మరో కేసు నమోదు

ABN , First Publish Date - 2020-06-01T09:16:28+05:30 IST

జిల్లాలో ఆదివారం మరో పాజిటివ్‌ కేసు నమోదైంది. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన 45 ఏళ్ల కూరగాయల వ్యాపారి ఇటీవల

మరో కేసు నమోదు

136కు చేరిన కరోనా బాధితుల సంఖ్య

ముగ్గురు డిశ్చార్జి

భౌతిక దూరమే కరోనా కట్టడికి అసలైన మందు : ఎస్‌పీ


కడప, మే 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో ఆదివారం మరో పాజిటివ్‌ కేసు నమోదైంది. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన 45 ఏళ్ల కూరగాయల వ్యాపారి ఇటీవల కరోనా బారిన పడి కడప ఫాతిమా కోవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి అతనికి సమీప బంధువని అధికారులు తెలిపారు. ఈ కేసుతో కలిపి ప్రొద్దుటూరులో కరోనా బాధితుల సంఖ్య 46కు చేరింది. జిల్లాలో ఈ సంఖ్య 136కు చేరినట్లు డీఎంహెచ్‌వో ఉమాసుందరి పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినతరం చేస్తామని జిల్లా అధికారులు వివరించారు. ప్రొద్దుటూరులోనే కాకుండా కడప, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల తదితర కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. 


ముగ్గురు డిశ్చార్జి : కడప ఫాతిమా మెడికల్‌ కాలేజీ జిల్లా కోవిడ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో ప్రొద్దుటూరుకు చెందిన ఒకరు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు ఇద్దరు కరోనా నుంచి కోలుకున్నారు. వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ.2 వేలు ఆర్థికసాయం, డ్రైప్రూట్స్‌, పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహార వస్తువులు అందించి ప్రత్యేక వాహనంలో వారి స్వస్థలాలకు తరలించారు. దీంతో కరోనా నుంచి జయించిన వారి సంఖ్య 108కి చేరింది. 


భౌతిక దూరమే కోరోనా కట్టడికి అసలైన మందు: కెకెఎన్‌ అన్బురాజన్‌, ఎస్పీ కడప

జిల్లాలో కరోనాను పూర్తిగా కట్టడి చేయాలంటే ప్రజలు భౌతికదూరం పాటించాలి, మాస్క్‌లు విధిగా ధరించాలి, కరోనా నివారణకు అదే అసలైన మందు. గ్రీన్‌జోన్లలో ఆంక్షల సడలింపు కొనసాగుతుంది. అన్ని రకాల దుకాణాల్లో భౌతిక దూరం విధిగా పాటించాలి. సూపర్‌మార్కెట్లు, చెప్పుల షాపులు, బంగారు దుకాణాల్లో 5-6 మందికి మించి అనుమతించరాదు. వారు తప్పకుండా మాస్క్‌లు ధరించి ఉండాలి. డాబాలు, రెస్లారెంట్లల్లో ప్యాకింగ్‌ పుడ్‌ మాత్రమే సరఫరా చేయాలి. గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు, వృద్ధులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవల కడప నగరంలో నమోదైన కేసులను పరిశీలిస్తే వివిధ జబ్బుల వైద్యం కోసం తిరుపతి, హైదరాబాదు, కర్నూలు పట్టణాల్లో ప్రైవేట్‌ హాస్పిటళ్లకు వెళ్లి వచ్చిన ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఏ జబ్బుతోనైనా సరే వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లే రోగితో పాటు సహాయకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌లు, గ్లౌజులు విధిగా ధరించాలి. 


కరోనా అప్‌డేట్స్‌


పట్టణం మొత్తం డిశ్చార్జి 

కడప 29 28

ప్రొద్దుటూరు 46 42

పులివెందుల 4 4

వేంపల్లె 2 2

బద్వేలు 5 5

మైదుకూరు          4 4

ఎర్రగుంట్ల 12 12

కమలాపురం 1 1

సీకేదిన్నె 1 1

చెన్నూరు 2 2

పుల్లంపేట 1 1

సంబేపల్లె 1 1

జమ్మలమడుగు 1 1

చిట్వేలు 1 1

రాయచోటి 2 --

ఓబులవారిపల్లె 1 --

మైలవరం 1 --

ఇతరులు         4 3

కువైట్‌ నుంచి వచ్చిన వారు 16 ---

మొత్తం 136 108


జిల్లాలో కరోనా వైరస్‌ శాంపిల్స్‌ రిజల్ట్స్‌ 

మొత్తం శాంపిల్స్‌   32401

రిజల్ట్స్‌ వచ్చినవి   31633

నెగటివ్‌   30865

పాజిటివ్‌   136 

రిజల్ట్స్‌ రావలసినవి   768

మే 31వ తేదీకి తీసిన శాంపిల్స్‌ 1165

డిశ్చార్జ్‌  108

Updated Date - 2020-06-01T09:16:28+05:30 IST