గొట్టిపాటిపై మళ్లీ పంజా

ABN , First Publish Date - 2021-01-27T06:48:11+05:30 IST

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ నేతల..

గొట్టిపాటిపై మళ్లీ పంజా
గుంటూరు జిల్లాలోని రవికుమార్‌ గ్రానైట్‌ ఫ్యాక్టరీల్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

టీడీపీ నేతల కట్టడే లక్ష్యం

ఎమ్మెల్యే రవికుమార్‌ గ్రానైట్‌ ఫ్యాక్టరీల్లో మరోసారి తనిఖీలు 

మిగిలిన గ్రానైట్‌ క్వారీల్లోనూ సోదాలు

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ మెరుపు దాడులు

టీడీపీ నేతలను నిరోధించే చర్యలకు శ్రీకారం 

నిన్న క్వారీల తరహాలో నేడు ఫ్యాక్టరీల మూసివేతకూ రంగం సిద్ధం


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ నేతల కట్టడికి ప్రభుత్వం శ్రీకారం పలికింది. అందుకోసం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అందులో భాగంగా జిల్లాలో ఆ పార్టీకి సీనియర్‌ ఎమ్మెల్యే(అద్దంకి) అయిన గొట్టిపాటి రవికుమార్‌ని టార్గెట్‌ చేసింది. ఆయన ఆర్థికమూలాలను దెబ్బతీసే విధంగా ఇప్పటికే ఆయన ప్రధాన క్వారీలను మూసివేయించిన ప్రభుత్వం మంగళవారం ఆయన గ్రానైట్‌ ఫ్యాక్టరీలపై చర్యలకు ఉపక్రమించింది. ఇటు స్థానిక ఎన్నికలు, అటు హైకోర్టులో రవికుమార్‌కి అనుకూల తీర్పులు వెలువడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయన పరిశ్రమలను కూడా మూసివేయించేందుకు రంగంలోకి రావటం రాజకీయ వర్గాల్లో సంచలనాలను రేకెత్తించింది. రవికుమార్‌ వ్యాపారాలపై మరింత వేటు ద్వారా జిల్లాలో ఆ పార్టీ సీనియర్‌ నాయకులు స్థానిక ఎన్నికలలో దూకుడుగా వ్యవహరించకుండా కట్టడి చేసే ఉద్దేశంతో పాలక పెద్దలు గనులు, భూగర్భశాఖ అధికారులను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. 


టీడీపీని బలహీనపర్చేందుకు యత్నం

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలను తమవైపు లాక్కునే ప్రయత్నాలకు శ్రీకారం పలికిన విషయం తెలిసిందే. అందుకు ఎక్కువమంది లొంగకపోవటంతో వివిధ రూపాల్లో ఇబ్బందులపాల్జేసే ప్రయత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా ఆ పార్టీలో ఉన్న వ్యాపార, పారిశ్రామికవేత్తల ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. కారణాలు ఏమైనా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు లాంటి వారు టీడీపీ గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. అద్దంకి, పర్చూరు ఎమ్మెల్యేలు రవి కుమార్‌, సాంబశివరావులను కూడా రాబట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ అవి ఫలించలేదు. 


స్థానిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి దాడులు 

ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు కూడా రావటంతో మరోసారి ప్రభుత్వం ఆ వైపు దృష్టిసారించింది. నూరుశాతం స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని వైసీపీ నేతలకు ఆ పార్టీ అధిష్టానం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయాన్నే రవికుమార్‌ క్వారీలు, ఫ్యాక్టరీల్లో అధికారులు తనిఖీలు ప్రారంభించడం చర్చనీయాంశమైంది. జిల్లా పరిధిలో రవికుమార్‌కు గతంలో ఉన్న క్వారీలన్నీ ఇప్పటికే మూతబడి ఉన్నాయి. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం యడవల్లి వద్ద కిషోర్‌ స్లాబ్‌ అండ్‌ టైల్స్‌, అలాగే రాజపేట వద్ద కిషోర్‌ స్టోన్స్‌ పేరుతో ఆయన క్వారీలు నడుస్తున్నాయి. వీటిలో మంగళవారం ఉదయం అధికారులు తనిఖీలు చేపట్టారు. చిలకలూరిపేటకు సమీపంలోని గణపవరం వద్ద రవికుమార్‌కు ఉన్న కిషోర్‌ గ్రానైట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అలాగే కిషోర్‌ స్టోన్స్‌లోకి ప్రవేశించిన అధికారులు పనులను నిలిపివేయించి సోదాలు చేపట్టారు.


అలాగే రవికుమార్‌కు మార్టూరు మండలం జొన్నతాళి వద్ద కూడా ఓ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ కూడా బుధవారం తనిఖీలు చేపడతామని అధికారులు వెల్లడించారు. మంగళవారం జరిగిన తనిఖీల్లో ప్రకాశంతోపాటు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల మైనింగ్‌, విజిలెన్స్‌ అధికారులు పాల్గొన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా, తనిఖీల సందర్భంగా ఎలాంటి వివరాలు చెప్పకుండా క్వారీలు, ఫ్యాక్టరీల్లో మొత్తం జరిగిన పనుల తీరును పరిశీలించడం, నిల్వ ఉన్న గ్రానైట్‌ రాళ్లను లెక్కించడం, అందుబాటులో ఉన్న రికార్డులను తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారు.


పూర్తిగా మూసివేతే లక్ష్యం 

గొట్టిపాటి రవికుమార్‌కి సంబంధించిన గ్రానైట్‌ వ్యాపారం మొత్తాన్ని స్తంభింపజేసి ఆయన ఆర్థిక మూలాలను పూర్తిగా దెబ్బతీయటమే లక్ష్యంగా ఈ తనిఖీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. రమారమి గత జనవరి నుంచి జిల్లాలోని బల్లికురవ, సంత మాగులూరు మండలాల్లో ఉన్న రవికుమార్‌ గ్రానైట్‌ క్వారీలు మూతబడ్డాయి. ఆయా క్వారీల్లో ఉన్న 9 లీజులను ప్రభుత్వం రద్దుచేసింది. వాటిని కోర్టు అంగీకరించకపోవటంతో క్వారీల్లో వెలికితీసిన నిక్షేపాల విక్రయాల పర్మిట్‌ను ఆపుచేశారు. దీంతో గత ఏడాదికాలం నుంచి జిల్లా పరిధిలోని ఆయన క్వారీలన్నీ మూతబడ్డాయి. గుంటూరు జిల్లాపరిధిలో ఉన్న ఒకటి రెండు చిన్న క్వారీల నుంచి వస్తున్న కొద్ది పాటి ముడిసరుకుతో తూతూమంత్రంగా ఫ్యాక్టరీ నిర్వహిస్తుండగా వాటిని మూసివేయించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంబించింది. 


కోర్టు కేసులు.. స్థానిక ఎన్నికలు 

రవికుమార్‌ కోర్టులో వేసిన కేసుల్లో సానుకూల తీర్పులు రావటం, అలాగే స్థానిక ఎన్నికల నేపథ్యమే ప్రభుత్వ తాజా ప్రతిచర్యకు కారణంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు రవికుమార్‌పై జిల్లాలోని ఆయా క్వారీలకు సంబంధించి నలభై నుంచి యాభై కేసుల వరకు గనులు, భూగర్భశాఖ అధికారులు నమోదుచేశారు. అయినా తొణకని రవికుమార్‌ న్యాయపోరాటం చేస్తున్నారు. పలు కేసులకు సంబంధించి న్యాయస్థానం స్టే ఇస్తూ వెంటనే ఆయా క్వారీల్లో వెలికితీసే నిక్షేపాల విక్రయానికి పర్మిట్లు ఇవ్వాలని ఆదేశించింది. అయినా పాలకుల సూచనలకనుగుణంగా అధికారులు పర్మిట్లుని జారీచేయలేదు. దీంతో అధికారులపై కోర్టు ధిక్కరణ నేరం కింద రవికుమార్‌ కోర్టు కెక్కారు. ఇదేసమయంలో నాలుగైదు నెలల నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఆయన విరివిగా పాల్గొనటం ప్రారంభించారు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా రవికుమార్‌ గుండెధైర్యాన్ని కొనియాడుతూ వస్తున్నారు. ఇటీవలే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీకి ఉత్సాహాన్ని చూపుతూ తనను సంప్రదిస్తున్న టీడీపీ నాయకులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. 


పట్టున్న నాయకుడు కావడమే కారణం

ఈ నేపథ్యంలో నూటికి నూరుశాతం స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తీసుకున్న అధికారపార్టీ బలమైన టీడీపీ నేతలను కట్టడి చేసేందుకు పూనుకుంటున్నట్లు వెల్లడవుతోంది. జిల్లాలో వరుసగా నాలుగు పర్యాయాలు గెలవటంతోపాటు టీడీపీలో పట్టున్న నాయకుడిగా రవికుమార్‌కి పేరుంది. దీంతో ఆయనను కట్టడి చేస్తే మిగిలిన నాయకులను కూడా భయభ్రాంతులకు గురిచేయవచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం రవికుమార్‌కి చెందిన ఇతర ఆర్థిక వనరులను దెబ్బతీసేందుకు సిద్ధమైందన్న భావన ఈ చర్యలతో వ్యక్తమవుతోంది. 


Updated Date - 2021-01-27T06:48:11+05:30 IST