్ట్‌మెంట్‌ వాట్సాప్‌ గ్రూపులో అందరినీ అప్రమత్తం చేశారు. పోలీసులకు, అగ్నిమాపక దళానికి, 108కి ఫిర్యాదు చేశారు.


ఫ్లాట్‌ తలుపులకు లోపలివైపు గడియ పెట్టి ఉండడం, ఎంత కొట్టినా తీయకపోవడంతో పోలీసులు గడియలు విరగ్గొట్టారు. అప్పటివరకు అగ్నిప్రమాదమని భావించగా, తలుపు తీసి చూసేసరికి లోపల రక్తపు మరకలతో నలుగురి శవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. తలుపు దగ్గర బంగారునాయుడి మృతదేహం, కొంచెం దూరంలో నిర్మల, మరికొంచెం దూరంలో కశ్యప్‌ శవాలు ఉన్నాయి. దీపక్‌ శవం మాత్రం బాత్‌రూమ్‌లో ఉంది. మొదటి ముగ్గురి శరీరంపై కత్తితో దాడి చేసినట్టుగా గాయాలు ఉన్నాయి. పెద్ద కుమారుడు దీపక్‌ శవంపై మాత్రం ఎటువంటి గాయాలు లేవు. నీట్‌గా డ్రెస్‌ వేసుకొని, టై కట్టుకొని, బ్లేజర్‌ వేసుకొని ఉన్నాడని చెబుతున్నారు. వారిని ఎవరైనా హత్య చేసి, కాల్చేశారా? లేక అగ్ని ప్రమాదంలో చనిపోయారా? అనేది అంతు చిక్కడం లేదు. 


చివరిగా ఇంట్లోకెళ్లింది బంగారునాయుడే..

బంగారునాయుడి మూడో అన్న కాంట్రాక్టర్‌ రమణ మాట్లాడుతూ, అందరితో చాలా సఖ్యతగా ఉంటారని, మర్యాదస్తులని, ఎటువంటి ఆస్తితగాదాలు లేవని చెప్పారు. దీపక్‌ తెలివైన వాడని, బాగా చదువుతాడన్నారు. ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదని, ఎవరిపైనా అనుమానాలు లేవని స్పష్టంచేశారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ సేకరించారు. బుధవారం రాత్రి 8.56 గంటలకు బంగారునాయుడు బయట నుంచి ఇంట్లోకి వచ్చారు. ఆ తరువాత ఆ ఇంట్లోకి ఎవరూ వెళ్లలేదు. అంటే లోపలే కుటుంబ సభ్యుల మధ్యే ఏదో గొడవ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య చెలరేగిన వివాదం... చేతులు దాటిపోయి దాడి చేసే స్థితికి వెళ్లిందని, దీపక్‌... ఆ ముగ్గురిని చంపేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.


ఆ ఫ్లాట్‌లో ఖాళీ వైన్‌ సీసాలు కనిపించాయి. తల్లిదండ్రులను, తమ్ముడిని చంపేసిన తరువాత వారి శవాలను దహనం చేయడానికి వైన్‌ ఉపయోగించి ఉంటాడని భావిస్తున్నారు. ఆ పొగల్లోనే ఊపిరి ఆడక దీపక్‌ మరణించి ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసులు ముగ్గురి మృతదేహాలపై కత్తిపోట్లు గుర్తించిన పోలీసులు ఫ్లాట్‌లో రెండు కత్తులు  స్వాఽధనం చేసుకున్నారు. 

Updated Date - 2021-04-16T09:53:58+05:30 IST